#బాక్సాఫీస్‌.. ఈ శుక్ర‌వారం ఎవ‌రి బ‌లుపెంత‌?

Update: 2022-11-27 07:35 GMT
వారం వారం సినిమాలొస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ కంటెంటే కింగ్ అని నిరూపణ అవుతోంది. ఈ శుక్ర‌వారం ఏ సినిమా కంటెంట్ కింగ్ గా నిలిచింది? అన్న‌ది టాలీవుడ్ ఫిలింస‌ర్కిల్స్ లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏ కాఫీ హ‌బ్ టీ స్టాల్ వ‌ద్ద నిల‌బ‌డినా ఫ‌లానా సినిమా కంటెంట్ అదుర్స్ అన్న మాట వినిపిస్తోంది.

నిజానికి వ‌రుణ్ ధావ‌న్ లాంటి యంగ్ ట్యాలెంటెడ్ బాలీవుడ్ స్టార్ న‌టించిన బేధియా తెలుగు అనువాదం తోడేలు బావుంటుందని అంతా గెస్ చేసారు. కానీ దీనికి పూర్ అనే మార్కులే వేసారు. మ‌రోవైపు అల్ల‌రి న‌రేష్ న‌టించిన మాఏర‌డు మిల్లి ప్ర‌జానీకం తెలుగు స్ట్రెయిట్ సినిమాగా ఓకే అనిపించింది. ఇక మూడో సినిమా గురించే కాస్త ఎక్కువ‌గా ముచ్చ‌టించాలి.

దిల్ రాజు ఈ సినిమాని ఎంపిక చేసారు అనగానే నేను ఆయ‌న క‌ళ్ల‌లోకి చూసాను అంటూ సీనియ‌ర్ న‌టి కం నిర్మాత రాధిక హైద‌రాబాద్ ప్ర‌మోష‌న్స్ లో ముచ్చ‌టించిన ముచ్చ‌ట‌ను ఇంకా ఎవ‌రూ మ‌ర్చిపోలేదు. కంటెంట్ ని ఎంపిక చేసుకోవ‌డంలో దిల్ రాజు నిజంగానే కింగ్ అని కూడా పొగిడేశారు. నిజ‌మే అది అని ఇప్పుడు ల‌వ్ టుడే అనే డ‌బ్బింగ్ సినిమా నిరూపిస్తోంది.

ముక్కూ మొఖం తెలియ‌ని న‌టీన‌టుల‌తో తెర‌కెక్కించినా యూత్ అంతా ఇప్పుడు ఈ సినిమా ఆడుతున్న థియేట‌ర్ల‌కు ప‌రిగెడుతున్నారు. ధ‌నుష్ న‌టించిన 7/ జి బృందావ‌న కాల‌నీ త‌ర‌హాలో ఈ మూవీ కి బ‌జ్ బాగా క‌నిపిస్తోంద‌ని బాక్సాఫీస్ లెక్క‌లు చెబుతున్నాయ‌ట‌. ల‌వ్ .. ప‌ర్వ‌ర్ష‌న్.. ఎమోష‌న్ అంటూ ఈ సినిమాలో చాలా అంశాల‌ను ట్రైల‌ర్ లో చూపించ‌డం ప్ర‌ధానంగా యూత్ ని థియేట‌ర్ల‌లోకి ర‌ప్పిస్తోంది.

నిజాన్ని నిర్భ‌యంగా చెప్పాలంటే ఒక డ‌బ్బింగ్ సినిమా థియేట‌ర్ల‌లో విజేత‌గా నిలిచింది. త‌మిళ అనువాద చిత్రం ల‌వ్ టుడే శుక్రవారం సాయంత్రం నాటికి విపరీతంగా పుంజుకుంద‌నేది ట్రేడ్ టాక్. ఈ సినిమాని తిలకించేందుకు శనివారం యువత తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లకు విచ్చేసారు. పైగా ఎ- బి- సి సెంటర్లలో ఈ మూవీని ఆడించాల‌నే దిల్ రాజు వ్యూహం చాలా బాగా వర్కవుట్ అయిందని తెలిసింది.

ఇక హిందీ డ‌బ్బింగ్ సినిమా భేధియాకి తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన క‌లెక్ష‌న్లు లేవు. అల్లు అర‌వింద్ లాంటి దిగ్గ‌జం ఈ సినిమాని రిలీజ్ చేసినా స‌రైన ప్ర‌మోష‌న్ చేయ‌లేక‌పోవ‌డం మైన‌స్ అయ్యింద‌ని గుస‌గుస వినిపించింది. ఈ రోజుల్లో సినిమా కంటెంట్ తో పాటు ప్ర‌చారం చాలా ముఖ్య‌మ‌ని స‌ద‌రు అగ్రనిర్మాత‌కు తెలుసు. కానీ ప్ర‌చారంలో వెన‌క‌బ‌డ్డారు. ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం ప్రీమియ‌ర్ ప‌డ్డాక‌ యావరేజ్ అన్న టాక్ తో మొద‌లైంది.

సీరియస్ కంటెంట్ ప్రేక్షకులను థియేట‌ర్ల‌కు ర‌ప్పించేందుకు కొంత సమయం పడుతుంద‌ని భావిస్తున్నారు. న‌రేష్ సినిమా కాబ‌ట్టి ఆరంభ వ‌సూళ్లు ఫ‌ర్వాలేదు. మునుముందు మ‌రింత పుంజుకోవాల్సి ఉంద‌న్న టాక్ వినిపిస్తోంది. ఓవ‌రాల్ గా ఈ శుక్ర‌వారం `ల‌వ్ టుడే` అనే త‌మిళ డ‌బ్బింగ్ సినిమాకి అంకిత‌మైంది. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా తిరుగులేని విజేత అని అన్ని వ‌ర్గాల నుంచి స్ప‌ష్ఠ‌త వ‌చ్చింది.
Tags:    

Similar News