ఎన్టీఆర్‌ ను చూశాం.. ఇక త్రివిక్రమ్?

Update: 2018-08-19 11:11 GMT
స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలైన ‘అరవింద సమేత’ టీజర్ ఎన్టీఆర్ అభిమానుల్ని.. మాస్ ప్రేక్షకుల్ని అలరించింది. ‘జై లవకుశ’ తర్వాత తారక్ నుంచి మరో మాస్ ఎంటర్టైనర్ చూడబోతున్నామని ఈ టీజర్ సంకేతాలిచ్చింది. ఐతే టీజర్లో కొత్తదనం లేదని.. త్రివిక్రమ్ మార్కు మిస్సయిందని అసంతృప్త గళాలు కూడా వినిపించాయి. ఇది అసలు త్రివిక్రమ్ సినిమానేనా.. మరీ అంత మాస్ ఏంటి అని కూడా కామెంట్లు పడ్డాయి. ఈ ఫీడ్ బ్యాక్ చిత్ర బృందం వరకు చేరినట్లు సమాచారం. త్రివిక్రమ్ అభిమానుల్ని నిరాశ పరచకుండా ఈ సినిమా నుంచి ఇంకో టీజర్ వదలాలని ‘హారిక హాసిని క్రియేషన్స్’ టీం ఫిక్సయిందట. త్వరలోనే ఆ రెండో టీజర్ బయటికి వస్తుందని అంటుున్నారు.

త్రివిక్రమ్ నుంచి సాధారణంగా ఆయన అభిమానులు ఆశించేది ఎంటర్టైన్మెంట్. ఆయనకు క్లాస్ ఫ్యాన్స్ ఎక్కువ. కుటుంబ ప్రేక్షకులు ఆయనపై చాలా అంచనాలతో ఉంటారు. రెండో టీజర్లో ‘అరవింద సమేత’లోనే రెండో కోణం చూపిస్తారట. ఇందులో కుటుంబ ప్రేక్షకులకు.. యూత్ కు నచ్చే అంశాలుంటాయని.. రొమాంటిక్ ఎంటర్టైనర్ టచ్ అందులో కనిపిస్తుందని అంటున్నారు. తొలి టీజర్ మొత్తాన్ని ఎన్టీఆరే ఆక్రమించేశాడు. సునీల్ ఒక్కడు అలా కనిపించి కనిపించనట్లు దర్శనమిచ్చాడు. జగపతిబాబు వాయిస్ వినిపించింది. అంతే తప్ప హీరోయిన్ కానీ.. ఇంకెవ్వరికి కానీ అందులో చోటు లేకపోయింది. రెండో టీజర్లో పూజా హెగ్డే సహా మిగతా ప్రధాన తారాగణం కూడా కనిపిస్తారట. ఎన్టీఆర్-పూజా హెగ్డేల క్లాస్ లుక్స్ చూపిస్తూ ఆ మధ్య రిలీజ్ చేసిన ‘అరవింద సమేత’ మోషన్ పోస్టర్ తరహాలో టీజర్ ఉంటుందట. ప్రస్తుతం వర్క్ నడుస్తోందని.. త్వరలోనే రెండో టీజర్ లాంచ్ డేట్ ప్రకటిస్తారని సమాచారం.
Tags:    

Similar News