లేట్‌ వయసులో ఫామ్‌ లోకి వచ్చింది

Update: 2019-10-23 01:30 GMT
దాదాపు రెండు దశాబ్దాలుగా త్రిష సినిమాలు చేస్తూనే ఉంది. తెలుగు.. తమిళంలో స్టార్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకున్న త్రిష ఆమద్య కాస్త ఫేడ్‌ ఔట్‌ అయినట్లుగా అనిపించింది. రెండు మూడు సంవత్సరాలు ఈమెకు చిన్నా చితకా ఆఫర్లు మాత్రమే వచ్చాయి. త్రిషకు టాలీవుడ్‌ లో పెద్ద సినిమాలో ఆఫర్‌ వచ్చి దాదాపుగా అయిదు సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుండి కూడా తమిళంలో కెరీర్‌ ను నెట్టుకు వస్తున్న త్రిష అక్కడ కూడా ఫేమ్‌ కోల్పోయిందని.. ఇక త్రిష పనైపోయిందని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా త్రిషకు 96 మరియు పేట చిత్రాల్లో ఛాన్స్‌ వచ్చాయి.

ఆ సినిమాలతో మళ్లీ త్రిష బిజీ అయ్యింది. తమిళంలో ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్న త్రిషను తెలుగులో మెగాస్టార్‌ 152వ చిత్రం కోసం సంప్రదిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చిరంజీవి సరసన గతంలో స్టాలిన్‌ చిత్రంలో నటించి మెప్పించిన ఈమెకు మరోసారి చిరంజీవితో ఛాన్స్‌ వస్తే తెలుగులో కూడా ఈమె మళ్లీ బిజీ అవ్వడం కన్ఫర్మ్‌ గా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రాలే కాకుండా మణిరత్నం ప్రతిష్టాత్మకంగా రూపొందించబోతున్న ఛారిత్రాత్మక నేపథ్య చిత్రం పొన్నియన్‌ సెల్వం సినిమాలో కీలక పాత్ర కోసం త్రిషను సంప్రదించారట. పొన్నియన్‌ సెల్వం సినిమా మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. ఈ సినిమాను త్వరలోనే ఆయన ప్రారంభించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఐశ్వర్యరాయ్‌.. కార్తీ.. జయం రవి.. మోహన్‌ బాబు వంటి స్టార్స్‌ ఓకే చెప్పారని తెలుస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌ తో మణిరత్నం తీయబోతున్న ఈ చిత్రంలో త్రిషకు ఛాన్స్‌ రావడంతో ఆమె మళ్లీ ఫామ్‌ లోకి వచ్చినట్లే అంటూ అభిమానులు అంటున్నారు.

Tags:    

Similar News