ఎందుకు ఫ్లాపైందో చెప్పాడు

Update: 2017-02-21 08:59 GMT
‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించాడు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ టర్న్డ్ హీరో విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు తర్వాత అతను చేసిన ‘బేతాళుడు’ మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ సినిమా అంచనాల్ని అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. అసలీ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో విజయ్ ఆంటోనీ విశ్లేషించాడు.

‘‘బేతాళుడు మంచి సబ్జెక్ట్. కానీ సరిగా డీల్ చేయకపోవడంతో ఆడలేదు. సినిమా రిలీజయ్యాక మేం చేసిన తప్పేంటో తెలిసింది. విలన్స్ ఎవరనేది ప్రథమార్ధంలోనే రివీల్ చేసి ఉండాల్సింది. కానీ అలా చేయకపోవడంతో ప్రథమార్ధంలో చూపించిన జయలక్ష్మి పాత్ర వెనుక పెద్ద థ్రిల్లింగ్ స్టోరీ ఉంటుందని ఆడియన్స్ అనుకున్నారు. కానీ ద్వితీయార్ధంలో వాళ్ల అంచనాలకు భిన్నంగా సినిమా సాగింది. దీంతో సినిమా రిజల్ట్ అనుకున్నట్లుగా రాలేదు. కానీ ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తమిళంలో నాలుగు రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వచ్చేశాయి’’ అని విజయ్ ఆంటోనీ చెప్పాడు.

తాను మంచి నటుడిని కాదని.. అందుకే మంచి కథలు ఎంచుకునే వాటి ప్రకారం సినిమాలు చేసుకుపోతున్నానని విజయ్ ఆంటోనీ తెలిపాడు. ‘బిచ్చగాడు’ సినిమాతో తన కెరీరే మారిపోయిందని.. ఆ సినిమా తర్వాత బోలెడంత మంది నిర్మాతలు తన దగ్గరికి అడ్వాన్సులతో వచ్చారని.. ఐతే అందరితోనూ సినిమాలు ఒప్పుకుని ఇబ్బంది పడలేక తిరస్కరించానని.. తాను ఎంచుకునే కథలు వైవిధ్యంగా.. కొంచెం రిస్కీగా ఉంటాయి కాబట్టే తన సొంత బేనర్లోనే సినిమాలు చేసుకుంటున్నానని విజయ్ ఆంటోనీ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News