MAA ఎన్నిక‌లు: నైట్ పార్టీలు.. ప్ర‌త్యేక విందులు.. ఏంటో ఈ కొత్త పోక‌డ‌?

Update: 2021-09-04 07:30 GMT
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు సార్వ‌త్రిక ఎన్నికల్లా.. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లా ఊహాతీతంగా క‌నిపిస్తున్నాయి. ఐదారేళ్ల క్రితం వ‌ర‌కూ ఎంతో సైలెంట్ గా జ‌రిగిపోయిన ఈ ఎన్నిక‌లు ఇటీవ‌ల‌ యుద్ద వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పిస్తున్నాయి. రాను రాను `మా ` ఎన్నిక‌లు కొత్త పోక‌డ‌కు నాంది ప‌లుకుతున్నాయి. ఇటీవ‌లే స్వాతంత్య్ర‌ దినోత్స‌వం సంద‌ర్భంగా న‌రేష్ త‌న ప్యాన‌ల్ స‌భ్యుల‌కు.. మెంబ‌ర్ల‌కు ఖ‌రీదైన లంచ్ పార్టీ ఇచ్చారు. ఈ విష‌యం ప్ర‌త్య‌ర్ధి ప్యాన‌ల్ బృందానికి తెలియ‌డంతో హుటాహుటిన ఆ టీమ్ కూడా లంచ్ పార్టీ ఏర్పాటు  చేసింది. చెన్నైలో ఉన్న ప్ర‌కాష్ రాజ్ ఆగ‌మేఘాల మీద‌ హైద‌రాబాద్ వ‌చ్చి జెండా వందనం చేసి మెంబ‌ర్ల‌ పార్టీలో పాల్గొన్నారు.

తాజాగా న‌రేష్ మెంబ‌ర్లంద‌రికీ ఏకంగా ఓ నైట్ పార్టీనే ఏర్పాటు చేసారు. భాగ్య‌న‌ర‌గంలో ఓ చ‌ల్ల‌ని సాయంత్రం చిలౌట్ అయ్యేలా రిచ్ గా ఓ పార్టీని ఏర్పాటు చేసారు. పార్టీ తేదీ ఇంకా ఖ‌రారు కాలేదు. ఇంత‌లోనే ప్ర‌కాష్ రాజ్ సీన్ లోకి వ‌చ్చేసారని తెలిసింది. ఏంటి న‌రేష్ గారు పార్టీ ఇస్తున్నారా? అంటూ సెటైరిక‌ల్ గా స్పందించారు. ఇప్ప‌టివ‌ర‌కూ న‌రేష్ త‌ల‌పెట్టిన అన్ని కార్య‌క్ర‌మాల్లోనూ వ్య‌తిరేక‌త‌ను వ్య‌క్తం చేసిన ప్ర‌కాష్ రాజ్ పార్టీ విష‌యంలో మాత్రం ఫుల్ స‌పోర్ట్ ఇచ్చారు. పార్టీ ఇవ్వ‌డంలో త‌ప్పేముంది . ప‌గ‌లంతా క‌ళాకారులు షూటింగ్ లో బిజీగా ఉంటారు. అందుకే రాత్రి పార్టీ ఏర్పాటు చేసుకున్న‌ట్లున్నారని పంచ్ విసిరారు.

అదో ర‌క‌మైన ప్ర‌చారమిదీ అంటూ విల‌క్ష‌ణంగా స్పందించారు ప్ర‌కాష్ రాజ్. నైట్ పార్టీలో ఎన్నో విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఎవ‌రి స‌మ‌స్య‌లు వారు చెప్పుకోవడానికి పార్టీ మంచి వేదిక‌గా నిలుస్తుంద‌ని ఆయ‌న అన‌డం కొస‌మెరుపు. ఇంత వ‌ర‌కూ విల‌క్ష‌ణ న‌టుడి వివ‌ర‌ణ బాగానే ఉంది. మ‌రి ప్ర‌కాష్ రాజ్ త‌న టీమ్ కి నైట్ పార్టీలు ఇవ్వ‌రా? అప్పుడంతా క‌లిసి స‌హ‌పంక్తి భోజునాలు చేసారు?  మ‌రి ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ పార్టీ లేక పోతే ఎలా? అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. `మా` ఎన్నిక‌లు అక్టోబ‌ర్ 10న నిర్వ‌హించ‌డానికి ఈసీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్  విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

