పవన్ మాదిరిగానే 'గేమ్ ఛేంజర్'లో రామ్ చరణ్..!
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమాను జనవరి 10వ తారీకు భారీ ఎత్తున విడుదల చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమాను జనవరి 10వ తారీకు భారీ ఎత్తున విడుదల చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు నిన్న ముంబై వెళ్లిన విషయం తెల్సిందే. అక్కడ భారీ ఎత్తున హాజరు అయిన మీడియా ప్రతినిధుల సమక్షంలో గేమ్ ఛేంజర్ టీం చిత్ర విశేషాలను షేర్ చేశారు. రామ్ చరణ్, ఎస్ జే సూర్యతో పాటు పలువురు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో హాజరు అయ్యారు. ఈ సినిమా ఈవెంట్ లో ఎస్ జే సూర్య చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
గేమ్ ఛేంజర్‌లో విలన్ పాత్రలో నటించిన ఎస్ జే సూర్య మాట్లాడుతూ... నేడు సాయంత్రం రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గాను ముఖ్య అతిథిగా గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది అన్నారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్య మంత్రిగా ఫీల్డ్‌లో ఏమైతే చేస్తున్నారో అదే గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ కలెక్టర్‌గా చేస్తారు. సినిమాలో రామ్ చరణ్ నటన ఆకట్టుకుంటుంది. మంచి పాత్రలో చరణ్ బాగా నటించారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం, శంకర్ సర్ సినిమాలో నటించడం చాలా సంతోషం కలిగించింది అంటూ సూర్య చెప్పుకొచ్చారు. ఈ సినిమా తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అన్నారు.
గతంలో పవన్ కళ్యాణ్‌తో ఎస్ జే సూర్య రెండు సినిమాలను రూపొందించారు. అందులో ఖుషి సినిమా సెన్షేషనల్ విజయాన్ని సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఆల్ టైమ్ సూపర్ హిట్ చిత్రాల జాబితాలో ఈ సినిమా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్భుతమైన సినిమాలను అందించిన ఎస్ జే సూర్య ప్రస్తుతం నటుడిగా చాలా బిజీగా ఉన్నారు. తెలుగులో నానితో కలిసి సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య మరో విజయాన్ని గేమ్ ఛేంజర్‌తో తన ఖాతాలో వేసుకోబోతున్నారు. ఈ మధ్య కాలంలో విలన్ పాత్రలకు సూర్య కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రామ్ చరణ్ డ్యూయెల్ రోల్‌లో నటించిన గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేశారు. ముంబై మీడియా సమావేశంలో చిత్ర యూనిట్ సభ్యులు ట్రైలర్ కు మంచి స్పందన దక్కిందని చెప్పుకొచ్చారు. అన్ని భాషల్లోనూ కలిసి ఈ ట్రైలర్ ఏకంగా 180 మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లోనూ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో వచ్చే గల్ల లుంగీ షాట్స్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అంజలి, కియారా అద్వానీ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించారు.