'కార్తికేయ 2' ను మరోసారి వాయిదా వేస్తే పరిస్థితేంటి..?

Update: 2022-08-02 04:18 GMT
నిఖిల్ సిద్ధార్థ్ మరియు అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా చిత్రం ''కార్తికేయ 2''. చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆగష్టు 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోందని మేకర్స్ ప్రకటించారు.

'కార్తికేయ 2' సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీనికి తగ్గట్టుగానే దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. మరో పది రోజుల్లో థియేటర్లలోకి వస్తుందనుకుంటుండగా.. ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది.

అప్పుడెప్పుడో సెట్స్ మీదకు తీసుకొచ్చిన 'కార్తికేయ 2' సినిమా కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. అంతా ఓకే అనుకున్న తర్వాత రిలీజ్ కోసం జూలై 22వ తేదీని లాక్ చేశారు మేకర్స్. అయితే చివరి నిమిషంలో ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేశారు. అనంతరం ఆగస్ట్ 12న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

కానీ అప్పటికే ఆగస్ట్ 11న 'లాల్ సింగ్ చడ్డా'.. 12న 'మాచర్ల నియోజవర్గం' సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకొని ఉన్నాయి. డబ్బింగ్ చిత్రంతో పెద్దగా ఇబ్బందేమీ లేదు కానీ.. ఇండిపెండెన్స్ వీక్ లో రెండు తెలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద క్లాష్ ఏర్పడే పరిస్థితి వచ్చింది.

ఈ నేపథ్యంలో ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అవ్వడం శ్రేయస్కరం కాదని చెబుతూ 'కార్తికేయ 2' సినిమాని మరోసారి వాయిదా వేసుకోవాలని చిత్ర బృందం పై ఒత్తిడి తీసుకొస్తున్నారని టాక్ నడుస్తోంది. అందుకే ఇప్పుడు నిఖిల్ సినిమా విడుదలను ఒక రోజు వాయిదా వేస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి.

నిజానికి రిలీజ్ డేట్ విష‌యంలో ఇప్ప‌టికే రెండు సార్లు వెన‌క్కి వెళ్లిన నిఖిల్‌ కి ఆగ‌స్ట్ 12 కూడా అంత సుల‌భంగా దొర‌క‌లేదని ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు. రిలీజ్ డేట్స్ విష‌యంలో బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన సినిమాలను అటు ఇటు పుష్ చేస్తారంటారు క‌దా.. అది మా సినిమా విష‌యంలోనూ జ‌రిగిందని యువ హీరో అన్నారు.

ఆగ‌స్ట్ 12న 'కార్తికేయ 2' సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసేట‌ప్పుడు అది కూడా వ‌ద్ద‌న్నారు. అక్టోబ‌ర్‌ కి లేదా న‌వంబ‌ర్‌ కి వెళ్లిపోండి. మీ సినిమాకు థియేట‌ర్స్ దొర‌క‌వు. ఇప్పుడ‌ప్పుడే మీ సినిమా రిలీజ్ అవ్వ‌ద‌న్నారు. ఆరోజు నేను చాల ఏడ్చాను. బేసిగ్గా నేను స్ట్రాంగ్ ప‌ర్స‌న్‌ ని. నా సినిమా రిలీజ్ కాదు.. థియేట‌ర్స్ దొర‌క‌వ‌ని ఎప్పుడూ అనిపించ‌లేదు. మంచి సినిమాను తీశాం. సినిమా కోసం క‌ష్ట‌ప‌డతాం.. నువ్వు ఎంత క‌ష్ట‌ప‌డ్డా నీ సినిమా రిలీజ్ అవుదు అన్న‌ప్పుడు బాధేసింది అని నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశారు.

నిర్మాత‌లు ప‌ట్టుబ‌ట్టి ఆగస్ట్ 12న వ‌స్తున్నామ‌ని అనౌన్స్ చేశారు. మా సినిమాకు థియేట‌ర్స్ దొరుకుతాయ‌ని అనుకుంటున్నాను. రెండు సినిమాలు ఒకేసారి విడుద‌లైతే క్లాష్ అవుతాయి. ఓపెనింగ్స్ డివైడ్ అవుతాయి. ఇది నిజ‌మే. కానీ ఏ డేట్ లేన‌ప్పుడు ఎక్క‌డో ఒక‌చోట క్లాష్ అవ్వాలి. నాకు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. మా నిర్మాత‌ల‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. వాళ్ల కోస‌మైనా ఈ సినిమా మంచి హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అని నిఖిల్ అన్నారు.

రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే క్లాష్ ఉంటుంది. కాకపోతే నిఖిల్ అన్నదాంట్లోనూ వాస్తవముంది. ఇది మిస్ అయితే 'కార్తికేయ 2' కు మరో మంచి డేట్ దొరకడం కష్టమే. ఎందుకంటే రాబోయే వారం నుంచి వచ్చే సంక్రాంతి వరకూ పెద్ద సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ని బ్లాక్ చేసుకొని ఉన్నాయి. కచ్చితంగా ఏదొక సినిమాతో పోటీ పడాల్సి ఉంటుంది.

ఇప్పుడు ఇండిపెండెన్స్ వీక్ లో రిలీజ్ చేస్తే మూడు రోజుల వీకెండ్ ప్రయోజనం చేకూరుతుంది. కానీ ఇప్పుడు ఆగస్ట్ 13వ తేదీకి 'కార్తికేయ 2' ను పోస్ట్ పోన్ చేస్తారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒక రోజు లేట్ గా వచ్చినా పోటీ మాత్రం తప్పదు. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా సెలవులను క్యాష్ చేసుకుని, బాక్సాఫీస్ బరిలో విజేతగా నిలుస్తుంది.

గతంలో అనేక సందర్భాల్లో సంక్రాంతి - దసరా వంటి సీజన్లలో ఒకేసారి విడుదలైన సినిమాలన్నీ ప్రేక్షకాదరణ పొందడాన్ని మనం చూశాం. ఇటీవల ఒకే రోజు థియేటర్లలోకి వచ్చిన 'మేజర్' 'విక్రమ్' సినిమాలు రెండూ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు 'కార్తికేయ 2' 'మాచర్ల నియోజకవర్గం' చిత్రాలు అదే రిజల్ట్ ని రిపీట్ చేస్తారేమో చూడాలి.
Tags:    

Similar News