ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య హీరోయిన్..అందం - కళాభినయాల కలబోత

Update: 2020-08-31 06:00 GMT
కూచిపూడి, భరతనాట్యంలో ప్రావీణ్యం.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వెయ్యికి పైగా ప్రదర్శనలు.. అందం, అభినయాల కలబోత .. ఎవరీమే అనుకుంటున్నారా.. అచ్చమైన తెలుగుందంతో 'ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య ' మూవీలో కట్టిపడేసిన 'కొడవయార్'. ఈమె చదివేది మెడిసన్ అయినా సంప్రదాయ నాట్యాన్ని అవపోసన పట్టుకుని ఇప్పటి వరకు పలు అంతర్జాతీయ వేదికలపై మెప్పించింది. మొదటి సారి తెరపై  ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్యలో నటించింది.ఆ సినిమా రెండో భాగంలో కొడవయార్ కనిపిస్తుంది.
ఇంకా పలు విశేషాలు  ఆమె మాటల్లోనే.  

మాది విజయవాడ. తండ్రి రవి కుమార్  ఆర్మీలో పనిచేస్తారు. తల్లి మంగ లక్ష్మి సంస్కృతం లెక్చరర్. చిన్నప్పుడు టీవీల్లో పాటలు వస్తే కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ డ్యాన్స్ చేసే దానినంట. అది చూసిన అమ్మ  నన్ను నాలుగేళ్లకే విజయవాడలోని బాలభవన్ లో అలివేలు మంగతాయారు గారి దగ్గర చేర్చి సంప్రదాయ నృత్యంలో శిక్షణ ఇప్పించింది. కూచిపూడి, భరతనాట్యం నేర్చుకున్న తర్వాత ఘంటసాల పవన్ కుమార్ గారి దగ్గర శిష్యరికం చేశా. కూచిపూడి నాట్యంలో డిప్లమాలు  పూర్తిచేశా. ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో ప్రదర్శనలు  ఇచ్చా. నా విద్యాభ్యాసం అంతా విజయవాడలోనే సాగింది. ఎంసెట్లో మంచి ర్యాంకు కొట్టి గుంటూరులోని కాటూరు మెడికల్ కాలేజీలో సీటు సంపాదించా. ప్రస్తుతం హౌస్ సర్జెన్సీ చేస్తున్నా. ఐదు నెలలుగా ఆస్పత్రిలో కరోనా బాధితులకు సేవలందిస్తున్నా.  వారికి ధైర్యం చెబుతూ అండగా ఉంటున్నా.


ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య కోసం హీరోయిన్ల కోసం చూస్తున్నట్లు తెలిసి నా ప్రొఫైల్ పంపా. డైరెక్టర్ వెంకటేష్  మహా, నిర్మాత ప్రవీణ ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశారు. ఆ సినిమాలో పాత్ర కోసం అరకులో ఉండి అక్కడి స్థానికుల హావభావాలను బాగా  గమనించా. హీరో సత్య దేవ్ గారు కూడా  సలహాలు ఇచ్చారు. నేను చేసిన జ్యోతి పాత్రకు  మంచి స్పందన వస్తుండడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నాలుగు నిమిషాల నిడివి ఉండే ఫ్లాష్ మాబ్ సింగిల్ షాట్ లో చిత్రీకరించారు. సినిమాలు థియేటర్ లో విడుదల అయ్యే పరిస్థితి లేకపోవడంతో డైరెక్టుగా ఓటీటీలో విడుదల చేశారు. సినిమా విడుదలైన రోజు నుంచి చర్చలు,  ,  రివ్యూలు, సోషల్ మీడియాలో పోస్ట్ లు సినిమా డైరెక్టుగా విడుదల అయినంత అనుభూతినిచ్చాయి.

ఇంకా నా హాబీల విషయానికొస్తే.. నాన్న మంచి ఆర్టిస్టు. ఆయన చూసి నేను కూడా పెయింటింగ్ వేస్తుంటా. ఇప్పటికీ వారంలో రెండు మూడు రోజుల డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటా. బాహుబలి సినిమాలోని 'సాహోరే బాహుబలి 'పాటకు డ్యాన్స్ చేసి వీడియో యూట్యూబ్ ఛానల్ లో పెట్టగా రెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. కె. విశ్వనాధ్ సినిమాల్లోని  పాటలకు డ్యాన్స్ వేసి  వీడియోలు యూట్యూబ్ లో పెట్టా. ఆ పాటలకు కూడా నుంచి మంచి రెస్పాన్స్  వచ్చింది.
Tags:    

Similar News