నిన్న SSMB28.. నేడు 'వార‌సుడు'!

Update: 2023-01-17 17:30 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ దాదాపు 12 ఏళ్ల విరామం త‌రువాత ఓ భారీ క్రేజీ ప్రాజెక్ట్ ని చేస్తున్న విష‌యం తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై స్టార్ ప్రొడ్యూస‌ర్ ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. చాలా ఏళ్ల విరామం త‌రువాత త్రివిక్ర‌మ్ - మ‌హేష్ ల క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో మ‌హేష్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందా? అని ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఎట్ట‌కేల‌కు వారి ఎదురు చూపుల‌కు తెర‌దించుతూ ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని సెప్టెంబ‌ర్ లో మొద‌లు పెట్టారు.

ముందుగా భారీ యాక్ష‌న్ ఎపిసోడ్ ని రూపొందించారు. అయితే ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో భారీ ఖర్చు చేసి తెర‌కెక్కించిన యాక్ష‌న్ ఘ‌ట్టాల‌ని ప‌క్క‌న పెట్టేశార‌ట‌. ఇప్పుడు ఇదే త‌ర‌హాలో 'వార‌సుడు' కోసం షూట్ చేసిన ఓ కీల‌క సీన్ ని కూడా ప‌క్క‌న పెట్టార‌ని, దాని కోసం ఏకంగా ప‌ది కోట్లు ఖ‌ర్చు చేశార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌మిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ క‌థానాయ‌కుడిగా న‌టించిన త‌మిళ మూవీ 'వారీసు'. ఇదే మూవీని తెలుగులో 'వార‌సుడు' పేరుతో రిలీజ్ చేశారు.

వంశీ పైడిప‌ల్లి అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించిన ఈ మూవీలో హీరోయిన్ గా ర‌ష్మిక మంద‌న్న న‌టించింది. సినిమా త‌మిళంలో అనుకున్న విధంగా వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తున్నా తెలుగులో మాత్రం సైలెంట్ అయిపోయింది. ఇదిలా వుంటే ఈ మూవీని దిల్ రాజు అనుకున్న బ‌డ్జెట్ కంటే భారీగానే ఖ‌ర్చు చేశార‌ట‌. వ‌ర్కింగ్ డేస్ కూడా భారీగా పెర‌గ‌డంతో బ‌డ్జెట్ అనుకున్న దానికి మించి బ‌డ్జెట్ పెరిగింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

అంతే కాకుండా ఈ మూవీ కోసం న‌టి ఖుష్బూ తో పాటు హీరో విజ‌య్‌, హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న పాల్గొన‌గా చిత్రీక‌రించిన 20 నిమిషాల ఎపిసోడ్ ని ఫైన‌ల్ క‌ట్ లో లేపేశార‌ట‌. దీనికి అయిన ఖ‌ర్చు అక్ష‌రాలా 10 కోట్లు అని తెలుస్తోంది. ఈ సీన్ లో న‌టించ‌డానికి ఖుష్బూకు భారీగానే పారితోషికం ఇచ్చార‌ట‌. అయితే ఫైన‌ల్ క‌ట్ త‌రువాత ఈ సీన్ ని తీసేయ‌డంతో సినిమాలో ఖుష్బూ క‌నిపించ‌లేదు. దీనిపై గ‌తంలో ఖుష్బూ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు కూడా.

త‌న పాత్ర‌ని క‌ట్ చేయ‌డంపై చిత్ర బృందం వివ‌ర‌ణ ఇస్తే బాగుంటుంద‌ని కూడా త‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. అయితే దిల్ రాజు మాత్రం త‌న పాత్ర‌ని తొల‌గించ‌డం పై ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా వుంటే త‌మిళంలో రాణిస్తున్న 'వారీసు' తెలుగులో మాత్రం ఎలాంటి సంద‌డి చేయ‌డం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ప‌బ్లిసిటీ లేక‌పోవ‌డంతో సైలెంట్ అయిపోయింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News