వంశీ చెప్పిన ‘ఊపిరి’ షూటింగ్ సీక్రెట్

Update: 2016-03-24 15:30 GMT
ఇప్పటిదాకా తాను తీసి సినిమాలు.. భవిష్యత్తులో తీయబోయే సినిమాల మధ్య ‘ఊపిరి’ తనకు చాలా చాలా ప్రత్యేకమైన, ఎప్పటికీ మరపురాని సినిమా అంటున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. కొన్నేళ్ల కిందట అనుకోకుండా ఓ మిత్రుడు ‘ది ఇన్‌ టచబుల్స్’ డీవీడీ ఇస్తే చూశానని.. హీరోది కుర్చీకే అతుక్కుపోయే పాత్ర కదా ఎలా ఉంటుందో అనుకుంటూ చూసిన తాను.. సినిమా పూర్తయ్యేసరికి కుర్చీ నుంచి లేవలేనంత ఎమోషన్‌ కు గురయ్యానని.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సినిమా తెలుగులో తీయాలని అప్పుడే ఫిక్సయిపోయానని వంశీ చెప్పాడు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా అనేక మరపురాని అనుభవాలున్నాయని.. ప్యారిస్‌ లో జరిగిన ఓ సంఘటన అందులో చాలా ప్రత్యేకమైందని అతను తెలిపాడు.

‘‘నేను, సినిమాటోగ్రాఫర్ వినోద్ లోకేషన్లు చూడటం కోసం ప్యారిస్ వెళ్లి.. అక్కడో రెస్టారెంట్ చూశాం. ఆ ప్లేస్ చాలా బాగుందని.. ఆ రెస్టారెంట్ ఓనర్ అయిన ఒక ముసలావిడని షూటింగ్ కోసం అడిగాం. మా యూనిట్ సభ్యుడిని ఆమె తిట్టి పంపించింది. ఐతే మేం తీయబోయేది ‘ది ఇన్ టచబుల్స్’కు ఇండియన్ వెర్షన్ అని చెప్పగానే.. ఆమె ఎక్కడ కావాలంటే అక్కడ షూటింగ్ చేసుకోమని చెప్పారు. ది ఇన్‌ టచబుల్స్ చూశాకే తన కొడుకులో ఎంతో మార్పు వచ్చిందని.. చచ్చిపోవాలనుకున్నవాడు మళ్లీ మామూలు మనిషయ్యాడని ఆమె వెల్లడించింది. ఆ పెద్దావిడ చెప్పిన మాటలు నన్ను కదిలించాయి. సినిమా మీద నమ్మకం మరింత పెరిగింది. ‘ది ఇన్‌ టచబుల్స్’ రీమేక్ అని తెలిసి ప్యారిస్‌ లోని మిగతా ప్రదేశాల్లో కూడా చాలామంది మాకు సాయం చేశారు’’ అని వంశీ చెప్పాడు.
Tags:    

Similar News