అనుష్కను తిడితే కోహ్లికి మండింది

Update: 2016-03-28 10:24 GMT
దేశమంతా విరాట్ కోహ్లి నామస్మరణతో ఊగిపోతోంది. మొన్న పాకిస్థాన్ మ్యాచ్ లో అద్భుత ఇన్నింగ్స్ తో టీమ్ ఇండియా సెమీస్ ఆశల్ని సజీవంగా నిలిపి ఉంచిన ఈ గ్రేట్ బ్యాట్స్ మన్.. తాజాగా ఆస్ట్రేలియాపై కూడా అనితర సాధ్యమైన ఇన్సింగ్స్ ఆడి భారత్ ను సెమీస్ చేర్చడంతో భారత క్రికెట్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి పోరాట యోధుడిని చూడలేదంటూ.. దిగ్గజ ఆటగాళ్లు సైతం విరాట్ ను ఆకాశానికెత్తేస్తున్నారు. ఇక అభిమానుల ప్రశంసలకైతే లెక్కేలేదు. ఐతే విరాట్ ను ఇలా పొగుడుతూనే.. మరోవైపు బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను అనవసరంగా ఆడిపోసుకుంటున్నారు జనాలు.

విరాట్ దాదాపు మూడేళ్ల పాటు అనుష్కతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. ఐతే ఆ సమయంలో విరాట్ ఫెయిలైనపుడల్లా దానికి అనుష్కే కారణం అని.. ఆమె వల్లే అతను డీవియేట్ అవుతున్నాడని.. ఆమెను తిట్టిపోసేవారు జనాలు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ చెత్త వ్యాఖ్యానాలు జోరుగా సాగేవి. దీనిపై అప్పట్లో విరాట్ తీవ్రంగా స్పందించాడు. ఐతే ఇప్పుడు విరాట్-అనుష్క విడిపోయారు. ఎవరి పని వాళ్లు చూసుకుంటున్నారు. ఐతే అనుష్కతో విడిపోయాక విరాట్ గొప్పగా ఆడుతుండటం ఆమెకు శాపంగా మారింది. అనుష్కతో విడిపోవడం వల్లే విరాట్ బాగా ఆడుతున్నాడంటూ ప్రచారం మొదలుపెట్టారు జనాలు. నిన్న రాత్రి నుంచి విరాట్ ను ఎంతగా పొగుడుతున్నారో.. అనుష్కను అంతగా తెగనాడుతున్నారు అభిమానులు. ఐతే బ్రేకప్ తర్వాత ఒక్కసారి కూడా అనుష్క పేరెత్తని విరాట్ కు ఈ దుష్ప్రచారం చూసి ఒళ్లు మండిపోయింది. ‘‘అనుష్కను తిట్టిపోస్తున్న వాళ్లను చూసి సిగ్గుపడుతున్నా. కొంచెం విజ్నత కలిగి ఉండండి. అనుష్క నా మీద ఎప్పుడూ సానుకూల ప్రభావమే చూపించింది’’ అన్నాడు విరాట్. మరి ఇప్పటికైనా జనాలు అనుష్కను తిట్టిపోయడం మానేస్తారేమో చూడాలి.
Tags:    

Similar News