టీవీ న‌టి ఆత్మ‌హ‌త్యాలో అన్ని ట్విస్టులా?

Update: 2022-12-27 04:22 GMT
20 ఏళ్ల యువ టీవీ న‌టి తునీషా శర్మ మరణం సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. తొలుత సెట్లో ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని ప్ర‌చార‌మైంది. కానీ పోలీసులు అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసి విచారిస్తున్నారు. తునీషా స‌హ‌న‌టుడు 'అలీ బాబా దస్తాన్-ఇ-కాబుల్' నటుడు షీజన్ ఖాన్ ని నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

ముంబైలోని వసాయ్ కోర్టు స‌ద‌రు నటుడిని  విచారించ‌గా తాము స‌హ‌జీవ‌నంలో ఉన్నామ‌ని కానీ విడిపోయిన తర్వాత తునీషా ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని త‌న త‌ర‌పు వాద‌న‌ను వినిపించాడు. తునీషా గతంలో కూడా ఆత్మహత్యకు ప్రయత్నించిందని అతను పేర్కొన్నాడు.  

అలీ బాబా దస్తాన్-ఇ-కాబూల్ లో తునీషా (20) షెహజాదీ మరియమ్ పాత్ర పోషించింది. ఇందులో షీజ‌న్ ఖాన్ స‌హ‌న‌టుడు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వసాయ్ లో ఫాంటసీ నేపథ్య షో చిత్రీక‌ర‌ణ సాగుతోంది. ఈ షో సెట్స్ లో డిసెంబర్ 24 న తునీషా మరణించినట్లు క‌థ‌నాలొచ్చాయి. పోలీసు అధికారుల క‌థ‌నం ప్రకారం .. యువ నటి బాత్రూంలో ఉరి వేసుకుని కనిపించింది. తునీషా మాజీ ప్రియుడు 'అలీ బాబా దస్తాన్-ఎ-కాబూల్' సహనటుడు షీజాన్ ఖాన్ త‌న కుమార్తెను ఆత్మహత్యకు ప్రేరేపించార‌ని న‌టి త‌ల్లి ఆరోపించ‌గా ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. అనంత‌రం షీజ‌న్ ని అరెస్టు చేశారు. ముంబైలోని వసాయ్ కోర్టు షీజాన్ ఖాన్ ని నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపగా అత‌డు ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన వాద‌న‌లు వినిపించాడు. తాము విడిపోయిన తర్వాత తునీషా గతంలో కూడా ఒక‌సారి ఆత్మహత్యకు ప్రయత్నించిందని అప్పుడు తాను రక్షించాన‌ని కూడా పేర్కొన్నాడు.

ప్ర‌ముఖ జాతీయ మీడియా క‌థ‌నం ప్రకారం.. షెజాన్ పోలీసు అధికారులతో మాట్లాడుతూ శ్రద్ధా వాకర్ కేసుతో తాను కలవరపడ్డానని ''భయంకరమైన హత్య తర్వాత దేశంలో వాతావరణం క‌ల‌త‌కు గురి చేసింద‌ని.. తునీషాతో ఆ క్ష‌ణం తన సంబంధాన్ని వ‌దులుకోవాలని నిర్ణయించుకున్నానని.. ఆ త‌ర్వాత‌ మేం ఇరువురం వేర్వేరుగా ఉన్నామ‌''ని పేర్కొన్నారు.

తునీషా వయస్సు 20. షెజాన్ ఖాన్‌ వయస్సు 28. శ్రద్దా వాకర్ ను ఆమె లైవ్-ఇన్ భాగస్వామి ఆఫ్తాబ్ పూనావాలా దారుణంగా హత్య చేసి ముక్కలుగా నరికి ఆమె శరీర భాగాలను ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో విసిరారు. దీనిగురించి షెజాన్ ఖాన్  ప్ర‌స్థావించాడు. తాను క‌ల‌త‌కు గుర‌య్యాన‌ని అందుకే త‌న ప్రియురాలికి దూరంగా ఉన్నాన‌ని తెలిపాడు.

పోలీసులతో మాట్లాడుతూ- తునీషా శర్మ గతంలో ఆత్మహత్యాయత్నం చేసిందని షీజన్ ఖాన్ ఆరోపించారు. తునీషా తన మరణానికి కొన్ని రోజుల ముందు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే ఆ సమయంలో నేను ఆమెను రక్షించాను.. ఇక‌పై త‌న విష‌యంలో ప్రత్యేక జాగ్ర‌త్త తీసుకోవాల‌ని తునీషా తల్లికి చెప్పాను.. అని షీజ‌న్ విచార‌ణ‌లో తెలిపాడు.

