'నాంది' మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

Update: 2023-01-03 11:00 GMT
త‌న‌దైన మార్కు కామెడీ సినిమాల‌కు పూర్తి భిన్నంగా అల్ల‌రి నరేష్ న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ మూవీ 'నాంది'. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల తెర‌కెక్కించిన ఈ మూవీతో అల్ల‌రి న‌రేష్ లోని కొత్త కోణం బ‌య‌ట‌ప‌డింది. అంత వ‌ర‌కు కామెడీ ప్ర‌ధాన చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన అల్ల‌రి న‌రేష్ ఈ మూవీతో కామెడీనే కాదు సీరియ‌స్ సినిమాల‌తోనూ మెప్పిచ‌గ‌ల‌న‌ని నిరూపించాడు. చేయ‌ని త‌ప్పుకు శిక్ష అనుభ‌వించి దానికి కార‌ణ‌మైన వారిపై ప‌గ తీర్చుకునే పాత్ర‌లో అల్ల‌రి న‌రేష్ న‌ట‌కు అంతా ఫిదా అయ్యారు. బాక్సాఫీస్ వ‌ద్ద 'నాంది' సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టి ఈ త‌ర‌హా సీరియ‌స్ సినిమాల్లోనూ న‌రేష్ రాణించ‌గ‌ల‌డ‌ని నిరూపించారు.  

గ‌త కొంత కాలంగా కామెడీ మార్కు సినిమాల‌తో విజ‌యం కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసిన అల్ల‌రి న‌రేష్ కెరీర్ ని విజ‌య్ క‌న‌క‌మేడ‌ల తెర‌కెక్కించిన 'నాంది' కొత్త మ‌లుపు తిప్పి మంచి విజ‌యాన్ని అందించింది.

ఈ మూవీ త‌రువాత త‌న పంథా మార్చుకున్న అల్లరోడు క‌థా బ‌ల‌మున్న సీరియ‌స్ క‌థ‌ల‌కే ప్రాధాన్యం ఇవ్వ‌డం మొద‌లుపెట్టాడు. ఇదిలా వుండే 'నాంది' మూవీతో సీరియ‌స్ హిట్ ని త‌మ ఖాతాలో వేసుకున్న అల్ల‌రి న‌రేష్‌, విజ‌య్ క‌న‌క‌మేడ‌ల తాజాగా మ‌రో సీరియ‌స్ స్టోరీతో రాబోతున్నారు.

సీరియ‌స్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీకి 'ఉగ్రం' అనే టైటిల్ ని ఇటీవ‌లే చిత్ర బృందం ప్ర‌క‌టించ‌డం.. ఈ టైటిల్ కి, అల్ల‌రి న‌రేష్ ఫ‌స్ట్ లుక్ కి విశేష స్పంద‌న ల‌భించిన విష‌యం తెలిసిందే. మిర్నా హీరోయిన్. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, టైటిల్ తో సినిమాపై భారీ బ‌జ్ క్రియేట్ కావ‌డంతో చిత్ర బృందం ఈ మూవీని వీలైనంత త్వ‌ర‌గా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తోంది.

ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్ డేట్ ని మంగ‌ళ‌వారం సాయంత్రం 4 గంట‌ల‌కు ప్ర‌క‌టిస్తామ‌ని సోష‌ల్  మీడియా వేదిక‌గా హీరో అల్ల‌రి న‌రేష్ సోమ‌వారం ప్ర‌క‌టించారు. ఆ ప్ర‌క‌ట‌నకు త‌గ్గ‌ట్టుగానే మంగ‌ళ‌వారం సాయంత్రం 4 గంట‌ల‌కు ఓ వీడియోని విడుద‌ల చేస్తూ క్రేజీ అప్ డేట్ ని అందించిన స‌ర్ ప్రైజ్ చేశారు. ఈ మూవీని ఏప్రిల్ 14న స‌మ్మ‌ర్ కానుక‌గా రిలీజ్ చేస్తున్న‌ట్టుగా చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

రెడ్ క‌ల‌ర్ థీమ్ లో ఓ గ్లిమ్స్ ని మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందులో బుల్లెట్ పై వ‌చ్చిన హీరో అల్ల‌రి న‌రేష్ ఆగ్ర‌హంతో ఊగిపోతూ గ‌న్ తీసి కాల్చ‌డం..అది రిలీజ్ డేట్ గా మార‌డం ఆక‌ట్టుకుంటోంది. ఈ గ్లిమ్స్ కు శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల అందించిన నేప‌థ్య సంగీతం హైలైట్ గా నిలుస్తోంది. ఈ మూవీలోనూ టైటిల్ కు త‌గ్గ‌ట్టుగానే హీరో అల్ల‌రి న‌రేస్ ఆగ్ర‌హంతో ఊగిపోతూ మెలితిప్పిన మీసంతో ఫెరోషియ‌స్ గా క‌నిపిస్తున్నాడు. క్రైమ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ మూవీతో అల్ల‌రి న‌రేష్‌, విజ‌య్ క‌న‌క‌మేడ‌ల 'నాంది' మ్యాజిక్ ని మ‌రో సారి రిపీట్ చేస్తారో వేచి చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View

Tags:    

Similar News