ఫ్లాప్ డైరెక్టర్ ఈసారి కొట్టేట్లే ఉన్నాడు

Update: 2015-08-06 23:03 GMT
త్రినాథరావు నక్కిన.. ఇదో డైరెక్టర్ పేరని గుర్తుపట్టడం కష్టమే. ఎందుకంటే ఈ డైరెక్టర్ తీసిన సినిమాలేవీ ఆడలేదు. ఒకటికి మూడు సినిమాలు తీశాడు కానీ.. ఏ సినిమా కూడా జనాల్ని ఆకట్టుకోలేదు. వరుణ్ సందేశ్ తో త్రినాథ రావు ప్రియతమా నీవచట కుశలమా, నువ్వలా నేనిలా అనే సినిమాలు తీసిన సంగతి కూడా జనాలకు తెలియదు. తనీష్ హీరోగా రూపొందించిన ‘మేం వయసుకు వచ్చాం’ మంచి సినిమా అని పేరు తెచ్చుకుంది కానీ.. ఆడలేదు. మామూలుగా అయితే మూడు ఫ్లాపులు తీసిన డైరెక్టర్ కు మరో అవకాశం రావడం కష్టం. కానీ త్రినాథ రావు ఈసారి మంచి ఛాన్సే కొట్టేశాడు. ఉయ్యాల జంపాల జంట రాజ్ తరుణ్, అవికా గోర్ లతో ‘సినిమా చూపిస్త మావా’ అనే సినిమా తీశాడు.

షూటింగ్ మొదలైనపుడు ఉయ్యాల జంపాల జంట మళ్లీ కనిపించనున్న సినిమా అని తప్పితే.. ఏ విధంగానూ ఆసక్తి కలిగించలేదు కానీ.. ఈ మధ్య ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి టాలీవుడ్ లో దీని గురించి బాగానే చర్చ జరుగుతోంది. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో సినిమా మీద ఆసక్తి మొదలైంది. ఇప్పుడు దిల్ రాజు సినిమా చూసి స్పెల్ బౌండ్ అయిపోయానని అనేయడంతో ఒక్కసారిగా అందరి చూపులూ దీని మీద పడ్డాయి. రాజు ఊరికే ఇలాంటి కబుర్లు చెప్పే టైపు కాదు. ఆయన డిస్ట్రిబ్యూట్ చేయాలని డిసైడయ్యాడంటేనే సినిమాలో కంటెంట్ ఉన్నట్లే. అందులోనూ ఈ మధ్య రాజు జడ్జిమెంట్ పవర్ మళ్లీ కనిపిస్తోంది. ‘శ్రీమంతుడు’ వచ్చిన వారానికే రిలీజ్ చేయాలనుకుంటున్నారంటే సినిమా మీద కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఫ్లాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న త్రినాథ రావు ఈ సారి హిట్టు కొట్టేట్లే కనిపిస్తున్నాడు.
Tags:    

Similar News