బాబు స‌తీమ‌ణి అధికార దుర్వినియోగం?

Update: 2016-09-05 10:05 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ్డారా? ఉదాత్త‌మైన ఆశ‌యంతో జ‌రిగే గ్రామాల ద‌త్త‌త కార్య‌క్ర‌మంలో భువ‌నేశ్వ‌రి త‌న వ్య‌క్తిగ‌త ప‌లుకుబ‌డితో నిధుల మళ్లించుకున్నారా? అంటే అవున‌నే అంటున్నారు ప్ర‌తిప‌క్ష వెఎస్సార్‌ సీపీ డిప్యూటీ ప్లోర్‌ లీడర్‌ ఉప్పులేటి కల్పన. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా భువ‌నేశ్వ‌రి వ్య‌వ‌హ‌రించార‌ని ఆరోపించారు.

పార్టీ కార్యాలయంలో ఉప్పులేటి క‌ల్ప‌న మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జిల్లా పామర్రు మండల పరిధిలోని కొమరవోలు గ్రామాన్ని సీఎం సతీమణి నారా భువనేశ్వరీ దత్తత తీసుకోగా, ఇప్పటివరకూ గ్రామానికి ఆర్‌ డీఎఫ్‌ నిధులు రూ.7కోట్లు మంజూరు చేయటం జరిగిందన్నారు. సీఎం సతీమణి దత్తత తీసుకున్నారని అంత భారీమొత్తంలో ప్రజల సొమ్మును ఒక్క గ్రామానికే ఇవ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు. స్మార్ట్‌ విలేజ్‌ అభివృద్ధి అంటూ ఒక్క గ్రామానికే రూ. 7 కోట్ల ప్రభుత్వ నిధుల్ని కట్టబెట్టడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని మండిప‌డ్డారు.  నియోజకవర్గంలో అనేక గ్రామాలకు సరైన రహదారులు లేక బురద రోడ్లతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మిగిలిన గ్రామాల పరిస్థితి ఏమిటని క‌ల్ప‌న‌ ప్రశ్నించారు. ముఖ్య‌మంత్రి స‌తీమ‌ణి గ్రామం అంటే అభివృద్ధిలో ముందు ఉంటే మిగిలిన గ్రామాలు మురికి కూపాలుగా మారాల‌నేది ప్ర‌భుత్వ విధానమా అంటూ సూటిగా ప్ర‌శ్నించారు.

మ‌రోవైపు ఎన్నిక‌ల్లో గెలిచిన వారిని అప‌హాస్యం చేసే రీతిలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని క‌ల్ప‌న మండిపడ్డారు. స్థానికంగా గెలిచిన ప్రజా ప్రతినిధులను ఉత్సవిగ్రహాలుగా మార్చి, ఓడిపోయినవారికి, పరిపాలనలో భాగస్వామ్యంలేని వారికి పెద్దపీట వేయడం ఏమిటని ప‌రోక్షంగా టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వ‌ర్ల రామ‌య్య‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.  స‌ద‌రు నాయ‌కుల‌కు అంత‌గా ప్ర‌చార ఆస‌క్తి ఉంటే సొంత డబ్బును ఖర్చు పెట్టుకోవాలని సూచించారు. దీనిపై రాబోయే అసెంబ్లీ సమావేశాలలో గట్టిగా నిలదీస్తామని క‌ల్ప‌న హెచ్చ‌రించారు.
Tags:    

Similar News