మూవీ రివ్యూ : వరుడు కావలెను

Update: 2021-10-29 14:18 GMT
చిత్రం : ‘వరుడు కావలెను’

నటీనటులు: నాగశౌర్య-రీతూ వర్మ-నదియా-మురళీ శర్మ-వెన్నెల కిషోర్-ప్రవీణ్- హర్షవర్ధన్-సప్తగిరి-జయప్రకాష్-హిమజ-ఆనంద్ తదితరులు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్-థమన్
నేపథ్య సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు
మాటలు: గణేష్ రావూరి
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: లక్ష్మీ సౌజన్య

నాగశౌర్య.. రీతూ వర్మ జంటగా కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య రూపొందించిన చిత్రం ‘వరుడు కావలెను’. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో తెరకెక్కిన ఈ చిత్రం చక్కటి ప్రోమోలతో ఆకట్టుకుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కనిపించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ఆకాశ్ (నాగశౌర్య) ప్యారిస్ లో ఆర్కిటెక్ట్. ఓ ప్రాజెక్టు పని మీద ఇండియాకు వచ్చిన అతను.. తన ఫ్రెండు తండ్రికి సంబంధించిన కంపెనీని నడిపిస్తున్న భూమి (రీతూ వర్మ)ను చూసి ఆకర్షితుడవుతాడు. వాళ్లిద్దరూ ఒకప్పుడు కలిసి చదువుకుని ఉంటారు. భూమి కంపెనీలో ఒక ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్ విషయంలో ఆలస్యం జరుగుతుండటంతో ఆకాశ్ రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో తనతో సహా అందరితో చాలా స్ట్రిక్టుగా ఉండే భూమిలో ఆకాశ్ మార్పు తీసుకొస్తాడు. ఇద్దరూ ఒకరికొకరు దగ్గరవుతారు. ఇక తమ ప్రేమను పరస్పరం చెప్పుకుందామనుకున్న సమయంలో ఆకాశ్ ను అపార్థం చేసుకుని అతడికి దూరమవుతుంది భూమి. మరి ఆ అపార్థానికి కారణమేంటి.. అది తొలగిపోయి ఇద్దరూ ఒక్కటయ్యారా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ప్రేమకథా చిత్రాల్లో అత్యంత కీలకమైన విషయాలు రెండు.. ఒకటి లీడ్ పెయిర్ మధ్య సమస్యకు దారి తీసే కాన్ఫ్టిక్ట్ పాయింట్ అయితే.. ఇంకోటి ఆ పాత్రలు-వాటి జర్నీతో ప్రేక్షకులకు ఏర్పడే ఎమోషనల్ కనెక్ట్. హీరో హీరోయిన్ల మధ్య అపార్థాలు వచ్చి విడిపోయినా.. లేక పెద్దల వల్లో.. మరో కారణంతోనో ఇద్దరి మధ్య దూరం వచ్చినా.. ఆ కారణం లేదా ఆ అపార్థం చాలా బలంగా అనిపించాలి. అప్పుడు ఆ ఎడబాటు సహేతుకంగా అనిపిస్తుంది. ఇక పాత్రలతో ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ బలంగా ఏర్పడితే.. ఆ జంట విడిపోతున్నపుడు మనసు మెలిపెడుతుంది. వాళ్లు మళ్లీ కలవాలన్న బలమైన కోరిక పుడుతుంది. ఆ క్రమంలో ఆ బాధను ఫీలవుతాం.. ఆ బాధ తర్వాత వచ్చే సంతోషాన్ని ఆస్వాదిస్తాం. ఐతే ‘వరుడు కావలెను’ సినిమాలో ఆకర్షణలున్నా.. ఈ రెండు విషయాల్లోనూ మాత్రం సాధారణంగా తయారైంది. ఆశలు రేకెత్తించేలా మొదలై.. ఒక దశ వరకు బాగానే వినోదాన్నందించే ఈ చిత్రం కాన్ఫ్లిక్ట్ పాయింట్ దగ్గరికొచ్చేసరికి మాత్రం తేలిపోయింది. హీరో హీరోయిన్ల మధ్య అపార్థం.. ఆ తర్వాత వారి మధ్య ఎడబాటు.. అంతా కూడా ఒక రకమైన అసహజత్వంతో నడవడంతో ఎమోషనల్ కనెక్ట్ కరవై చివరికొచ్చేసరికి ఒక మామూలు సినిమాలా మారిపోయింది ‘వరుడు కావలెను’. కాకపోతే కుటుంబ ప్రేక్షకులకు నచ్చే క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా కావడం దీనికి ప్లస్.

