డ‌బ్బింగ్ సినిమాని చూసి దిల్ రాజు ని కాపాడ‌తారా?

Update: 2023-01-13 05:30 GMT
తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచ‌ల‌నాలు సృష్టిస్తూ.. హాలీవుడ్ న‌టీన‌టులు అత్యంత  ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల‌ని సైతం ద‌క్కించుకుంటే ప్ర‌పంచ సినిమా య‌వ‌నిక‌పై ఇండియ‌న్ సినిమా కీర్తి ప‌తాకాన్ని రెప‌రెప‌లాడిస్తోంది. చాలా వ‌ర‌కు కోలీవుడ్ టు బాలీవుడ్ వ‌ర‌కు ప్ర‌తీ మేక‌ర్‌, ప్ర‌తీ హీరో ప్ర‌స్తుతం పాన్ ఇండియా జ‌పం చేస్తున్నారు. కొత్త క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించాల‌ని స‌రికొత్త సినిమాల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు.

మేకింగ్‌, టేకింగ్ విష‌యంలో కొత్త పుంత‌లు తొక్కుతున్నారు. అయితే కొంత మంది మాత్రం ఇప్ప‌టికీ రొటీన్ పులిహోరా క‌థ‌ల‌నే న‌మ్ముకుంటూ స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తున్నారు. రొటీన్ స్టోరీస్ ని ఎంచుకుని స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే త‌ర‌హా రోటీన్ స్టోరీతో ఫ్యామిలీ డ్రామాగా తెర‌కెక్కిన మూవీ `వారీసు`. త‌మిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన ఈ మూవీ త‌మిళంలో జ‌న‌వ‌రి 11న విడుద‌లైంది. ర‌ష్మిక మందన్న హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీతో స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు కోలీవుడ్ లోకి అడుగు పెట్టారు.

భారీ అంచ‌నాల మ‌ద్య విడుద‌లైన ఈ మూవీకి త‌మిళంలో మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. విజ‌య్ సినిమా అంటే భారీ హంగామా చేసే అభిమానులు కూడా ఈ మూవీపై పెద‌వి విరుస్తున్నార‌ట‌. త‌మిళంలోనే ఇలాంటి టాక్ మొద‌లైతే తెలుగులో ఈ మూవీ ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. తెలుగులో ఈ మూవీని `వార‌సుడు`గా రిలీజ్ చేస్తున్నారు. ముందు జ‌న‌వ‌రి 12నే రిలీజ్ చేయాల‌నుకున్నా ఆ త‌రువాత స‌డ‌న్ గా రిలీజ్ డేట్ ని జ‌న‌వ‌రి 14 కు మార్చేశారు.

త‌మిళంలో జ‌న‌వ‌రి 11న ఈ మూవీని విడుద‌ల చేశారు. తెలుగులో 14న రిలీజ్ అంటే మూడు రోజులు ఆల‌స్యంగా రిలీజ్ చేస్తున్నార‌న్న‌మాట‌. ఈ మూడు రోజుల్లో జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోతే తెలుగులో ఓపెనింగ్స్ ప‌రిస్థితి ఏంటీ?..అన్న‌ది ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. `వార‌సుడు` కొత్త క‌థ కూడా కాదు. ఇప్ప‌టికే ఈ త‌ర‌హా పులిహోర క‌థ‌లు చాలా వ‌చ్చాయి. ఉమ్మ‌డి కుటుంబం.. ముగ్గురు కొడుకులు.. తండ్రితో గొడ‌వ ప‌డిన చిన్న కొడుకు.

ఏడేళ్లు దూరంగా వుండ‌టం.. త‌ను దూర‌మ‌య్యాక క‌ల‌హాల‌తో ఫ్యామిలీ ముక్క‌ల‌వుతుంది. అలా ముక్క‌లైన ఫ్యామిలీని క‌ల‌ప‌డానికి మ‌ళ్లీ ఇంటికి తిరిగి వ‌చ్చే చిన్న కొడుకు కుటుంబం కోసం ఏం చేశాడు? ..త‌న ఫ్యామిలీని ఒక్కటి చేసే క్ర‌మంలో ఎలాంటి స‌వాళ్ల‌ని ఎదుర్కొన్నాడు అనే క‌థ‌తో ఈ మూవీని తెర‌కెక్కించారు.

ఇలాంటి క‌థ‌లు తెలుగులో ఇంత వ‌ర‌కు కోకొల్ల‌లుగా వ‌చ్చాయి. మళ్లీ అలాంటి క‌థ‌నే తెలుగు ప్రేక్ష‌కుల‌పై రుద్దితే చూస్తారా? .. పండ‌గ రేసులో తెలుగు సినిమాలు వుండ‌గా డ‌బ్బింగ్ సినిమాని చూసి తెలుగు ప్రేక్ష‌కులు దిల్‌రాజుని గ‌ట్టెక్కిస్తారా? అన్న‌ది అనుమాన‌మే అనే టాక్ వినిపిస్తోంది.
Tags:    

Similar News