అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రం వద్దనుకున్నా-త్రివిక్రమ్

Update: 2018-10-28 06:48 GMT
సినీ పరిశ్రమలోకి దర్శకుడిగా మారాలంటే అసిస్టెంట్ డైరెక్టర్ కావడమే మార్గం అనుకునే వాళ్లు ఒకప్పుడు. దశాబ్దాల తరబడి చాలామంది ఈ బాటనే అనుసరించారు. ఏడీగా ఏళ్లు దశాబ్దాలు పని చేసి.. ఆ తర్వాత దర్శకులుగా మారేవాళ్లు ఒకప్పుడు. కానీ గత రెండు దశాబ్దాల్లో పరిస్థితి మారింది. దర్శకుడిగా మారడానికి రచన అనేది చాలా దగ్గరి దారిగా మారింది. ఈ విషయంలో చాలామందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన బాటలో పదుల సంఖ్యలో రచయితలు దర్శకులుగా మారారు. దీన్నొక ట్రెండ్ లాగా మార్చేశాడు త్రివిక్రమ్. మరి అందరూ దర్శకత్వ శాఖలో పని చేస్తుంటే.. త్రివిక్రమ్ మాత్రం ఎందుకు రచనలోకి వచ్చాడు.. అసలు దర్శకత్వం గురించి అతను ముందు ఆలోచించలేదా అన్న సందేహాలు జనాల్లో ఉన్నాయి. ఈ సందేహాలకు త్రివిక్రమ్ ఒక ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చాడు.

నిజానికి త్రివిక్రమ్ కు 8-9 తరగతుల్లో ఉన్నపుడే దర్శకత్వం మీద ఇష్టం కలిగిందట. పదో తరగతికే అదే లక్ష్యం అని ఫిక్సయిపోయాడట. డిగ్రీ అయ్యాక ఇక సినిమాల్లోకి వెళ్లిపోవాలని బలంగా అనుకున్నాడట. కాకపోతే తాను పీజీ చేయాలని తన తండ్రి కోరిక అని.. దీనికి తోడు చదవలేక.. చదువు రాక సినిమాల్లోకి వచ్చాడు అన్న మాట ఉండకూడదని భావించి.. న్యూక్లియర్ ఫిజిక్స్ లో పీజీ చేశానని.. తర్వాత సినిమాల్లోకి వెళ్లడానికి సిద్ధపడ్డానని చెప్పాడు. తనకు చిన్నప్పట్నుంచి రచన మీద ఆసక్తి ఉండేదని.. ఐతే దర్శకుడిగా మారాలనుకున్నాక ఎట్టి పరిస్థితుల్లోనూ అసిస్టెంట్ డైరెక్టర్ గా మాత్రం చేయొద్దని గట్టి నిర్ణయం తీసుకున్నానని త్రివిక్రమ్ చెప్పాడు. అప్పట్లో కృష్ణవంశీ.. ఈవీవీ సత్యనారాయణ లాంటి దర్శకులు బాగా బిజీ అని.. వాళ్ల దగ్గర పని చేయడానికి పదుల సంఖ్యలో కుర్రాళ్లు ఎదురు చూస్తుండేవాళ్లని.. తనూ వాళ్లలా ఎదురు చూస్తుంటే చాలా ఏళ్లు వృథా అయిపోతాయని.. అందుకే దర్శకత్వం మీద అవగాహన పెంచుకోవడానికి.. సినిమా మేకింగ్ ను దగ్గరగా చూడ్డానికి వీలున్నది.. మనకు నప్పేది రచనే అని భావించి అందులో అడుగు పెట్టానని త్రివిక్రమ్ చెప్పాడు.


Tags:    

Similar News