వైరల్ పిక్: వైసీపీ ఎమ్మెల్యే కాలుపై కాలేసిన జూ. ఎన్టీఆర్..!

Update: 2022-08-25 08:55 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరియు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీల మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. నందమూరి తారకరామారావు మరియు హరికృష్ణ అంటే నానికి అమితమైన అభిమానం. తెలుగుదేశం పార్టీ నుంచే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. వంశీ కూడా అలానే. ఆ సమయంలోనే తారక్ ‏తో వీరిద్దరికీ మధ్య స్నేహం కుదిరింది.

ఎన్టీఆర్ హీరోగా నాని - వంశీ నిర్మాతలుగా పలు విజవంతమైన చిత్రాలను రూపొందించారు. అయితే ఇప్పుడు వీరికి సంబంధించిన ఓ త్రోబ్యాక్ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. షూటింగ్ గ్యాప్ లో సెట్స్ లో ముగ్గురు మిత్రులు సరదాగా గడుపుతున్న ఈ ఫోటోని అభిమానులు లైక్స్ కొడుతూ ఇతరులకు షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఫోటో వారికి అంత స్పెషల్ గా అనిపించింది.

ఇందులో ఎన్టీఆర్ - కొడాలి నాని - వల్లభనేని వంశీ కూర్చిని ఉన్నారు. చిత్ర నిర్మాత నాని ఇద్దరి మధ్యలో కూర్చుని సీరియస్ ‏గా ఏదో చూస్తుండగా.. తారక్ అతని కాలిపై కాలు వేసి కూర్చున్నారు. ఇది చూసి పక్కనే ఉన్న వల్లభనేని వంశీ సైతం నవ్వుతూ ఉన్నారు. ఈ ఫోటో అప్పట్లో వీరి ముగ్గురి మధ్య ఫ్రెండ్ షిప్ ఎలా ఉందనే విషయాన్ని తెలియజేస్తోంది.

ఇప్పుడు ఈ త్రోబ్యాక్ ఫోటో చక్కర్లు కొట్టడానికి కారణం ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడమే అని అర్థమవుతుంది. మూడు రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తారక్ భేటీ కావడం అటు పొలిటికల్ గా ఇటు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఎన్టీఆర్ టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు. అందులోనూ తన తాత స్థాపించిన టీడీపీ పార్టీ కోసం పని చేసిన వ్యక్తి కావడంతో బీజేపీ అగ్రనేతలతో సంబంధం ఏంటి అనే చర్చ జరిగింది. ఈ క్రమంలో తారక్ తో సాన్నిహిత్యం కలిగివున్న ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రయోజనం లేకుండా మోదీ - అమిత్ షా ఒక్క నిమిషం కూడా ఎవర్ని కలవరని నాని కామెంట్ చేయడం సంచలనంగా మారింది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు కొడాలి నాని - ఎన్టీఆర్ మధ్య ఫ్రెండ్ షిప్ ని గుర్తు చేయడానికి నెటిజన్లు త్రో బ్యాక్ చిత్రాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారనే విషయాన్ని సూచిస్తోంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇటీవల కాలంలో తారక్ - వంశీ - నాని లు కలిసి ఎక్కడా కనిపించలేదు. కానీ వారు ఏ పార్టీలో ఉన్న సాన్నిహిత్యం అలానే ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే టీడీపీకి ప్రత్యర్థి పార్టీ అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొడాలి నాని కొనసాగుతుండగా.. వల్లభనేని వంశీ మాత్రం టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ ప్రయోజనం కోసం కలిసి పనిచేస్తున్నారు. ఒకానొక సమయంలో ఎన్టీఆర్ కూడా జగన్ పార్టీకి మద్దతుగా ఉంటారని రూమర్స్ వచ్చాయి. అయితే కట్టె కాలే వరకూ తన తాత పెట్టిన పార్టీలోనే ఉంటానని తారక్ క్లారిటీ ఇచ్చారు.

అయితే ఇటీవల అమిత్ షాతో ఎన్టీఆర్ సమావేశం తర్వాత అతను బీజేపీ కోసం పనిచేస్తారనే వార్తలు ఊపందుకున్నాయి. ఇందులో నిజమెంతనే దానికి కాలమే సమాధానం చెప్పాలి. ప్రస్తుతానికైతే తారక్ వరుస సినిమాలు లైన్ లో పెడుతూ బిజీగా ఉన్నారు.

RRR తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న యంగ్ టైగర్.. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ మరియు బుచ్చిబాబు వంటి దర్శకులతో వర్క్ చేయనున్నారు.
Tags:    

Similar News