అదేంటి... రాత్రే కదా అవార్డును అమ్మింది - అపుడే తిరిగి ఇవ్వడమేంటి? అదేమీ ప్రొడక్టు కాదు కదా మనసు మార్చుకుని వెనక్కు ఇవ్వడానికి అని రకరకాలుగా ఆలోచించకండి. అసలు జరిగింది వేరు.
ప్రస్తుతం రౌడీ గ్యాంగ్ తో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ కి బాగా కనెక్టయ్యాడు. ఇపుడు అతను ఏం చేసినా ట్రెండ్ అవుతోంది. అమ్మాయిలు *బేబీ* అంటూ విజయ్ ను తెగ ముద్దు చేస్తున్నారు. అయితే, అర్జున్ రెడ్డి నటనకు అతనికి వచ్చిన ఫిల్మ్ ఫేర్ ను సొంతం చేసుకున్న విజయ్ ఇపుడు ఆ ఫిల్మ్ ఫేర్ తో అందరి మనసులు గెలిచే ప్రయత్నం చేస్తున్నాడు.
సమాజానికి కొంత తిరిగిచ్చే ఉద్దేశంతో తన ఫిల్మ్ ఫేర్ అవార్డును వేలం వేసి ఎవరైనా కొంటే ఆ డబ్బును సీఎం సహాయ నిధికి ఇస్తానని ప్రకటించారు విజయ్ దేవరకొండ. ఇది పెద్ద టాపిక్ అయ్యింది. ఈ ఐడియాకు స్పందించిన దివీస్ కంపెనీ యాజమాన్యం రూ.25 లక్షలకు వేలం పాడి ఆ అవార్డను సొంతం చేసుకున్నారు. 25 లక్షల చెక్కును దివీస్ లాబ్స్ యజమాని సతీమణి విజయ్ దేవరకొండకు అందించారు.
అయితే, తర్వాత అవార్డు మీ వద్ద ఉంటేనే దానికి అందం, గౌరవం మీ ఇంట్లో పెట్టుకోండి అని శకుంతలా దేవి తిరిగి ఇచ్చేయబోయిందట. అయితే వేలం వేసి అమ్మి ఇంట్లో పెట్టుకుంటే ఏం బాగుంటుందని... ఆ ప్రతిపాదనను మన అర్జున్ రెడ్డి తిరస్కరించారట.
అయితే, ఈ వేలం గురించి విజయ్ మదనపడ్డారట. అయినా నా అవార్డును ఎవరైనా కొంటారా? కొన్నా ఎంతకు కొంటారో అని తెగ ఆలోచించారట. అయితే స్పందన బాగుంది. చాలా మంది అడిగారు. ఓ వ్యక్తి ఫోన్ చేసి.. ఎంత అనుకుంటున్నారు? అని అడిగారు. ఓ ఐదు లక్షలకు పలికితే బాగుంటుందని అనుకుంటున్నా అన్నారట. అయితే రూ.5 లక్షలకు ఐదు రెట్లు చేసి 25 లక్షలకు పాడారు. ఇదిలా ఉండగా... తన అభిమానుల కోసం సొంత దుస్తుల బ్రాండ్ ‘రౌడీ క్లబ్’ను విజయ్ దేవరకొండ ప్రారంభించారు. ఆ వేదికపైనే విజయ్ దేవరకొండ ఫిల్మ్ ఫేర్ అవార్డును శకుంతల కొనుగోలు చేశారు.