లోక‌ల్ ఛానెల్‌ లో 'ఉమామహేశ్వర'.. మండిప‌డ్డ టీవీ ఛానల్...!

Update: 2020-08-21 12:30 GMT
టాలెంటెడ్ యాక్టర్ స‌త్యదేవ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'. వెంకటేశ్‌ మహా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వ‌ర్క్స్ మరియు మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌ పై శోభు యార్ల‌గ‌డ్డ‌ - ప్ర‌సాద్ దేవినేని - విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మించారు. మలయాళంలో విజ‌య‌వంత‌మైన‌ 'మహేషింతే ప్రతీకారమ్' చిత్రానికి రీమేక్‌గా 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' తెర‌కెక్కింది. కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో ఈ సినిమా థియేటర్స్‌ లో కాకుండా డైరెక్ట్‌ గా ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. ఓటీటీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి రివ్యూస్ సాధించింది. ఇక ఈ సినిమా శాటిలైట్‌ రైట్స్ ఈటీవీ యాజమాన్యం దాదాపు 2.5 కోట్లకు కొన్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా 'ఈ టీవీ'లో కాకుండా హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఓ లోకల్ ఛానల్ లో ప్రసారం అయిందని తెలుస్తోంది.

కాగా కొత్త సినిమాల శాటిలైట్‌ రైట్స్ కొనే విషయంలో మిగతా ఛానల్స్ కంటే వెనుకంజలో ఉండే ఈటీవీ.. 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'ని పోటీ పడి మరీ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు అనుమతి లేకుండా లోకల్ ఛానల్ లో ప్రసారంపై ఆగ్రహం వ్యక్తం చేసిందట. అంతేకాకుండా సదరు ఛానల్ వారికి లీగల్ నోటీస్ పంపిస్తూ నష్టపరిహారం చెల్లించవల్సిందిగా డిమాండ్ చేసిందట. అయితే హైదరాబాద్ లోకల్ ఛానల్ యాజమాన్యం ఈటీవీ వరిని సంప్రదించి జరిగిన దానికి క్షమాపణ కోరారట. దీంతో ఈటీవీ యాజమాన్యం చట్టపరమైన నోటీసులను ఉపసంహరించున్నారని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా రైట్స్ కొనుకున్నప్పుడే ఈటీవీ యాజమాన్యం దీని గురించి పత్రికా ప్రకటన ఇచ్చింది. కొత్త సినిమాలను శాటిలైట్ రైట్స్ తీసుకున్నవారు ప్రసారం చేయడం కంటే ముందే వేరే మాధ్యమాల్లో టెలికాస్ట్ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇటీవల 'కేజీఎఫ్' సినిమాని కూడా ఓ స్థానిక లోకల్ ఛానల్ ప్రసారం చేయగా.. మేకర్స్ వారికి లీగల్ నోటీసులు పంపించారు. ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల పైరసీలు హెచ్ డీ క్వాలిటీతో అందుబాటులో ఉండటంతో ఇలాంటివి పునరావృతం అవుతున్నాయని తెలుస్తోంది.




Tags:    

Similar News