సాగర్ కంటే ముందు 'భీమ్లా' కోసం వేరే దర్శకుడిని అనుకున్నారా..?

Update: 2022-02-19 06:31 GMT
పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటించిన 'భీమ్లా నాయక్' సినిమా విడుదలకు సిద్ధమైంది. మహాశివరాత్రి స్పెషల్ గా ఫిబ్రవరి 25న తెలుగు హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవన్ విశ్వరూపం చూడటానికి ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ని బట్టి ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో ఓ అంచనాకు వచ్చేసారు. ఓవైపు ఖాకీ డ్రెస్ లో మరోవైపు పంచెకట్టుతో ఆకట్టుకున్నాడు. దీంతో అభిమానులు రిలీజ్ కు ముందే దర్శకుడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

'భీమ్లా నాయక్' చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారనే సంగతి తెలిసిందే. 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రంతో విమర్శకుల మెప్పుపొందిన సాగర్.. వెంటనే పవన్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకోవడంతో అతని దశ తిరిగిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే ఈ చిత్రానికి సాగర్ కంటే ముందు వేరే దర్శకుడిని అనుకున్నారట.

పవన్ కళ్యాణ్ మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌' ని రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ప్రధాన కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్. అందుకే దీనికి స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించే బాధ్యత తీసుకున్నారు. ఈ క్రమంలో రీమేక్‌ ను హ్యాండిల్ చేయగలిగే ప్రతిభావంతులైన దర్శకుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఇందులో భాగంగా 'ఏకే' రీమేక్ కోసం 'బ్రోచేవారెవరురా' ఫేమ్ వివేక్ ఆత్రేయ ను అనుకున్నారట. అయితే అప్పటికే యువ దర్శకుడు నానితో 'అంటే సుందరానికీ' సినిమా చేయడానికి కమిట్ అయ్యుండటంతో.. పవన్ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారట.

ఈ నేపథ్యంలో టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర పేరు తెరపైకి వచ్చిందని తెలుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. పవర్ స్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వివేక్ వదులుకోవడంతో.. చివరకు సాగర్ కు ఈ అవకాశం వచ్చిందని అనుకుంటున్నారు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎన్నో రీమేక్ చిత్రాల్లో నటించారు. కంబ్యాక్ మూవీ 'వకీల్ సాబ్' కూడా రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ సక్సెస్ ఫుల్ గా తెర మీద ఆవిష్కరించారు. కాకపోతే ఏడాది గడుస్తున్నా తదుపరి సినిమాపై క్లారిటీ మాత్రం రావడం లేదు.

ఇప్పుడు సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకున్న 'భీమ్లా' సినిమాను సాగర్ చంద్ర చాలా బాగా హ్యాండిల్ చేసారని ఇన్సైడ్ టాక్. దీని వెనుక త్రివిక్రమ్ కూడా ఉన్నాడనేది ఎవరూ కాదనలేని వాస్తవం. మరి పవన్ కళ్యాణ్ సినిమా తర్వాత సాగర్ కెరీర్ కు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News