అసోసియేష‌న్ లో ఏం జ‌రుగుతోంది ఇంత‌కీ?

Update: 2021-11-26 05:45 GMT
అసోసియేష‌న్ లో ఏం జ‌రుగుతోంది ఇంత‌కీ?
  • whatsapp icon
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ర‌చ్చ ఇప్ప‌ట్లో ఆగేట్టు లేదు. శివాజీరాజా అధ్య‌క్షుడిగా ఉండ‌గా సీనియ‌ర్ న‌రేష్ ఆధ్వ‌ర్యంలో ప్రారంభ‌మైన గొడ‌వ ఆ త‌ర్వాత ర‌క‌ర‌కాల మ‌లుపులు తీసుకుంది. శివాజీరాజా వ‌ర్సెస్ సీ.న‌రేష్ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ అయ్యింది. నాలుగేళ్లుగా ఈ ర‌చ్చ చూస్తూ ఉన్న‌దే. అయితే శివాజీ రాజాని ఓడించి సీనియ‌ర్ న‌రేష్ అధ్య‌క్షుడ‌య్యాక ర‌చ్చ ఆగుతుంద‌ని అనుకున్నారు. కానీ ఇరు వ‌ర్గాల న‌డుమా బాహాబాహీ సంచ‌ల‌న‌మే అయ్యింది. గొడ‌వ కంటిన్యూ అయ్యిందే కానీ త‌గ్గ‌లేదు.

ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఇది ప‌రాకాష్ఠ‌కు చేరుకుంది. మెగా వ‌ర్సెస్ మంచు వార్ లా ప‌రిణ‌మించింది. ప్ర‌కాష్ రాజ్ అండ్ నాగ‌బాబు వ‌ర్గం.. మంచు విష్ణు- సీనియ‌ర్ న‌రేష్ వ‌ర్గం వార్ తెలిసిన‌దే. అటుపై ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్ పై మంచు విష్టు పంతం నెగ్గి అసోసియేష‌న్ కి అధ్య‌క్షుడ‌య్యారు. ఆ త‌ర్వాత కూడా ర‌చ్చ‌ను కంటిన్యూ చేశారు. ప్ర‌కాష్ రాజ్ వ‌ర్సెస్ మంచు విష్ణు వార్ ఇప్ప‌ట్లో ఆగేట్టు లేదు. ఇటీవ‌ల మంచు విష్ణు త‌న‌దైన శైలి కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు వెళుతున్నా విమ‌ర్శ‌లు త‌ప్ప‌డం లేదు. ప‌ద‌విలో లేకున్నా తాను మా అధ్య‌క్షుడిని ప్ర‌శ్నిస్తాన‌ని ప్ర‌కాష్ రాజ్ అన్నారు. దానికి త‌గ్గ‌ట్టే ఇప్పుడు అత‌డు వాయిస్ ని రైజ్ చేసారు.

అస‌లు ఎప్పుడు చూసినా మా అసోసియేష‌న్ ఆఫీస్ మూత‌ప‌డి ఉంటోంద‌ని .. తాము ఆఫీస్ కి వెళితే మూసివేసి తాళం వేయ‌డం క‌నిపిస్తోంద‌ని ప్ర‌కాష్ రాజ్ వ‌ర్గం ఆర్టిస్టులు ఆరోపిస్తున్నారు. ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయం ఓపెన్ చేయడం లేదని కొందరు నటీనటులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడిన నాటి నుంచి ఎప్పుడూ కూడా ఇలా జరగలేద‌ని తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఆఫీస్ మూత ప‌డితే తామంతా నిరాశగా వెనుతిరగాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇటీవ‌ల చ‌డీ చ‌ప్పుడు లేక‌పోవ‌డంతో ర‌చ్చ ముగిసింద‌ని భావించారు. కానీ ఇంత‌లోనే గొడ‌వ రాజుకుంది. దీనికి ప‌రిష్కారం ఏమిటో చూడాలి.
Tags:    

Similar News