బిచ్చగాడు మరీ తగ్గిపోయాడు

Update: 2018-10-29 01:30 GMT
తమిళ స్టార్‌ హీరో విజయ్‌ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఈయన తెలుగులో ‘బిచ్చగాడు’కు ముందు, తర్వాత అన్నట్లుగా కెరీర్‌ సాగించాడు. బిచ్చగాడు చిత్రానికి ముందు పలు చిత్రాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. కాని ఏ ఒక్క సినిమా కూడా పెద్దగా సక్సెస్‌ కాలేదు. కాని ఎప్పుడైతే బిచ్చగాడు చిత్రం వచ్చిందో తెలుగులో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. బిచ్చగాడు తర్వాత విజయ్‌ తమిళంలో నటించిన ప్రతి ఒక్క సినిమా కూడా తెలుగులో డబ్‌ అయ్యింది. ఆమద్య బేతాలుడు ఏకంగా 10 కోట్ల వరకు అమ్ముడు పోయినట్లుగా ప్రచారం జరిగింది. కాని ప్రస్తుతం పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.

‘బిచ్చగాడు’ చిత్రం తర్వాత ఇప్పటి వరకు విజయ్‌ ఆంటోనికి సరైన సక్సెస్‌ తెలుగులో దక్కలేదు. దాంతో సినిమా సినిమాకు ఈయన క్రేజ్‌ తగ్గడంతో పాటు - తెలుగులో మార్కెట్‌ పడిపోతూ వచ్చింది. తాజాగా విజయ్‌ సేతుపతి నటించిన తమిళ చిత్రాన్ని తెలుగులో ‘రోషగాడు’ అనే టైటిల్‌ తో డబ్‌ చేసేందుకు సిద్దం అయ్యాడు. ఈ చిత్రాన్ని తెలుగులో రెండు కోట్లకు అమ్మాలని మొదట తమిళ నిర్మాతలు భావించారట. కాని కోటిన్నర కంటే ఎక్కువ ఇవ్వలేమని తెలుగు నిర్మాతలు తేల్చి చెప్పడంతో సరే అంటూ కోటిన్నరకు ఇవ్వడం జరిగింది.

తీరా సినిమా విడుదల దగ్గర పడుతున్న సమయంలో ‘రోషగాడు’ చిత్రం  డబ్బింగ్‌ రైట్స్‌ తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను కూడా అదే కోటిన్నరకు ఇవ్వాలంటూ తెలుగు నిర్మాతలు పేచి పెట్టడంతో వారు కూడా ససేమేర అన్నారట. కోటిన్నరకు డబ్బింగ్‌ రైట్స్‌ తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ఇవ్వడం కుదరదంటూ తమిళ నిర్మాతలు అంటున్నారు. కాని ఆ కోటిన్నరకు కూడా ‘రోషగాడు’ చిత్రాన్ని తీసుకునే వారు లేరంటూ ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. సినిమా విడుదల తరుణం ముంచుకు వస్తున్న నేపథ్యంలో వారే ఆ కోటిన్నరకు డబ్బింగ్‌ రైట్స్‌, శాటిలైట్‌ రైట్స్‌ పిలిచి ఇస్తారని తెలుగు నిర్మాతలు ఎదురు చూస్తున్నారట. గతంలో పది కోట్లు పలికిన విజయ్‌ ఆంటోనీ సినిమా ఇప్పుడు మరీ దారుణంగా కోటిన్నరకు కూడా అమ్ముడు పోవడం లేదు.

Tags:    

Similar News