కోహ్లి ఆ గుట్టు విప్పేశాడు

Update: 2018-09-26 08:56 GMT
భారత క్రికెట్ జట్టు కెప్టెన్.. ప్రపంచ మేటి బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లితో నేటి యువతరం బాగా కనెక్టవడానికి అతడి ఆహార్యం కూడా ఒక కారణం. ఫ్యాషన్ ట్రెండ్స్‌ ను ఎప్పటికప్పుడు ఫాలో అయ్యే విరాట్.. ఒంటి మీద చాలా పచ్చబొట్లతో కనిపిస్తాడు. కెరీర్ ఆరంభంలోనే అతడికి టాటూలపై ఇష్టం కలిగింది. అప్పట్నుంచి ఒంటి మీద రకరకాల పచ్చబొట్లు వేయించుకుంటూనే ఉన్నాడు. అతడి ఒంటి మీద తొమ్మిది పచ్చబొట్లు ఉండటం విశేషం. ఐతే ఊరికే ఏ టాటూ పడితే అది అతను ఒంటి మీద వేయించుకోలేదు. ప్రతి టాటూ వెనుకా ఒక కథ ఉంది. కారణం ఉంది. ఆ విశేషాలేంటో తాజాగా ఒక ఇంటర్వ్యూలో అతను వెల్లడించాడు.

కోహ్లి మోచేతికి పైన ‘సరోజ్’.. ‘ప్రేమ్’ అని పేర్లతో టాటూలున్నాయి. అవి అతడి తల్లిదండ్రుల పేర్లు కావడం విశేషం. వాటి కిందే మానస సరోవరంలో ఉన్న శివుడి చిత్రం కనిపిస్తుంది. కోహ్లి శివ తత్వాన్ని నమ్ముతాడు. అనుసరిస్తాడు. అందుకే ఆ టాటూ. ఇక దాని కందే ఒక ఆశ్రమాన్ని సూచించే టాటూ ఉంది. క్రికెట్‌ మైదానాన్ని ఒక ఆశ్రమంగా భావించి.. దానిపైనే శ్రద్ధ పెట్టాలన్న ఉద్దేశంతో ఈ టాటూ వేయించుకున్నాడు. అలాగే తాను ఒక పోరాట యోధుడిలా ఉండాలని గుర్తు చేస్తూ జపాన్ సమురాయ్ చిత్రాన్ని.. దేవుడు మనల్ని ఎప్పుడూ చూస్తూనే ఉన్నాడని గుర్తు చేసుకోవడానికి దేవుడి కన్ను.. ఈ ప్రపంచంలో మనం చిన్న రేణువు మాత్రమే అని గుర్తు చేసేలా ‘ఓం’ గుర్తు..  తాను భారత జట్టులో 175వ వన్డే ఆటగాడిగా, 269వ టెస్టు ఆటగాడిగా అరంగేట్రం చేయడాన్ని సూచిస్తూ ఆ అంకెలు.. తన రాశిని సూచిస్తూ ‘స్కార్పియో’ అనే అక్షరాల్ని.. అలాగే తనలోని దూకుడుకు గుర్తుగా ఒక ట్రైబల్ ఆర్ట్‌ను సూచించే చిత్రాన్ని టాటూలుగా వేయించుకున్నాడు కోహ్లి. ఈ టాటూలు తనలో నిరంతరం స్ఫూర్తి నింపుతాయని విరాట్ అంటున్నాడు.
Tags:    

Similar News