MAA ఎన్నిక‌ల్లో ఊహించ‌ని ట్విస్ట్ లు జంప్ లు

MAA ఎన్నిక‌లు అంత‌కంత‌కు హీట్ పెంచుతున్నాయి. అక్టోబ‌ర్ 10న ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం ప్ర‌క‌ట‌న జారీ చేసిన అనంత‌రం ఎవ‌రికి వారు త‌మ వ‌ర్గాన్ని సిద్ధం చేసుకుని ప్ర‌చారం హోరెత్తిస్తున్నారు. ఎవ‌రికి వారు గెలుపు ధీమాను క‌న‌బ‌రుస్తున్నారు. ఈసారి ప్ర‌ధాన‌ పోటీ ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ వ‌ర్సెస్ మంచు విష్ణు ప్యానెల్ మ‌ధ్య‌నే సాగ‌నుంది. మెగాస్టార్ అండ‌దండ‌ల‌తో ప్ర‌కాష్ రాజ్ ఇత‌రుల కంటే దూకుడుగా ప్ర‌చారంలో దూసుకుపోతుండ‌గా.. కృష్ణ‌-కృష్ణంరాజు- బాల‌కృష్ణ అండ‌దండ‌ల‌తో ఈసారి మంచు విష్ణు అధ్య‌క్షుడిగా పోటీప‌డుతున్నారు. గెలుపు ఎవ‌రిని వ‌రిస్తుంది? అన్న‌ది అటుంచితే మంచు విష్ణుకు ఈసారి మ‌హిళామ‌ణుల అండ‌దండ‌లు పుష్క‌లంగా ల‌భిస్తాయ‌ని భావించారు. కానీ ఇంత‌లోనే ఊహించ‌ని జంప్ లు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి.

ఇప్ప‌టికే ఇద్ద‌రు మ‌హిళామ‌ణుల్ని ప్ర‌కాష్ రాజ్ త‌మ ప్యానెల్ వైపు తిప్పేసుకున్నారు. ఆ ఇద్ద‌రిలో జీవిత రాజ‌శేఖ‌ర్ స‌పోర్ట్ మంచు విష్ణుకి ఉంటుంద‌ని ఇటీవ‌ల అంతా భావించారు. కానీ అనూహ్యంగా జీవిత తెలివైన నిర్ణ‌యం తీసుకుని త‌న‌కు ప‌ద‌విని ఖాయం చేసుకునే ఎత్తుగ‌డను అనుస‌రించారు.  జీవిత ఇప్పుడు ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ త‌ర‌పున పోటీ చేస్తుండ‌డం స‌ర్వ‌త్రా ఉత్కంఠ పెంచుతోంది. అలాగే న‌టి హేమ‌ను క‌న్విన్స్ చేసి ప్ర‌కాష్ రాజ్ బృందం త‌మ ప్యానెల్ త‌ర‌పున పోటీ చేసేలా మంత్రాంగం న‌డిపించ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని పెంచింది.  

మొదట అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావించిన జీవిత రాజశేఖర్ నరేష్ ప్యానెల్ నుండి కార్యదర్శిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇంత‌లోనే జీవిత త‌న ఆలోచ‌న‌ను మార్చుకుని ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి సెక్రటరీగా పోటీ చేయనున్నారు. శుక్రవారం మీడియా స‌మావేశంలో ప్రకాష్ రాజ్ మీడియాకు ఈ విష‌యాన్ని వెల్లడించ‌నున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

ఇప్ప‌టివ‌ర‌కూ `మా` అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగిన‌ నరేష్ మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు చివ‌రి నిమిషంలో ముందుకు రావ‌డం స‌ర్వ‌త్రా ఉత్కంఠ పెంచింది. అస‌లు నేను ఇక పోటీ చేయ‌ను అని ప్ర‌క‌టించి కూడా న‌రేష్ తిరిగి పోటీబ‌రిలో నిలుస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి- మెగా బ్ర‌దర్ నాగ‌బాబు ఈసారి ప్రకాష్ రాజ్ కు తమ‌ మద్దతును అందిస్తున్నారు. జీవితతో చిరు చర్చలు జరిపి ప్రకాష్ రాజ్ పక్షాన ఉండేలా ఒప్పించారని క‌థ‌నాలొస్తున్నాయి. ఇది నిజంగా ఊహించ‌ని ప‌రిణామం. ఈసారి అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో జీవిత రాజ‌శేఖ‌ర్ స‌హా హేమ కూడా ఉంటార‌ని ప్ర‌చార‌మైనా ఆ ఇద్ద‌రూ ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ వైపు మ‌ర‌ల‌డానికి కార‌ణం మెగా రాజ‌కీయ‌మేన‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. చివ‌రికి ఈ ఎన్నిక‌ల్లో ఎవ‌రిది పై చేయి అవుతుందో కాస్త వేచి చూడాలి. విందు రాజ‌కీయాల‌తో ఎవ‌రికి వారు స‌భ్యుల‌ను త‌మవైపు తిప్పుకునేందుకు బాగానే ఖర్చు చేస్తున్నార‌న్న‌ది తాజా వార్త‌ల సారాంశం.
Tags:    

Similar News