వెంకీమామ ప్రాజెక్ట్ క్యాన్సిల్?

Update: 2018-10-27 06:51 GMT
అక్కినేని నాగ చైతన్య తన మేనమామ దగ్గుబాటి వెంకటేష్ తో కలిసి 'వెంకీమామ' అనే మల్టిస్టారర్ కు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఫార్మల్ గా లాంచ్ చేయడం కూడా జరిగింది.  బాబీ డైరెక్షన్ లో తెరకెక్కాల్సిన ఈ సినిమా గురించి ఓ షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.  ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందనేది ఆ వార్త సారాంశం.

ఈ సినిమాను కోన వెంకట్ - పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారితో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డీ. సురేష్ బాబు నిర్మించాల్సి ఉంది.  కానీ దర్శకుడు బాబీ - రచయిత కోన వెంకట్ లు రీసెంట్ గా సురేష్ బాబుకు ఫైనల్ వెర్షన్ వినిపించారట.  సురేష్ బాబుకు నచ్చకపోవడంతో ప్రాజెక్ట్ ను పక్కనపెడదామనే నిర్ణయం తీసుకున్నారట.  ఖచ్చితంగా హిట్ మెటీరియల్ అయితేనే ముందుకెళ్ళాలని.. యావరేజ్ స్టఫ్ అయితే రిస్క్ వద్దని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని సమాచారం.  చాలా డిస్కషన్ల తర్వాతే అయన ఈ కఠిన నిర్ణయానికి వచ్చారట.

టాలీవుడ్ లోని సీనియర్ నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబును అల్లాటప్పా స్టోరీతో మెప్పించడం అంత సులువు కాదని ఇప్పటికే టాక్ ఉంది. ఈ పరిణామంతో అది మరోసారి ఋజువయినట్టే.  ఏదేమైనా వెంకీ - చైతూల కాంబినేషన్ లో ఒక ఎంటర్టైనర్ ను చూద్దామనుకున్న ప్రేక్షకులను ఇది నిరాశపరిచే వార్తే.
Tags:    

Similar News