నవ్వినా అంటారు ఏడ్చినా అంటారు!

Update: 2018-10-28 14:30 GMT
అరవింద సమేత వీర రాఘవ సక్సెస్ తో త్రివిక్రమ్ రిలాక్స్  అయ్యాడు. మరీ ఇండస్ట్రీ రికార్డులన్నీ  బద్దలు కొట్టి చరిత్రలో నిలిచిపోయిన సినిమా కాదు కానీ అజ్ఞాతవాసి తాలూకు చేదు జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతున్న తరుణంలో అర్జెంట్ గా ఒక హిట్టు కొట్టాల్సిన అవసరాన్ని ఇది పూర్తిగా తీర్చేసింది. కాకపోతే సినిమాను రిసీవ్ చేసుకునే విషయంలో అటు ప్రేక్షకులు కానీ ఇటు విమర్శకులు కానీ ఎలా ఉన్నారో దీని వల్ల బాగా తేటతెల్లమవుతోంది.

అజ్ఞాతవాసికి అరవింద సమేతకు కొన్ని పోలికలు ఉన్నాయి. రెండింటిలో హీరో తండ్రి చనిపోతాడు ఓపెనింగ్ సీన్లు అవే. పవన్ సినిమాలో నాన్న చనిపోయాడు అని తెలుసుకుని వచ్చిన హీరో సీరియస్ రివెంజ్ కు వెళ్లకుండా ఆఫీస్ లో అర్థం లేని కామెడీ చేస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటాడు. అప్పట్లో దీని మీదే కామెంట్స్ వచ్చాయి. విషాదం కొంచెం కూడా లేకుండా  ఆ పాత్ర అలా ప్రవర్తించడాన్ని అందరు తప్పు బట్టారు కూడా.  

కట్ చేస్తే అరవింద సమేత వీర రాఘవ కూడా అచ్చం అదే తరహాలో హీరో నాన్న హత్యతోనే స్టార్ట్ అవుతుంది. కానీ ఆ తర్వాత వీర రాఘవ పాత్ర చాలా సీరియస్ గా ఉంటుంది. పూజా హెగ్డే ఇంట్లో తప్ప ఎక్కడా కనీసం అరనవ్వు కూడా రువ్వదు. దీన్ని కామెంట్ చేసిన వాళ్ళు లేకపోలేదు. ఎంటర్ టైన్మెంట్ లేకుండా అంత సీరియస్ గా ఉంటే ఎలా అంటూ విమర్శించినవాళ్ళు లేకపోలేదు. ఇక్కగా గమనించాల్సిన అంశం ఏంటంటే రెండు సందర్భాల్లోనూ  కామెంట్స్ వచ్చాయి. కాని అరవింద సమేత సక్సెస్ అయ్యింది. కారణం ఎంత ఎమోషన్ ఉండాలో అంతే చూపడం అవసరం లేదు అనుకున్న కామెడీని కొంత  మోతాదుకే పరిమితం చేసి కథనం మీద ఫోకస్ పెట్టడం. దీని వల్ల యంగ్ టైగర్ ఖాతాలో మరో హిట్టు పడింది.

సో త్రివిక్రమ్ అయినా ఏ దర్శకుడు అయినా కథను సీరియస్ గా మలుపు తిప్పినప్పుడు తర్వాత  నడవాల్సిన  ఎమోషన్స్ ని సరైన రీతిలో బాలన్స్ చేసుకోకపోతే ఏమవుతుందో  దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎంత పెద్ద స్టార్ అయినా ఇక్కడ కంటెంటే కింగ్. ఇది అర్థం చేసుకున్నవాళ్ళు సక్సెస్ అందుకుంటున్నారు లేదూ తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనుకుంటున్న  వాళ్ళు ఫెయిల్ అవుతూనే ఉన్నారు.
    

Tags:    

Similar News