రొటీన్.. మూస అని ఎక్కువగా కమర్షియల్ సినిమాల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. ఐతే ఫ్యామిలీ ఎమోషన్లు మిక్స్ చేసి ప్రేమకథా చిత్రాలు తీయడంలోనూ టాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఒక మూసలోకి వెళ్లిపోతున్నట్లుగా అనిపిస్తుంది ‘వరుడు కావలెను’ చూస్తుంటే. చాలామంది ఈ విషయంలో త్రివిక్రమ్ ను అనుసరిస్తుంటారు. కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య కూడా అదే చేసింది. కథ.. పాత్రల పరంగా ఇందులో ఏ కొత్తదనం లేదు. కూతురికి పెళ్లి చేయాలని తపన పడే తల్లి.. కూతురికి పెళ్లి చేయడం కంటే ఆమె సంతోషకరమైన జీవితం ఇవ్వాలనుకునే తండ్రి.. పెళ్లి పట్ల ఒక ఏహ్య భావం పెంచుకుని తనకు నచ్చినట్లుగా బతుకుతున్న కూతురు.. టిపికల్ గా కనిపించే కథానాయికతో ప్రేమలో పడిపోయి ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించే అబ్బాయి.. ఇలా చాలా వరకు పైన చెప్పుకున్న తరహా సినిమాల్లో చూసిన టెంప్లేట్ పాత్రలే ఇందులోనూ కనిపిస్తాయి. ‘మన్మథుడు’లో హీరోకు ఫిమేల్ వెర్షన్ లాగా కనిపించే కథానాయిక పాత్ర చుట్టూ ఆరంభంలో వినోదాన్ని పండించేందుకు చేసిన ప్రయత్నం బాగానే ఫలితాన్నిచ్చింది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ పంచుల మీద పంచులతో తను కనిపించినంత సేపూ నవ్వించాడు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు రొటీన్ గా అనిపించినా.. విసిగించనైతే విసిగించవు. హీరోయిన్ ఆఫీస్ చుట్టూ తిరిగే సన్నివేశాలే చాలా వరకు ప్రథమార్ధంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాయి. హీరోయిన్ తల్లి పాత్రతో ఒక ట్రాక్ నడిపారు కానీ.. అందులో ఏమంత విశేషం లేదు.

