భర్త లుక్ చూసి వణికిపోయిన హీరోయిన్

Update: 2016-11-22 05:49 GMT
రజినీకాంత్ సినిమా అంటే ఫస్ట్ లుక్ దగ్గర్నుంచి.. ఏ విషయంలో అయినా ఆయనే హైలైట్ కావాలి. ఆయన గురించే చర్చ జరగాలి. ఐతే ‘రోబో’ సీక్వెల్ ‘2.0’ విషయంలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. మొన్నే విడుదలైన ‘2.0’ ఫస్ట్ లుక్ పోస్టర్లలో రజినీ లుక్ అదిరిపోయిందనే ఫీడ్ బ్యాక్ వస్తున్నప్పటికీ.. ఇందులో అక్షయ్ కుమార్ లుక్ మరింతగా చర్చనీయాంశం అవుతోంది. ప్రేక్షకులకు ఒకరకమైన భయం పుట్టించేలా అద్భుతంగా ఈ అక్షయ్ లుక్ ను తీర్చిదిద్దింది ‘2.0’ యూనిట్. సామాన్య ప్రేక్షకులే కాదు.. ఒకప్పటి హీరోయిన్ అయిన అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా సైతం ఈ లుక్ చూసి జడుసుకుందట.

‘‘అక్షయ్ తో నా పెళ్లయి 15 ఏళ్లవుతోంది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆయన నన్ను భయపెట్టారు. ‘2.0’లో అక్షయ్ లుక్ చూసి వణికిపోయాను’’ అని ట్వింకిల్ ఖన్నా వ్యాఖ్యానించింది. ‘రోబో’లో హీరోనూ రజినీనే. మెయిన్ విలన్ కూడా రజినీనే. ఇంకో విలన్ పాత్ర అంత ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఐతే ‘2.0’లో రజినీకి దీటుగా అక్షయ్ ని విలన్ గా చేశాడు శంకర్. వాస్తవానికి ఈ పాత్రను హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ తో చేయించాలనుకున్నారు. కానీ కుదర్లేదు. అయినప్పటికీ ఆ పాత్ర వెయిట్ ఏమీ తగ్గలేదు. అక్షయ్ కుమార్ లాంటి బాలీవుడ్ సూపర్ స్టార్ తో ఈ క్యారెక్టర్ చేయించడం ద్వారా దేశవ్యాప్తంగా ‘2.0’పై ఆసక్తి నెలకొనేలా చేశాడు శంకర్. రజినీ వెర్సస్ అక్షయ్ పోరును చూడ్డానికి చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు జనాలు. ఆ ఉత్కంఠకు వచ్చే ఏడాది దీపావళి నాడు తెరపడనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News