చిరు బ‌ర్త్ డే వేడుక‌లు.. ఈసారి సంథింగ్ స్పెష‌ల్ గా!

Update: 2022-08-16 03:31 GMT
ఎగ్జోటిక్ లొకేష‌న్ లో బ‌ర్త్ డే వేడుక‌లతో సెల‌బ్రిటీలు నిరంత‌రం వార్త‌ల్లో నిలుస్తున్నారు. కానీ టాలీవుడ్ అగ్ర‌హీరో మెగాస్టార్ చిరంజీవి అందుకు భిన్నంగా సింప్లిసిటీని కోరుకుంటార‌న్న‌ది తెలిసిందే. చాలా అరుదుగా మాత్ర‌మే విదేశాల్లో ఆయ‌న బ‌ర్త్ డే వేడుక‌లు జ‌రుపుకున్నారు. ఎన్నో పుట్టిన‌రోజుల‌ను హైద‌రాబాద్ లోని త‌న స్వ‌గృహంలో జ‌రుపుకునేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి తన 67వ పుట్టినరోజు  ఉత్స‌వాలు మొద‌ల‌య్యాయి. ఈ సంవత్సరం ఆగస్టు 22న ఈ మెగా ఉత్స‌వాల కోసం అభిమానులు భారీ ఏర్పాట్ల‌లో ఉన్నారు.

పుట్టిన‌రోజు కానుక‌గా త‌మ‌కు అన్న‌య్య నుంచి చాలా కానుక‌లు అందుతాయ‌ని కూడా ఆశిస్తున్నారు. చిరు న‌టిస్తున్న గాడ్ ఫాద‌ర్ - భోళాశంక‌ర్ స‌హా ఇత‌ర సినిమాల నుంచి కొత్త పోస్ట‌ర్లు.. టీజ‌ర్ల‌ను ఆశిస్తున్నారు. చిరు న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల 4K రీమాస్టర్డ్ వెర్షన్ లు కూడా విడుదలవుతాయని అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ఇప్ప‌టికే ఘ‌రానా మొగుడు 4కే వెర్ష‌న్ రెడీ అయ్యింద‌న్న వార్త‌ల న‌డుమ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా క‌నిపిస్తున్నారు. అయితే చిరు ఈసారి బ‌ర్త్ డే వేడుక‌ల‌కు హైద‌రాబాద్ న‌గ‌రంలో అందుబాటులో ఉంటారా? ఉండ‌రా? అన్న‌ది ఆరా తీస్తే ప‌లు ఆస‌క్తిక‌ర విషయాలు తెలిసాయి.

చిరు హైద‌రాబాద్ లో త‌న స్వ‌గృహంలో ఈ వేడుక‌ల‌ను జ‌రుపుకోర‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మునుప‌టి కంటే భిన్నంగా ఈ ఏడాది వేడుక‌ల‌ను ప్లాన్ చేస్తున్నారు. ఏదైనా ఎగ్జోటిక్ డెస్టినేష‌న్ లో కుటుంబ స‌మేతంగా రిలాక్స్ అయ్యే విధంగా ప్ర‌ణాళిక సాగుతోంది. చిరు వ‌రుస సినిమాల్లో న‌టిస్తూ బాగా అల‌సిపోయారు. అందువ‌ల్ల కొద్దిరోజుల పాటు డెస్టినేష‌న్ త‌ర‌హాలో విరామ స‌మ‌యాన్ని కోరుకుంటున్నారు. అది కూడా కుటుంబ స‌భ్యుల‌తో బీచ్ ప‌రిస‌రాల్లో ఈ వేడుక‌లు జ‌రుపుకోవాల‌ని ఆశిస్తున్నార‌ని సోర్స్ చెబుతోంది.

చిరు షష్ఠిపూర్తి (60వ బ‌ర్త్ డే) వేడుక‌లు హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్ లో జ‌రిగాయి. ఓ ఏడాది హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ లోని చిరు ఇంట్లోనే ఎయిటీస్ తార‌ల న‌డుమ బ‌ర్త్ డే పార్టీ ఘ‌నంగా జ‌రిగింది. మ‌రో సంవత్సరం నేపాల్ లోని పశుపతినాథ్ ఆలయానికి చిరు వెళ్ళారు. ఓ ఏడాది స్పెయిన్ లో.. కొన్నిసార్లు అమెరికాలో పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌రిగాయి.

అరుదుగా అతని కుటుంబం మొత్తం వారి బెంగళూరు ఫామ్ హౌస్ లో సెల‌బ్రేట్ చేసారు. ఈసారి అందుకు భిన్నంగా గోవా బీచ్ లో సెల‌బ్రేష‌న్ సాగ‌నుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి స‌మాచారం లేదు. గోవా వేడుక‌ల‌కు చిరుతో పాటు ఎవ‌రెవరు వెళ‌తారు? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్.

ఇలా బీచ్ డెస్టినేష‌న్ ఆలోచ‌న రావ‌డాటానికి కార‌ణ‌మేమిటీ? అంటే.. ఈసారి టాలీవుడ్ లో నిర‌వ‌ధిక‌ బంద్ కొన‌సాగుతుండ‌డంతో తార‌ల‌కు తీరిక స‌మ‌యం చిక్కింది. హీరోలంతా ఇటీవ‌ల షూటింగుల్లేక వెకేష‌న్ మోడ్ లో ఉన్నారు. అందుకే చిరు కూడా ఇలా వైవిధ్యంగా ప్లాన్ చేశార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మెగా హీరోలంతా గోవా బీచ్ పార్టీలో ఫుల్ గా సెల‌బ్రేష‌న్ మోడ్ లోకి వెళ‌తార‌ని ఇప్ప‌టికి ఊహిస్తున్నారు. కానీ దీనికి అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Tags:    

Similar News