ఇంతవరకూ నేను ఎంజాయ్ చేస్తూ చూసిన సినిమా ఇదే!

Update: 2022-05-30 17:30 GMT
'ఎఫ్ 2' తరువాత ఆ స్థాయిలో పూర్తి హాస్యభరితమైన సినిమా రాలేదు. ఆ సినిమాకి విపరీతమైన రెస్పాన్స్ రావడం .. రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టడంతో ఆ సినిమాకి సీక్వెల్ చేశారు. 'ఎఫ్ 3' పేరుతో దిల్ రాజు ఈ సీక్వెల్ ను నిర్మించారు. 'ఎఫ్ 2' సినిమాలో గ్లామర్ కోసం తమన్నా .. మెహ్రీన్ పైనే ఆధారపడిన అనిల్ రావిపూడి, ఈ సినిమా కోసం సోనాల్ ను .. పూజాను అదనంగా తీసుకుని వచ్చాడు.  కామెడీ వైవు నుంచి సునీల్ ను .. అలీని తీసుకుని నవ్వుల డోసును పెంచే ప్రయత్నం చేశాడు. ఈ నెల 27వ తేదీన మంచి ఓపెనింగ్స్ తో ఈ సినిమా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించింది. ఈ స్టేజ్ పై వరుణ్ తేజ్ మాట్లాడుతూ .. " ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఈ స్థాయిలో ఆదరించిన ప్రేక్షకులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్య కాలంలో చారిత్రక చిత్రాలు  .. భారీ యాక్షన్ సినిమాలు చేస్తున్నారుగానీ, చిన్నపిల్లలకు కూడా కనెక్ట్ అయ్యే సినిమాలు మాత్రం రావడం లేదు. ఆ లోటును 'ఎఫ్ 3' తీర్చినట్టుగానే కనిపిస్తోంది. ఈ సినిమా చూస్తూ థియేటర్స్ లో పిల్లలు చేస్తున్న సందడి చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది.

ఈ సినిమాకి వెళ్లిన మా ఫ్రెండ్స్ కొంతమంది కొన్ని వీడియోలను నాకు షేర్ చేస్తున్నారు. సినిమా అయిపోయిన తరువాత  పిల్లలు బయటికి వెళ్లకుండా అక్కడే డాన్సులు చేస్తున్నారు. వాళ్లందరికీ అంత మంచి సినిమాను ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి థ్యాంక్స్  చెబుతున్నాను. నేను  కూడా ఎప్పుడూ థియేటర్ కి వెళ్లి ఇంత ఎంజాయ్ చేసింది లేదు. కోవిడ్ సమయంలో మా ఇంట్లో వాళ్లతో కంటే ఈ సినిమా టీమ్ తోనే నేను ఎక్కువగా ఉన్నాను. ఈ టీమ్ తో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.

రాజేంద్రప్రసాద్ గారు ఒక సీనియర్ ఆర్టిస్టుగా కాకుండా .. ఒక ఫ్రెండ్ గా ఆయన కలిసిపోతారు. ఇక వెంకటేశ్ గారి వంటి సీనియర్స్ స్టార్ తో కలిసి  మరోసారి కలిసి పనిచేసే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో నన్ను ఒక భాగం చేసిన  దిల్ రాజుగారికి మరోసారి  కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా టీమ్ ఇంకా పెద్ద ఈవెంట్స్ ప్లాన్ చేస్తోంది. అప్పుడు మిగతా విషయాలు మాట్లాడతాను" అంటూ ముగించాడు.
Tags:    

Similar News