మంచు వారి ట్రోలింగ్ కి బీజం ఎక్క‌డ ప‌డింది?

Update: 2022-02-21 16:30 GMT
సోష‌ల్ మీడియా వేదిక‌గా మంచు వారిపై గ‌త కొన్ని రోజులుగా ట్రోలింగ్ ఆగ‌డం లేదు. ప‌లు మీమ్స్ తో నెట్టింట టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు నెటిజ‌న్స్ .

ఇంత‌కీ ఈ ట్రోలింగ్ కి బీజం ఎక్క‌డ ప‌డింది?.. ఎందుకు జ‌రుగుతోంది? అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌మ‌ని ట్రోల్ చేయ‌డం వెన‌క ఇద్ద‌రు స్టార్ హీరోలు వున్నార‌ని, యాభై నుంచి వంద మందిని పెట్టుకుని ప్ర‌త్యేకంగా త‌న‌ని ట్రోల్ చేయిస్తున్నార‌ని మోహ‌న్ బాబు చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

ఇంత‌కీ ఆ ఇద్ద‌రు స్టార్ హీరోలు ఎవ‌రు? .. ఎందుకు త‌న వెంట ప‌డుతున్నారు? అన్న‌ది మాత్రం మోహ‌న్ బాబు స్ప‌ష్టం చేయ‌లేదు. అయితే త‌మ‌ని ట్రోల్ చేస్తున్న వారిపై ప‌ది కోట్ల‌కు ప‌రువు న‌ష్టం దావా వేస్తానంటూ మోహ‌న్ బాబు ప్ర‌క‌టించ‌డంతో ఇంత‌కీ వీరి ట్రోలింగ్ కి బిజం ఎక్క‌డ ప‌డింది? . ఎందుకు వీరి నే నెటిజ‌న్స్ టార్గెట్ చేశార‌న్న‌ది ఇప్ప‌డు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

 గ‌త కొంత కాలంగా మెగా - మంచు వ‌ర్గాల మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం న‌డుస్తోంద‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో తాజా ప‌రిణామాలు చోటు చేసుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

`మా` ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాల గురించి అంద‌రికి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో మంచు విష్ణు అధ్య‌క్షుడిగా పోటీగా దిగారు. అంత‌కు ముందే ప్ర‌కాష్ రాజ్ త‌న‌కు మెగాస్టార్ మ‌ద్ద‌తు వుందంటూ స్వ‌యంగా ప్ర‌క‌టించారు.

దాన్ని దృవీక‌రిస్తూ మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న మ‌ద్ద‌తు తెలుపుతూ ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ తో క‌లిసి మీడియాతో మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆ త‌రువాత జ‌రిగిన ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక‌గా మెగాస్టార్ చిరంజీవి `మా` ఎన్నిక‌ల పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. `మా` ఎన్నిక‌ల‌ని రాజ‌కీయం చేయ‌డం త‌గ‌దంటూ బాహాటంగానే అన్నారు.

ఈ ఇద్ద‌రి వ్యాఖ్య‌ల‌పై మంచు విష్ణు స్పందించారు. ప్ర‌కాష్ రాజ్ నాన్ లోక‌ల్ అని, త‌న‌కు మాత్ర‌మే మెగాస్టార్ మ‌ద్ద‌తు వుంద‌ని, ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇక్క‌డి నుంచే అస‌లు ర‌చ్చ మొద‌లైంది. `మా` ఎన్నిక‌ల సంద‌ర్భంగా మంచు విష్ణు చేసిన వ్యాఖ్య‌ల‌ని వ్యగ్యంగా కామెంట్ చేస్తూ మీమ్స్ తో నెట్టింట నెటిజ‌న్స్ కొంత మంది కామెంట్ లు చేయ‌డంమొద‌లుపెట్టారు.

ప్ర‌కాష్ రాజ్ కు మ‌ద్ద‌తునివ్వ‌డం ప్రారంభించారు. నాన్ లోక‌ల్ అయినా త‌ను చెప్పిన విధానం బాగుంద‌ని, అలాంటి వ్య‌క్తే `మా` కు అధ్య‌క్షుడు కావాలంటే ప‌లువురు నెటిజ‌న్ లు మ‌ద్ద‌తు తెలుపుతూ మంచి విష్ణుని ట్రోల్ చేయ‌డం ప్రారంభించారు.

ఆ త‌రువాత కూడా ప‌రిస్థితిలో ఎలాంటి మార్పు రాక‌పోవ‌డం, మంచు విష్ణు అధ్యక్షుడిగా గెల‌వ‌డం.. ప్ర‌కాష్ రాజ్ ఓడిపోవ‌డంతో ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ త‌రుపున గెలిచిన వారంతా మూకుమ్మ‌డిగా రాజీనామా చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఆ త‌రువాత ఇటీవ‌ల చిరంజీవి ప్ర‌త్యేకంగా ప్ర‌భాస్ - రాజ‌మౌళి - మ‌హేష్ - కొర‌టాల శివ‌ల‌తో క‌లిసి ఏపీ ముఖ్య‌మంత్రిని సినీ ఇండస్ట్రీ స‌మ‌స్య‌ల‌పై క‌లిసి ప్ర‌త్యేకంగా భేటీ కావ‌డం... త్వ‌ర‌లోనే ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల‌కు ఎండ్ కార్డ్ ప‌డుతుంద‌ని మీడియా ముఖంగా చెప్ప‌డం జ‌రిగింది.

అయితే ఆ త‌రువాత మంచు విష్ణు ప్ర‌త్యేకంగా వెళ్లి ఏపీ ముఖ్య‌మంత్రితో భేటీ కావ‌డం.. బ‌య‌టికి వ‌చ్చి ఇది మామూలు మీటింగే అని చెప్పడం అలా చెబుతూనే ప‌లు స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్యేకంగా చ‌ర్చించామ‌ని అన‌డంతో నెట్టింట మ‌ళ్లీ ట్రోలింగ్ మొద‌లైంది.

మెగాస్టార్ లాంటి వ్య‌క్తి ప్ర‌త్యేకంగా స్టార్ హీరోల‌తో క‌లిసి భేటీ అయిన త‌రువాత మంచు విష్ణు ప్ర‌త్యేకంగా క‌ల‌వ‌డం.. మ‌ళ్లీ ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల‌పై క‌ల‌వ‌లేదంటూనే స‌మ‌స్య‌ల గురించి ప్ర‌త్యేకంగా చ‌ర్చించామ‌ని చెప్ప‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.

ఇది జ‌ర‌గ‌కుండా వుండాల్సింద‌ని, చిరు లాంటి వ్య‌క్తి ప్ర‌త్యేకంగా భేటీ అయిన త‌రువాత మంచు విష్ణు భేటీ కావ‌డం ప‌లువురిని హ‌ర్ట్ చేసింద‌ని ఆ కార‌ణంగానే నెట్టింట ట్రోలింగ్ జరిగింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు స‌గ‌టు ప్రేక్ష‌కులు చ‌ర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News