UI: పాన్ ఇండియా చిత్రంతో వస్తోన్న ఉపేంద్ర..!

Update: 2022-06-02 15:36 GMT
టాలీవుడ్ ప్రేక్షకులకు కన్నడ హీరో ఉపేంద్ర గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేసిన ఉపేంద్ర.. దర్శకుడిగానూ తన విశిష్టతను చాటుకున్నారు. 'ఓంకారం' - 'A' - 'ఉపేంద్ర' - 'సూపర్' వంటి చిత్రాలతో డైరెక్టర్ గా సత్తా చాటిన రియల్ స్టార్.. ఐఎండీబీ వరల్డ్ టాప్-50 దర్శకులతో చోటు దక్కించుకున్నారు.

'ఉపేంద్ర 2' (2015) తర్వాత మళ్లీ ఉపేంద్ర మెగాఫోన్ పట్టలేదు. అయితే ఇప్పుడు ఏడేళ్ల గ్యాప్ అనంతరం ఓ సినిమాకి దర్శకత్వం వహించడానికి రెడీ అయ్యారు. ''UI'' అనే డిఫరెంట్ టైటిల్ తో ఓ భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. మార్చి నెలలోనే ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ అనూహ్య రెస్పాన్స్ తెచ్చుకుంది.

''యూఐ'' చిత్రాన్ని రేపు (జూన్ 3) శుక్రవారం ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ వేడుకకు కన్నడ స్టార్స్ శివ రాజ్ కుమార్ - కిచ్చా సుదీప్ - విజయ్ - ధనుంజయ ముఖ్య అతిథిలుగా హాజరుకానున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన పోస్టర్ ను ఆవిష్కరించారు.

పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఉపేంద్ర కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహిస్తున్నారు. వీనస్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ తో కలసి లహరి మ్యూజిక్‌ సంస్థ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. జి మనోహర్ మరియు శ్రీకాంత్ కేపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి నవీన్ మనోహరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

గతంలో 'ఎ' 'రా' అంటూ ఒక అక్షరాన్నే తన సినిమాలకు టైటిల్ గా పెట్టిన ఉపేంద్ర.. అసలు టైటిలే లేకుండా కేవలం సింబల్‌ ను వాడి సూపర్‌ అనే అర్థం వచ్చేలా మూవీ తీశారు. ఇప్పుడు తాజాగా 'UI' అంటూ రెండు ఇంగ్లీష్ లెటర్స్ ను టైటిల్ గా ఫిక్స్ చేశారు. ఉపేంద్ర సినిమాలు ఎంతో లోతుగా ఆలోచించే వైవిధ్యమైన కథ కథనాలతో ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే కోవకు చెందుతుందని అనుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రేపు వెల్లడి కానున్నాయి.

ఇకపోతే ఇటీవల 'గని' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఉపేంద్ర.. ప్రస్తుతం 'త్రిశూలం' 'బుద్దివంత 2' 'బొజ్జా' మరియు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ మల్టీ లాంగ్వేజ్ సినిమా చేస్తున్నారు. ఇప్పుడు తన స్వీయ దర్శకత్వంలో 'UI' అనే పాన్ ఇండియా సినిమాని మొదలు పెడుతున్నారు.
Tags:    

Similar News