మహేష్‌ తో కుదర్లేదు.. అదుర్స్-2 ఉంటుంది

Update: 2018-02-07 12:14 GMT
చిరంజీవి.. బాలకృష్ణ.. వెంకటేష్.. ఎన్టీఆర్.. అల్లు అర్జున్.. రామ్ చరణ్.. ఇలా చాలామంది  స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు వి.వి.వినాయక్. ఐతే పవన్ కళ్యాణ్.. మహేష్ బాబులతో మాత్రం పని చేయలేదు. మహేష్ బాబుతో వినాయక్ సినిమా ఉంటుందని ఒక సమయంలో గట్టి ప్రచారమే జరిగింది. ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగినట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రాజెక్టు ఏమైందో తెలియదు. ఇక ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ గురించి చర్చే లేకుండా పోయింది.

తన కొత్త సినిమా ‘ఇంటిలిజెంట్’ ప్రమోషన్ల కోసం మీడియాను కలిసిన వినాయక్ దీని గురించి మాట్లాడాడు. నిజంగానే ఒక టైంలో మహేష్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు జరిగినట్లు వెల్లడించాడు. అప్పుడు కొన్ని కథల మీద పని చేశామని.. కానీ ఏ కథా సెట్టవ్వలేదని.. అందుకే తామిద్దరం కలిసి సినిమా చేయలేకపోయామని.. భవిష్యత్తులో తమ కాంబినేషన్లో సినిమా ఉంటే ఉండొచ్చని అన్నాడు.

ఇక చాన్నాళ్లుగా చర్చల్లో ఉన్న ‘అదుర్స్’ సీక్వెల్ గురించి కూడా వినాయక్ స్పందించాడు. కథ సెట్టవ్వకపోవడం వల్లే ఈ సినిమా కూడా వర్కవుట్ కాలేదని.. కానీ కచ్చితంగా ఏదో ఒక రోజు ఎన్టీఆర్ తో ‘అదుర్స్-2’ చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు వినాయక్. గతంలో తన సొంత కథలతో సినిమాలు చేసి.. ఇప్పుడు వేరే వాళ్ల కథలతోనే వరుసగా సినిమాలు చేస్తుండటంపై వినాయక్ స్పందిస్తూ.. ఎప్పుడూ సొంత కథలతోనే చేస్తే మొనాటనీ వస్తుందని.. బయటి వాళ్ల కథలతోనూ సినిమాలు చేయాలని.. రాఘవేంద్రరావు తనకు ఈ సలహా ఇచ్చారని వినాయక్ అన్నాడు.
Tags:    

Similar News