'ఉప్పెన' ట్రైలర్: 'ప్రేమ ఎప్పుడూ చరిత్రలోనే ఉంటుంది.. దానికి భవిష్యత్తు ఉండదు'

Update: 2021-02-04 10:38 GMT
సుప్రీమ్ హీరో సాయి తేజ్‌ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ''ఉప్పెన''. దర్శకుడు సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ కలిసి ఈ సినిమాని నిర్మించాయి. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా.. 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదల చేయబడిన ప్రచార చిత్రాలు మరియు సాంగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫిబ్రవరి 12న 'ఉప్పెన' సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో తాజాగా 'ఉప్పెన' థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు.

'ప్రేమంటే ఓ లైలా మజ్ను లా.. దేవదాసు పార్వతి లా.. ఓ రోమియో జూలియట్ లా అదో మాదిరిలా ఉండాలి రా' అంటూ హీరో చెప్పే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. 'ప్రేమంటే పట్టుకోవడం.. వదిలేయడం కాదు..' 'ప్రేమ గొప్పదైతే చరిత్రలోనో సమాధుల్లోనో కనపడాలి కానీ, పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఇళ్లల్లో కనబడితే దాని విలువ తగ్గిపోదూ.. అందుకే ప్రేమ ఎప్పుడూ చరిత్రలోనే ఉంటది.. దానికి భవిష్యత్తు ఉండదు' వంటి డైలాగ్స్ సినిమా నేపథ్యాన్ని వెల్లడిస్తున్నాయి. పేదింటి అబ్బాయి డబ్బున్న అమ్మాయిని ప్రేమించిన తర్వాత వారి జీవితాల్లో ఏర్పడిన పరిస్థితులను ఇందులో చూపించారు.

విజయ్ సేతుపతి హీరోయిన్ తండ్రిగా నెగెటివ్ రోల్ లో కనిపిస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టి ఇద్దరూ తొలి సినిమా అయినప్పటికీ మంచి నటన కనబరిచినట్లు అర్థం అవుతోంది. ట్రైలర్ చూస్తుంటే ఇదొక విషాదాంత ప్రేమకథ అనే అనుమానం కలుగుతోంది. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రానికి శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు. ప్రేమలో ముంచెత్తే అందమైన ప్రేమకథగా వస్తున్న 'ఉప్పెన' ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Full View

Tags:    

Similar News