హీరోలు దర్శకులకు క్రెడిట్ ఇస్తుంటారు. మహేష్‌ని పూరి తయారు చేశాడు. అందులో సందేహం లేదు. పోకిరి - బిజినెస్ మేన్ లాంటి సినిమాలతో పూరి ఇచ్చిన ఇమేజ్ అంతా ఇంతా కాదు. అల్లు అర్జున్ కి దేశముదురు ఇమేజ్ - ప్రభాస్ కి బుజ్జిగాడి ఇమేజ్ - మాస్ రాజా రవితేజకు ఇడియట్ ఇమేజ్ ఇచ్చింది పూరి. చరణ్ కి సుకుమార్ ఇటీవల `రంగస్థలం` చిత్రంతో కొత్త ఇమేజ్ ని ఇచ్చాడు. అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండకు రెబల్ ఇమేజ్ ని ఇచ్చింది సందీప్ రెడ్డి వంగ. ఇలా పరిశీలిస్తే .. దర్శకులే హీరోలకు కొత్త ఇమేజ్‌నిస్తారనడంలో సందేహం లేదు. ఇప్పుడు అదే తీరుగా పరశురామ్ తనకు ఓ కొత్త ఇమేజ్ నిస్తాడన్న నమ్మకం వ్యక్తం చేశాడు విజయ్ దేవరకొండ. గీత గోవిందంతో తనని ఫ్యామిలీ హీరోని చేశాడని అన్నాడు నేటి చిట్ చాట్ లో.
విజయ్ మాట్లాడుతూ -``ఈ చిత్రంలో నేను కొత్తగా కనిపిస్తానంటే .. నా దర్శకుడికే ఆ క్రెడిట్ దక్కుతుంది. నేను బాగా నటించాను అంటే దానికి కారణం నా దర్శకుడే. సినిమా ఇంత బాగా రావడానికి నిర్మాత బన్ని వాసు కారణమైతే పరశురామ్ వల్లనే నా పాత్ర తెరపై అంత బాగా వచ్చిందని కాన్ఫిడెంట్ గా చెప్పగలను`` అన్నాడు. అసలు నేను ఫ్యామిలీ సినిమాలు చేయకూడదు అనుకుంటున్న టైమ్ లో బన్నివాసు నన్ను కూచోబెట్టి మరీ కథ వినిపించి నాతో ఈ సినిమా చేయించారని తెలిపాడు.
దేవరకొండ తాను నటిస్తున్న నెక్ట్స్ సినిమాల గురించి చెబుతూ.. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సెట్స్ పై ఉంది. సెప్టెంబర్ నుంచి క్రాంతి మాధవ్ - కెయస్ రామారావు కాంబినేషన్ లో వేరొక సినిమా చేస్తున్నానని వెల్లడించాడు. గీత గోవిందం ఓ ఇమేజ్ నిస్తే - డియర్ కామ్రేడ్ వేరొక రకం ఇమేజ్ ని ఇస్తుందేమో చూడాలి.