అలా లేపేశారు మాంత్రికుల వారు

Update: 2016-06-03 04:38 GMT
త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలంటే.. తెలుగు ప్రేక్షకులు అందరికీ ఓ నమ్మకం. సినిమా సంగతి ఎలా ఉన్నా.. ఆయన పెన్ను నుంచి జారిన మాటల తూటాల్లో నాలుగింటినైనా గుర్తు పెట్టుకుని ఇంటికెళ్లిపోవచ్చు అనే ఫీలింగ్ చాలామందిలో ఉంది. కామెడీ లాంటివి ఏమైనా డోస్ తగ్గుతుందేమో కానీ.. ఆ పెన్నులో పదును కానీ, పవర్ కానీ తగ్గలేదు. ఇంతకు ముందు ఎవరికైనా ఏమైనా ఇలాంటి డౌట్స్ ఉంటే.. వాటిని అ..ఆ.. తో కంప్లీట్ గా తుడిచేశాడు త్రివిక్రమ్.

ఇంతటి ప్రతిభావంతుడైనా.. ఈ మాటల మాంత్రికుడిపై కొన్ని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా కామెడీ ట్రాక్ లను హాలీవుడ్ సినిమాల్లో కాన్సెప్ట్ లను - సీన్స్ ను పట్టుకొచ్చేస్తాడని అంటారు. గతంలో ఇలాంటి వాటిని ససాక్ష్యంగా విమర్శకులు ప్రూవ్ చేశారు కూడా. అయినా ఆయన మాటల పవర్ ముందు.. ఇలాంటివేమీ ఆడియన్స్ వినిపించలేదు, కనిపించలేదు. ఒక వేళ అనిపించినా పట్టించుకోలేదు కూడా.

ఇప్పుడు అ..ఆ.. చిత్రం టోటల్ స్టోరీపైనా ఓ కాపీ ఆరోపణ వస్తోంది. ఓ 45 ఏళ్ల క్రితం మీనా అనే తెలుగు సినిమా ఒకటి వచ్చింది. కృష్ణ - విజయనిర్మల నటించిన ఆ సినిమాను.. స్వయంగా విజయనిర్మలే దర్శకత్వం వహించారు. యద్దనపూడి సులోచనా రాణి రాసిన మీనా నవలకు తెరరూపమే ఈ మూవీ. ఇప్పుడు అ..ఆ.. చిత్రం కంప్లీట్ గా అదే స్టోరీ లైన్ అంటున్నారు కాస్త వయసు మీరినవారు. యద్దనపూడి సాహిత్యం చదివినవారైతే.. ఔరా త్రివిక్రమ్ ఇలాంటి పని చేశాడా అని ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇప్పటివరకూ కామెడీ సీన్స్ కి మాత్రమే పరిమితమైన త్రివిక్రమ్ కాపీ క్రియేటివిటీ.. ఇప్పుడు టోటల్ లైన్ వరకూ వచ్చేసిందా అంటున్నారు విమర్శకులు. అనే వాళ్లు ఎప్పుడూ అంటూనే ఉంటారు కానీ.. సాహిత్యంపై అపారమైన పరిజ్ఞానం ఉన్న త్రివిక్రమ్ కూడా ఈ నవల చదివే ఉంటారు కదా అన్నది అసలు డౌట్. ఇవన్నీ విన్నాక.. గురువుగారూ! మీరు కూడా ఇలా లేపేయడం న్యాయమా అని అభిమానులు వాపోతున్నారు.
Tags:    

Similar News