రెహమాన్.. జైహో

Update: 2017-07-19 12:04 GMT
భారతీయ సినీ సంగతానికి పేరు తెచ్చిన వ్యక్తి ఎ.ఆర్.రెహమాన్. తన సంగీత మాధుర్యంతో ఆస్కార్ అవార్డు సైతం సొంతం చేసుకున్నారు. ఆయన మ్యూజిక్ గురించి.. అందులోని మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  ఇటీవల లండన్ లో నిర్వహించిన ఓ కాన్సర్ట్ లో రెహమాన్ పై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేయడంతో పాటు ఆ ప్రోగ్రాం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు.

ఆ మ్యూజిక్ కాన్సర్ట్ లో రెహమాన్ తమిళ పాటలు ఎక్కువగా పాడారని... హిందీ పాటలు పెద్దగా పాడలేదంటూ కొందరు తెగ ఫీలైపోయారు. ఇదే కారణంతో ప్రోగ్రాం మధ్యలో బయటకు వెళ్లిపోవడంతోపాటు తమ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలంటూ నిర్వాహకులతో గొడవకు దిగారు. రెహమాన్ ఎన్నో లైవ్ మ్యూజిక్ ప్రోగ్రాంలు చేశాడు. కానీ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. రెహమాన్ పై ట్విట్టర్ లోనూ విమర్శలతో హోరెత్తించారు. ఈ విమర్శలకు రెహమాన్ మాత్రం చాలా హుందాగా బదులిచ్చాడు. ‘పాటలు వినేందుకు వచ్చిన వారిని మెప్పించడానికి మా శాయశక్తులా ప్రయత్నించాం.  ఇన్నేళ్ల కాలంలో మాకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. మీ అండ లేకుండా నేను లేను అంటూ’ఐఫా అవార్డుల వేదికగా బదులిచ్చాడు.

రెహమాన్ తీరుపై కామెంట్లు చేసిన వారిపై సోషల్ మీడియా గట్టి డోసే ఇస్తున్నారు. రెహమాన్ రెండు ఆస్కార్ లు తెచ్చిన భారతీయుడు. ఆయన ఆరేడు తమిళ పాటలు పాడినంత మాత్రాన అంత సీరియస్ అవ్వాల్సిన సీన్ ఏముందంటూ సింగర్ శ్రీపాద చిన్మయి ఘాటుగానే రిటార్ట్ ఇచ్చింది.  అసలు లండన్ లో జరిగిన కాన్సర్ట్ పేరే ‘నేట్రు ఇండ్రు నల్లాయ్’ (నిన్న - నేడు- రేపు). తమిళ్ పేరు పెట్టిన ప్రోగ్రాంకొచ్చి తమిళ పాటలు పాడారని ఫీలవడం కాస్తంత అతిగా లేదూ...

Tags:    

Similar News