అయితే ఈ వాదనను తునీషా మామ పవన్ శర్మ ఖండించారు. అత‌డు మాట్లాడుతూ..ఆ ఇద్దరూ మేకప్ రూమ్ లో భోజనం చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. మమ్మల్ని రమ్మని మాకు కాల్ వచ్చింది! అని పవన్ శర్మ తెలిపారు. తునీషా ఎప్పుడూ ఆత్మహత్యకు ప్రయత్నించలేదు. ఆమె చాలా ఒత్తిడికి లోనైంది. అందుకే త‌న‌ తల్లి ఆమె గురించి ఆందోళన చెందింది అన్నారాయన.

తునీషా తల్లి వనితా శర్మ... స‌హ‌న‌టుడు షీజ‌న్ ఖాన్ త‌న కుమార్తెను  ఆత్మహత్యకు ప్రేరేపించాడ‌ని ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 25న అత‌డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ జంట‌ రిలేషన్ షిప్ లో ఉన్నారని 15 రోజుల క్రితమే విడిపోయారని కూడా మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి. విడిపోయిన క్ర‌మంలోనే దివంగత నటి తునీషా ఒత్తిడికి గురైంద‌ని మీడియా క‌థ‌నాలు వెల్ల‌డించాయి. ఒక‌వేళ ఆత్మ‌హ‌త్య‌కు ఈ కార‌ణాలు ప్రేరేపించి ఉంటాయ‌ని కూడా విశ్లేష‌ణ‌లు వెలువ‌డ్డాయి. అయితే అంతిమంగా తునీషా మ‌ర‌ణానికి కార‌ణం ఏమిటో పోలీసుల ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి కావాల్సి ఉంది.

అయితే షీజన్ తన కుమార్తెను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేసినట్లు తునీషా త‌ల్లి వనిత ఆరోపించారు. అతడు తనను మోసం చేశాడని కూడా ఆరోపించింది. ''మరో అమ్మాయితో సంబంధం క‌లిగి ఉన్నప్పటికీ అతను తునీషాతో సంబంధాన్ని కొనసాగించాడు. మూడు-నాలుగు నెలల పాటు ఆమెను వాడుకున్నాడు. షీజన్ కి శిక్ష పడాలి. అతడిని విడిచిపెట్టకూడదు అని మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను. నా బిడ్డను పోగొట్టుకున్నాను'' అని వనిత చెప్పింది.

ఆదివారం ఉదయం ముంబైలోని జెజె ఆసుపత్రిలో దివంగ‌త తునీషాకు పోస్ట్ మార్టం నిర్వహించారు. శవపరీక్ష కోసం ఐదుగురు వైద్యుల బృందం హాజరైంది. ఆదివారం ఉదయం 11 గంటలకు ఆమె భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె శరీరంపై గాయాల ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆమె ''ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందికి గుర‌వ‌డంతో మరణించింది'' అని నివేదిక పేర్కొంది.

దర్యాప్తు జరుగుతుండగా సీనియర్ పోలీసు అధికారి ఒక ప్రకటనలో ''నాయిగావ్ లో షూట్ జరుగుతున్న రామ్ దేవ్ స్టూడియో లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. షాట్ గ్యాప్ లో తునీషా బాత్రూమ్ కు వెళ్లినప్పుడు ఇది జ‌రిగింది. ఆమె అక్కడ ఉరి వేసుకుంది. సెట్స్ లోని స‌హ‌చ‌రులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ తునీషా చనిపోయిందని ప్రకటించారు. ఇది ప్రాథమిక సమాచారం. మా బృందం సంఘటనా స్థలంలో ఉంది. వారు దర్యాప్తు చేస్తున్నారు. అందరి వాంగ్మూలం తీసుకుంటాం... అని తెలిపారు.

శనివారం సెట్స్ లో ఉన్న ప్రతి ఒక్కరినీ వలీవ్ పోలీసులు ప్రశ్నించారు. తునీషా ఎలాంటి సూసైడ్ నోట్ ను రాయ‌లేద‌ని సమాచారం. హత్య- ఆత్మహత్య అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. తునీషా శర్మ - షీజన్ ఖాన్ ల మధ్య చాట్ లు కాల్ లు .. సంఘటనకు దారితీసిన కార‌ణాల‌ను ప‌రిశీలించేందుకు ఆ ఇద్దరి ఫోన్ లు ఫోరెన్సిక్ లకు పంపించారు. తునీషా శర్మ కూడా బాలనటిగా పరిశ్ర‌మ‌లో ప్ర‌వేశించి అంద‌రి మ‌న్న‌న‌లు పొందింది. ఫితూర్ లో యువ కత్రినా కైఫ్ చిన్న‌ప్ప‌టి పాత్రను పోషించింది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News