'ఎఫ్ 3' ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించింది!

Update: 2022-05-30 17:30 GMT
జంధ్యాల తన గురువుగారు అంటూ అనిల్ రావిపూడి పూర్తి హాస్యభరిత చిత్రంగా 'ఎఫ్ 3' సినిమాను రూపొందించాడు. 'ఎఫ్ 2' సినిమాలో తమని పట్టించుకోవడం లేదంటూ భర్తలను భార్యలు టార్చర్ పెట్టడాన్ని వినోదభరితంగా చూపించిన ఆయన, 'ఎఫ్ 3' సినిమాలో కథను డబ్బు చుట్టూ తిప్పాడు. చాలా తేలికగా ధనవంతులమైపోవాలనే ఆశతో కథానాయకులు .. నాయికలు ఎలాంటి డ్రామాను ప్లే చేశారు? చివరికి వాళ్లకి ఎలాంటి పరిస్థితి ఎదురైందనేది కథ. ఇలా ఒక సరదా కంటెంట్ తో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల  27 వ తేదీన థియేటర్లకు వచ్చింది.

విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుండటంతో, ఈ సినిమా టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించింది. వెంకటేశ్.. వరుణ్ తేజ్ .. రాజేంద్ర ప్రసాద్ .. అలీతో పాటు, ఇతర నటీనటులు .. దర్శక నిర్మాతలు ఈ  కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేదికపై వెంకటేశ్ మాట్లాడుతూ ..  "అందరి ప్రేక్షకులకు ఈ సినిమా ఇంత బాగా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. షూటింగు సమయంలోనే అనిపించింది .. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందని.

ఈ సినిమాలో ప్రతి సీన్ చేసేటప్పుడు అందరూ కూడా నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేశారు. అందుకు వాళ్లందరికీ కూడా థ్యాంక్స్ చెబుతున్నాను.  టీమ్ లోని ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తూ చేశారు. టీమ్ వర్క్ కారణంగానే ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించిందని  నేను నమ్ముతున్నాను. అందరూ కూడా సొంత సినిమాలా భావించి ఈ సినిమా కోసం కష్టపడ్డారు. కొంతకాలంగా థియేటర్లకు దూరంగా ఉంటున్న ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా థియేటర్లకు తీసుకుని వచ్చింది .. అందుకు చాలా ఆనందంగా ఉంది.

నా సినిమాలు థియేటర్స్ కి రాక రెండు .. మూడేళ్లు అవుతోంది. నా సినిమా ఎప్పుడు థియేటర్స్ కి వస్తుందా అని అభిమానులంతా చాలా ఓపికగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఈ స్థాయిలో హిట్ కావడం వాళ్లందరికీ సంతోషాన్ని కలిగించే విషయం. ఈ సినిమాను ప్రేక్షకుల వరకూ  తీసుకుని వెళ్లిన మీడియా వారికి   కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను " అంటూ చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News