విక్రాంత్ రోణ.. తెలుగు వెర్షన్ సంగతేంటి?

Update: 2022-09-04 05:30 GMT
కొన్నేళ్ల ముందు వరకు కన్నడ సినిమాలంటే అందరికీ చిన్న చూపు ఉండేది. అక్కడి సినిమాలు వేరే భాషల్లో అనువాదం కావడమే తక్కువ. అయిన వాటిని కూడా వేరే రాష్ట్రాల వాళ్లు పెద్దగా పట్టించుకునేవారు కాదు. 90ల్లో ఉపేంద్ర సినిమాల్ని మినహాయిస్తే తెలుగులో ప్రభావం చూపిన కన్నడ చిత్రాలు చాలా చాలా తక్కువ. ఐతే గత గత కొన్నేళ్లలో కన్నడ సినిమాల క్వాలిటీ పెరిగి అందరూ అటు వైపు చూడడం మొదలైంది. ముఖ్యంగా 'కేజీఎఫ్' మూవీతో కన్నడ సినిమా ముఖచిత్రమే మారిపోయిందని చెప్పాలి.

దాని పార్ట్-1, పార్ట్-2 ఎంత భారీ విజయాలు సాధించాయో తెలిసిందే. 'కేజీఎఫ్' తర్వాత ఇతర భాషల వాళ్లను అంతగా ఆకర్షించిన కన్నడ సినిమా అంటే 'విక్రాంత్ రోణ' అనే చెప్పాలి. 'ఈగ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కిచ్చా సుదీప్ ప్రధాన పాత్ర పోషించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ జులై నెలాఖర్లో విడుదలై అన్ని భాషల్లో మంచి విజయం సాధించింది. తెలుగులో కూడా ఈ సినిమా సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచింది.

ఐతే థియేటర్లలో 'విక్రాంత్ రోణ' చూడలేకపోయిన వాళ్లంతా డిజిటల్ రిలీజ్ కోసం ఎదురు చూస్తుండగా.. థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెల రోజులకు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. సెప్టెంబరు 2 నుంచి జీ5 ఈ చిత్రాన్ని స్ట్రీమ్ చేస్తోంది. ఐతే ఈ సినిమా చూద్దామని యాప్ ఓపెన్ చేసిన తెలుగు ప్రేక్షకులకు నిరాశ తప్పట్లేదు. అక్కడ కేవలం కన్నడ వెర్షన్ మాత్రమే స్ట్రీమ్ అవుతోంది. తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు. ఇదేం చిత్రం అని అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఐతే 'విక్రాంత్ రోణ'కు స్ట్రీమింగ్ డీల్ కొంచెం డిఫరెంటుగా జరిగింది. కన్నడ వెర్షన్‌ను మాత్రమే జీ5కు ఇచ్చిన మిగతా భాషల హక్కులను హాట్ స్టార్ వాళ్లకు ఇచ్చారు. పైగా అందులో తెలుగు వెర్షన్ ఆలస్యంగా రిలీజ్ కానుంది. ఈ నెల 16న నుంచి డిస్నీ హాట్ స్టార్‌ 'విక్రాంత్ రోణ' తెలుగు వెర్షన్‌ను ప్రదర్వించబోతోందట. ఈ విషయం తెలియక 'జీ5'లో తెలుగు వెర్షన్ కోసం తెగ వెతికేస్తున్నారు మన సినీ ప్రియులు. తెలుగు వెర్షన్ కోసం బాగానే ఆసక్తి కనిపిస్తోంది మన జనాల్లో. సుదీప్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అనూప్ భండారి రూపొందించాడు.
Tags:    

Similar News