తమిళ్ రీమేక్ లో నటించనున్న 'మాస్ కా దాస్'...?

Update: 2020-06-13 09:50 GMT
ప్రస్తుతం టాలీవుడ్‌ లో రీమేక్‌ ల హవా కొనసాగుతోంది. ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడమనేది ఎప్పటి నుంచో వస్తున్నదే. ఆల్రెడీ హిట్ అయిన సినిమా కావడంతో రిస్క్ ఉండదని నిర్మాతలు భావిస్తుంటారు. ఈ రీమేక్‌లు ఎక్కువ శాతం హిట్ అవ్వడమే కాకుండా నిర్మాతలకు లాభాలను కూడా తెచ్చిపెడుతున్నాయి. అందుకే ఇతర భాషల హిట్ సినిమాల రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతుంటారు. ఈ క్రమంలో కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 'ఓ మై కడవులే' చిత్రాన్ని టాలీవుడ్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అశోక్ సెల్వన్ - రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి గెస్ట్ రోల్ లో కనిపించాడు. అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని హ్యాపీ హై పిక్చర్స్ బ్యానర్ పై ఢిల్లీ బాబు నిర్మించారు. లిమిటెడ్ బడ్జెట్ తో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది.

దీంతో ఈ సినిమాని ఇతర ఇండస్ట్రీలలో రీమేక్ చేయాలని పోటీ పడ్డారు. ఈ నేపథ్యం లో టాలీవుడ్ లో 'మై కాదవులే' సినిమాని రీమేక్ చేయాలని భావించిన ప్రముఖ నిర్మాత పీవీపీ సినిమాస్ రీమేక్ రైట్స్ దక్కించుకున్నారట. అంతేకాకుండా ఈ సినిమా అక్కినేని అఖిల్ కి సెట్ అవుతుందని భావించి ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపారట. అయితే అఖిల్ ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడట. ఆ తర్వాత ఈ రీమేక్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య.. నితిన్ లలో ఎవరో ఒకరితో చేయాలని అనుకున్నారట. దీనికి సంభందించిన అధికారిక ప్రకటన అయితే ఏదీ రాలేదు.

కాగా ఇప్పుడు లేటెస్టుగా ఈ ప్రాజెక్ట్ మరో యువ హీరో దగ్గర ఆగింది. అతనే యువ సంచలనం విశ్వక్ సేన్. తెలుగు సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ చేసినవి తక్కువ సినిమాలే అయినా తనకో స్టైల్, తన సినిమాల మీద ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నాడు. 'ఈ నగరానికి ఏమైంది' 'ఫలక్ నుమా దాస్' 'హిట్' సినిమాలతో తనకంటూ సపరేట్ ఆడియన్స్ ని సంపాదించుకున్నాడు. ఇప్పటకే 'పాగల్' అనే సినిమా స్టార్ట్ చేసిన విశ్వక్ మరో ప్రాజెక్ట్ ఓకే చేసాడు. ఈ రెండు సినిమాల తర్వాత 'ఓ మై కడవులే' తెలుగు రీమేక్ లో నటించే అవకాశాలున్నాయట. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News