పాటలు.. మంచి విజువల్స్.. కొంచెం కామెడీ.. వీటికి తోడు హీరో హీరోయిన్లు ఒకరికొకరు దగ్గరయ్యే సన్నివేశాలతో ‘వరుడు కావలెను’ ప్రథమార్ధం బాగానే పాసైపోతుంది. ఐతే ఎంతో సాఫీగా సాగిపోతున్న ప్రేమకథ ఎలాంటి మలుపు తిరుగుతుందా.. ఇంతగా దగ్గరైపోతున్న హీరో హీరోయిన్ల మధ్య ఎలాంటి సమస్యను సృష్టిస్తారా అన్న ఆసక్తి పుడుతుంది. ఇక్కడే ‘వరుడు కావలెను’ తుస్సుమనిపించేస్తుంది. హీరోను అపార్థం చేసుకుని హీరోయిన్ వెళ్లిపోవడానికి చూపించిన కారణం మరీ సిల్లీగా అనిపిస్తుంది. ఒక్క నిమిషం ఆమె ఆలోచించినా.. కాస్త ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం హీరో చేసినా సింపుల్ గా తేలిపోయేదానికి అంత అపార్థం ఏమిటో అర్థం కాదు. ఏదో ఇంటర్వెల్ వచ్చింది.. ఇద్దరి మధ్య ఎడబాటు రావాలి కాబట్టి వచ్చింది అన్నట్లుందే తప్ప ఈ కాన్ఫ్లిక్ట్ పాయింట్లో ఏమాత్రం బలం లేదు. ఆ తర్వాత కూడా ఏ క్షణంలో అయినా దూదిపింజలా తేలిపోయే అపార్థమే ఇది కావడంతో మళ్లీ క్లైమాక్స్ వరకు ఎదురు చూడాల్సి రావడం ప్రేక్షకులకు సమస్యే.

ఇదో ఇబ్బంది అయితే ద్వితీయార్ధం మొదలు కాగానే హీరో హీరోయిన్ల కాలేజీ రోజుల్లోకి వెళ్లి హీరోయిన్ వన్ సైడ్ ప్రేమకథను చూపించారు. అది ప్రేక్షకులకు శిరోభారాన్ని కలిగించేదే. దాదాపు అరగంట సాగే ఈ ఎపిసోడ్లో చెప్పుకోదగ్గ ఒక్క సీన్ లేదు. మరీ బోరింగ్ గా.. రొటీన్ గా సాగే ఎపిసోడ్ సినిమా మీద అప్పటిదాకా ఉన్న ఇంప్రెషన్ ను తగ్గించేస్తుంది. ఆ ఎపిసోడ్ అవ్వగానే ఓ పెళ్లి చుట్టూ మరో ఎపిసోడ్ నడిపించారు. అందులో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాల గురించి మాట్లాడ్డానికేమీ లేదు. కేవలం ఇక్కడ సప్తగరి ‘ల్యాగ్’ కామెడీ.. అలాగే పరమ బద్దకిష్టు అయిన ఇంకో కమెడియన్ మీద నడిపించిన కామెడీ ట్రాక్ మాత్రం ఆకట్టుకుంటాయి. ద్వితీయార్ధంలో ప్రేక్షకులకు ఇదే పెద్ద రిలీఫ్. ప్రథమార్ధంలో కొంచెం స్పెషల్ గా అనిపించే హీరోయిన్ పాత్ర ద్వితీయార్ధంలో దిశా నిర్దేశం లేకుండా ప్రవర్తిస్తుంది. ఉన్నట్లుండి ఆమె తన వ్యక్తిత్వాన్ని ఎందుకు మార్చుకుంటుందో.. మరోవైపు హీరో పట్ల ఆమె ఎందుకంత మొండిగా ప్రవరిస్తుందో అర్థం కాదు.

చివర్లో ఎమోషన్లతో పిండేయడానికి చూశారు కానీ.. ఏమీ లేని దానికి అందరూ ఇంత ఎమోషనల్ అయిపోవడం ఏంటి అనిపిస్తుంది. దీనికి తన కెరీర్లోనే బెస్ట్ క్లైమాక్స్ అని నాగశౌర్య ఎందుకన్నాడా అనే సందేహాలు రేకెత్తిస్తాయి పతాక సన్నివేశాలు. లీడ్ పెయిర్ బాగుండటం.. మ్యూజిక్.. విజువల్స్ సహా సాంకేతిక ఆకర్షణలన్నీ బాగా కుదరడం.. అక్కడక్కడా కొంచెం కామెడీ వల్ల ‘వరుడు కావలెను’ ఓ మోస్తరుగా అనిపిస్తుంది తప్ప ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడం కానీ.. బలమైన ఇంపాక్ట్ వేయడం కానీ జరగలేదు. కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ఛాయిసే. యూత్ మాత్రం పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా టైంపాస్ ఎంటర్టైన్మెంట్ కు రెడీ అంటే మాత్రం ఓ లుక్కేయొచ్చు.

