'స్వాతిముత్యం' సినిమాని ఏ ధైర్యంతో విడుదల చేస్తున్నారు..?

Update: 2022-09-22 03:38 GMT
దసరా సీజన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాలపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. 'గాడ్ ఫాదర్' మరియు 'ది ఘోస్ట్' వంటి రెండు క్రేజీ చిత్రాలు అక్టోబర్ 5వ తేదీన విడుదల కాబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మరియు కింగ్ అక్కినేని నాగార్జున వంటి ఇద్దరు పెద్ద హీరోలు బాక్సాఫీస్ బరిలో ఉంటే.. మధ్యలో 'స్వాతిముత్యం' వంటి చిత్రాన్ని విడుదలకు రెడీ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

బెల్లంకొండ సురేష్ తనయుడు, హీరో సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ హీరోగా లాంచ్ అవుతున్న చిత్రం ''స్వాతిముత్యం''. ఇందులో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాతో లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.

అయితే ఒక డెబ్యూ హీరో మరియు కొత్త డైరెక్టర్ కాంబినేషన్ లో చేసిన చిత్రాన్ని సితార వాళ్ళు ఏ ధైర్యంతో ఇద్దరు బిగ్ స్టార్స్ సినిమాల మధ్య రిలీజ్ చేస్తున్నారనే చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో జరుగుతోంది. దసరా సీజన్ ని క్యాష్ చేసుకోవాలనే ప్లాన్ తో రిస్క్ చేస్తున్నారేమో అనే కామెంట్స్ వస్తున్నాయి.

నిజానికి 'స్వాతిముత్యం' సినిమా నుంచి ఇప్పటి వరకూ విడుదలైన పబ్లిసిటీ స్టఫ్ అంతా ప్రామిసింగ్ గా ఉంది. ఫస్ట్ లుక్ - గ్లిమ్స్ - టీజర్ - పాటలు.. ఇలా ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ట్రైలర్ ఈ సినిమాకు మంచి బజ్ తీసుకొచ్చింది.

ఈ నేపథ్యంలో 'స్వాతిముత్యం' సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో మేకర్స్ దసరా బరిలో నిలపాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అందులోనూ 'గాడ్ ఫాదర్' మరియు 'ది ఘోస్ట్' సినిమాలకు పూర్తి భిన్నమైన జోనర్ లో బెల్లంకొండ గణేష్ సినిమా రూపొందింది.

'స్వాతిముత్యం' అనేది ఇది ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని ట్రైలర్ హామీ ఇస్తోంది. ప్రస్తుతం జీవితం - ప్రేమ - పెళ్లి వంటివాటిపై యువత ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయనే అంశాలను ప్రస్తావించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఫెస్టివల్ సీజన్ లో ఈ అంశాలు యూత్ మరియు కుటుంబ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉందని చిత్ర బృందం భావిస్తోంది. కంటెంట్ మీద అంత నమ్మకం ఉంది కాబట్టే.. చిరు - నాగ్ సినిమాలతో పాటుగా ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నారని ఇన్సైడ్ టాక్.

టాలీవుడ్ లో పండగ సీజన్లలో ఒకేసారి రెండు మూడు సినిమాలు రావడం కొత్తేం కాదు. ఎన్ని మంచి సినిమాలు వచ్చినా కూడా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. గతంలో దసరా సీజన్ లో విడుదలైన రెండు మూడు చిత్రాలు మంచి వసూళ్ళు రాబట్టిన సందర్భాలు ఉన్నాయి.

కంటెంట్ బాగుండాలే కానీ.. పోటీ అనేది అసలు విషయమే కాదని ఇటీవల పలు చిత్రాలు నిరూపించాయి. ఈసారి కూడా మంచి సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని మేకర్స్ నమ్ముతున్నారు. మరి అక్టోబర్ 5న రాబోతున్న బెల్లంకొండ బ్రదర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

కాగా, 'స్వాతిముత్యం' చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చగా.. సూర్య సినిమాటోగ్రఫీ అందించారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ సినిమాలో నరేష్ వీకే - రావు రమేష్ - సుబ్బరాజు - వెన్నెల కిషోర్ - సునయన - దివ్య శ్రీపాద తదితరులు నటించారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News