డైరెక్షన్ ఖాయమంటున్న మెగా డైరెక్టర్ కొడుకు

Update: 2015-07-16 13:37 GMT
ఎ.కోదండరామి రెడ్డి.. తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగ్గ పేరు. దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు తర్వాత ఆ స్థాయిలో స్టార్‌డమ్ తెచ్చుకున్న దర్శకుడు కోదండరామిరెడ్డి. 80-90ల మధ్య మెగాస్టార్ చిరంజీవితో సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన కోదండరామిరెడ్డి.. మిగతా స్టార్ హీరోలందరితోనూ పని చేశారు. ఆయన తనయుడు వైభవ్ మాత్రం తండ్రి బాటలో మెగా ఫోన్ పట్టకుండా హీరో అయ్యాడు. తెలుగులో ‘గొడవ’ సినిమాతో అరంగేట్రం చేసి... ‘కాస్కో’ అనే ఇంకో సినిమా చేసిన వైభవ్.. ఇక్కడ కాలం కలిసిరాకపోవడంతో కోలీవుడ్‌కు వెళ్లిపోయాడు. అక్కడ హీరోగా మంచి పేరు సంపాదించాడు.

ఈ మధ్య శంకర్ నిర్మాణంలో వైభవ్ హీరోగా తెరకెక్కిన ‘కప్పల్’ అక్కడ సూపర్ హిట్టయింది. ఆ సినిమాను ‘పాండవుల్లో ఒకడు’ పేరుతో తెలుగులో విడుదల చేయనున్న నేపథ్యంలో వైభవ్ మాట్లాడుతూ.. ‘‘నిజానికి కప్పల్ నిర్మాత శంకర్ కాదు. వేరే నిర్మాత తీశారు. శంకర్ శిష్యుడు కార్తీక్ దర్శకత్వం వహించాడు. ఐతే సినిమా చూసి బాగా నచ్చడంతో శంకర్ సినిమాను కొని విడుదల చేశారు. పెళ్లయితే ఫ్రెండ్షిప్ పోతుందన్న ఉద్దేశంతో ఉండే ఐదుగురు కుర్రాళ్లలో ఒకడిగా నటిస్తున్నా. హీరో అనుకోకుండా ప్రేమలో పడితే.. దాన్ని చెడగొట్టడానికి మిగతా నలుగురు ఫ్రెండ్స్ ఏం చేశారనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం నవ్విస్తుంది. తెలుగులో ఈ సినిమాను మారుతి విడుదల చేస్తుండటం సంతోషం’’ అని వైభవ్ అన్నాడు. హీరోగానే కొనసాగుతారా.. తండ్రి బాటలో దర్శకత్వం చేయరా అని వైభవ్‌ను అడిగితే.. ‘‘నేను పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా అమ్మ నాన్న తమిళమ్మాయి, శివమణి సినిమాలకు పని చేశా. డైరెక్టర్ అవ్వాలని నాకూ ఉంది. రెండు మూడేళ్ల తర్వాత దీని గురించి ఆలోచిస్తా’’ అని చెప్పాడు.
Tags:    

Similar News