నటీనటులు:

నాగశౌర్య తన కెరీర్లోనే అత్యంత అందంగా.. స్టైలిష్ గా కనిపించాడీ సినిమాలో. అతడి లుక్స్.. స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగున్నాయి. సినిమా ఆద్యంతం యూత్ కు బాగా కనెక్టయ్యేలా కనిపించాడు. అతడి పెర్ఫామెన్స్ కూడా బాగుంది. ఎమోషనల్ సీన్లలో కూడా బాగా చేశాడు. రీతూ వర్మ గ్లామర్ పరంగా కొన్ని చోట్ల బాగున్నా.. కొన్ని చోట్ల సాధారణంగా అనిపిస్తుంది. తన నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్లకు ఇంత ప్రాధాన్యమున్న పాత్రలు దొరకడం అరుదు. ఆ అవకాశాన్ని రీతూ బాగానే ఉపయోగించుకుంది. నదియా హీరోయిన్ తల్లిగా కొంచెం కీలకమైన పాత్రే చేసింది. ఆమె బాగానే న్యాయం చేసినా ఆ పాత్ర నుంచి ఇంకా ఆశిస్తాం. మురళీ శర్మ తక్కువ సన్నివేశాల్లోనే తన ప్రత్యేకతను చాటుకున్నాడు. జయప్రకాష్ బాగానే చేశారు. వెన్నెల కిషోర్.. సప్తగిరి నవ్వుల బాధ్యత బాగానే నిర్వర్తించారు. ప్రవీణ్.. హిమజ.. ఆనంద్.. మిగతా నటీనటులంతా ఓకే.

సాంకేతిక వర్గం:

‘వరుడు కావలెను’కు సాంకేతిక హంగులన్నీ బాగా కుదిరాయి. విశాల్ చంద్రశేఖర్ సినిమా శైలికి తగ్గట్లు క్లాస్ మ్యూజిక్ ఇచ్చాడు. కాకపోతే పాటలన్నీ ఓకే అనిపించినా.. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా అయితే లేవు. తమన్ కంపోజ్ చేసిన దిగు దిగు నాగ.. పాట ఓకే. విశాల్ నేపథ్య సంగీతం బాగుంది. వంశీ పచ్చిపులుసు ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు సితార ఎంటర్టైన్మెంట్స్ స్థాయికి తగ్గట్లు ఉన్నతంగానే సాగాయి. గణేష్ రావూరి మాటలు బాగున్నాయి. ‘‘పొగరుబోతులకు ప్రిమియర్ లీగ్ పెడితే.. ప్రతిసారీ ఆమే ఫస్ట్’’ లాంటి ఫన్నీ పంచులు బాగా పేలాయి. అతడి ఎమోషనల్ డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఇక కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య పనితనానికి ఓ మోస్తరు మార్కులు పడతాయి. ఆమె ఎంచుకున్న కథలో కొత్తదనం లేదు. స్క్రీన్ ప్లే పరంగా కూడా ఒక టెంప్లేట్లో వెళ్లిపోయింది సౌజన్య. ఐతే సన్నివేశాలను నీట్ గా.. వినోదాత్మకంగా ప్రెజెంట్ చేయడంలో సౌజన్య ప్రతిభ చాటుకుంది. కామెడీ మీద ఆమెకు గ్రిప్ ఉందని అర్థమవుతుంది. ఎమోషనల్ సీన్లు కూడా బాగానే డీల్ చేసినా.. కాన్ఫ్లిక్ట్ పాయింట్ విషయంలో కసరత్తు చేయకపోవడం వల్ల అవి పండలేదు.

చివరగా: వరుడు కావలెను.. జస్ట్ ఓకే

రేటింగ్ - 2.75/5
Tags:    

Similar News