ఏడాది తర్వాత పవన్‌ కళ్యాణ్‌.. ఫ్యాన్స్ ఆగుతారా?

అసెంబ్లీ ఎన్నికలు జరిగి పవన్‌ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి పవన్‌ కళ్యాణ్ సినిమా వేడుక కి హాజరు కాబోతున్నారు.

Update: 2025-01-04 10:21 GMT

రామ్ చరణ్ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొంది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గేమ్‌ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నేడు భారీ ఎత్తున జరగబోతుంది. రాజమండ్రిలోని ఓపెన్‌ గ్రౌండ్స్‌లో జరుగబోతున్న ఈ ఈవెంట్‌కి ఏపీ ఉప ముఖ్య మంత్రి పవన్‌ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. దాంతో ఈ ఈవెంట్‌కి చాలా ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. ముఖ్యంగా భారీ ఎత్తున మెగా ఫ్యాన్స్‌తో పాటు, జనసే కార్యకర్తలు, తెలుగు దేశం పార్టీ వారు సైతం ఈవెంట్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. పవన్‌ కి ఉన్న ఫాలోయింగ్‌ నేపథ్యంలో ఈవెంట్‌ జరగబోతున్న గ్రౌండ్‌లో భారీగా జనాలు ఉండబోతున్నారు.


అసెంబ్లీ ఎన్నికలు జరిగి పవన్‌ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి పవన్‌ కళ్యాణ్ సినిమా వేడుక కి హాజరు కాబోతున్నారు. ఎన్నికలకు ముందు నుంచే కొన్ని నెలలుగా ఆయన సినిమా ఈవెంట్స్ కి హాజరు కావడం లేదు. దాదాపు ఏడాది కాలంగా ఆయన సినిమా వేడుకలకు హాజరు కావడం లేదు. కేవలం రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. కనుక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొనడం వల్ల అంచనాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. రామ్‌ చరణ్‌ నటించిన సినిమాలకు పవన్‌ కళ్యాణ్ గెస్ట్‌గా చాలా సార్లు హాజరు అయ్యారు. అయినా ఈసారి చాలా స్పెషల్‌ అంటూ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వేలాది మంది రాజమండ్రిలో జరగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బారులు తీరారు, మరో వైపు లక్షలాది మంది సోషల్‌ మీడియా ద్వారా, లైవ్‌ ద్వారా చూడటం కోసం వెయిట్‌ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి అయినా సినిమాలను వీడలేదు. ఆయన తన ఓజీ, హరి హర వీరమల్లు సినిమాలను చేస్తూనే ఉన్నాడు. కనుక ఇండస్ట్రీ గురించి ఆయన ఏం మాట్లాడుతాడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంటుందని గేమ్‌ ఛేంజర్‌ పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇటీవల ఒక మీడియా చిట్‌ చాట్‌లో పుష్ప 2 సినిమా, ఆ సమయంలో జరిగిన సంఘటన గురించి స్పందించాడు. కనుక గేమ్‌ ఛేంజర్ ఈవెంట్‌లో ఆ విషయం గురించి స్పందిస్తాడని ఏ ఒక్కరూ అనుకోవడం లేదు. రామ్‌ చరణ్, పవన్‌ కళ్యాణ్‌లను ఒకే స్టేజ్‌పై చాలా కాలం తర్వాత చూడబోతున్న నేపథ్యంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గేమ్‌ చేంజర్ ఈవెంట్‌ వద్ద ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా భారీ ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి హాజరు కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే వందలాది మంది పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

Tags:    

Similar News