'దృశ్యం 3' ఎప్పుడంటే..?

Update: 2021-12-02 08:49 GMT
అత్యంత ప్రజాదరణ పొందిన ప్రాంఛైజీ సినిమాల్లో ''దృశ్యం'' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మలయాళంలో మోహల్ లాల్ ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన రెండు భాగాలూ విజయవంతం అయ్యాయి. ఓ మధ్యతరగతి కుటుంబంలో అనుకోని సంఘటన కారణంగా కష్టాలు ఎదురైతే.. ఆ కుటుంబ పెద్ద తన వారిని ఎలా కాపాడుకున్నాడన్న కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్ ఈ సినిమాలను తీర్చిదిద్దారు.

'దృశ్యం' సినిమా తెలుగు, తమిళ, కన్నడ హిందీలతో పాటుగా పలు ప్రధాన భారతీయ భాషల్లో రీమేక్‌ చేయబడి.. అక్కడా ఘన విజయం సాధించింది. ఇదే క్రమంలో వచ్చిన 'దృశ్యం 2' మూవీ తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చేశారు. ఇటీవలే నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. త్వరలోనే కన్నడ రీమేక్ కూడా రిలీజ్ కాబోతోంది.

అయితే 'దృశ్యం 2' ఆశించిన స్థాయిలో విజయం సాధించడంతో దర్శకుడు జీతూ జోసెఫ్ మూడవ భాగాన్ని కూడా రూపొందిస్తే చూడాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే జీతూ మాత్రం ఈ ప్రాంఛైజీలో మూడో చిత్రానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయ‌ని అంటున్నారు. దీని కోసం రెండు మూడేళ్ల సమయం పట్టవచ్చని అభిప్రాయ పడ్డారు.

ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన జీతు జోసెఫ్.. ''నేను 'దృశ్యం-3' కోసం పని చేస్తున్నాను. క్లైమాక్స్ సిద్ధంగా ఉంది. ఇప్పటికే మోహన్‌ లాల్ తో కూడా ఈ ఐడియా గురించి చర్చించాను. ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు'' అని చెప్పారు. ''కానీ క్లైమాక్స్‌ కి చేరుకోవడానికి నేను ఇంకా చాలా సన్నివేశాలు రాయాలి. దానిపై పని చేస్తున్నాను. నాకు మంచి ఐడియాస్ వస్తే స్క్రిప్ట్ రెడీ చేస్తాను. అంతేకానీ థర్డ్ పార్ట్ చేయాలి అనే ఉద్దేశ్యంతో ఏవొక సీన్స్ తో సినిమా చేయడం నాకు ఇష్టం లేదు'' అని దర్శకుడు చెప్పుకొచ్చారు.

ఇటీవల హీరో వెంకటేష్ సైతం 'దృశ్యం 3' మీద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'దృశ్యం 2'కు కొనసాగింపుగా 'దృశ్యం 3' తెరకెక్కించాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదని అన్నారు. జీతూ మైండ్‌ లో ఏముందో తనకు తెలియదని.. ఒకవేళ ఈ సీక్వెల్‌ ను తీయాలంటే కథను రాయడానికే సుమారు మూడేళ్ల సమయం పడుతుందని వెంకీ తెలిపారు. మరి అన్నీ కుదిరి త్వరలోనే ఈ ప్రాంఛైజీలో మరో సినిమా తెరకెక్కుతుందేమో చూడాలి.   
Tags:    

Similar News