అస‌లింత‌కీ `మా` ఎన్నిక‌లు ఎప్పుడంట‌..!

Update: 2021-07-17 14:30 GMT
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల ర‌చ్చ చూస్తున్న‌దే. ఈసారి మునుపెన్న‌డూ లేనంత హంగామా క‌నిపిస్తోంది. ఏకంగా ఆరుగురు అధ్య‌క్ష ప‌ద‌విపై క‌న్నేసి నువ్వా నేనా? అంటూ ఎవ‌రికి వారు ప్ర‌చార‌బ‌రిలో ఉన్నారు. ఎన్నిక‌లు తేదీ ప్ర‌క‌టించ‌కుండానే పోటీ దారుల మ‌ధ్య నువ్వా?  నేనా? అన్న‌ట్లు  యుద్ధ వాతార‌ణం అలుముకుంది. మ‌రోవైపు ఏక‌గ్రీవం చేయాలంటూ అభిప్రాయాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి ఈసారి ఏక‌గ్రీవం అవుతుందా?  పోటీ జ‌రుగుతుందా? అన్న‌ది ప‌క్క‌న‌బెడితే..అస‌లు `మా` ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రుగుతాయ‌న్న‌దానిపై ఇప్ప‌టికి స‌రైన క్లారిటీ లేదు.

`మా` ఎగ్జిక్యుటివ్ బాడీ ప‌ద‌వి కాలం ఈ ఏడాది మార్చి తో ముగిసింది. కానీ క‌రోనా రాక‌తో ఎన్నికలు జ‌ర‌గ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఎప్పుడు జ‌ర‌పాల‌న్న దానిపై కూడా స్ఫ‌ష్ట‌త లేదు. ఈ నేప‌థ్యంలో ఆ బాధ్య‌త‌ల‌న్నీ సీనియ‌ర్ న‌టుడు కృష్ణం రాజు చేతుల్లోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది. `మా` క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం అధ్య‌క్షుడిగా కృష్ణం రాజు ఉన్నారు. ఆయ‌న‌తో పాటు చిరంజీవి- మోహ‌న్ బాబు- ముర‌ళీ మోహ‌న్- జ‌య‌సుధ కూడా ఉన్నారు. అయితే చిరంజీవి ఆ బాధ్య‌త‌కి రాజీనామా చేసిన‌ప్ప‌టికీ అధ్య‌క్షుడు దాన్ని ఇంకా ఆమోదించ‌లేదు.

ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌లు ఎప్పుడు నిర్వ‌హించాల‌న్న దానిపై ఈ ఐదుగురితో కూడుకున్న సినీపెద్ద‌ల బృందం నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉందని ఫిలిం స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది. `మా` బాడీలో ఉన్న మిగ‌తా స‌భ్యులంతా నిర్ణ‌యం క్ర‌మ‌శిక్ష‌ణా సంఘానికే వ‌దిలేసిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుత ప‌రిస్థితులు దృష్ట్యా ఎన్నిక‌లు ఈ ఏడాది నిర్వ‌హించ‌కుండా వ‌చ్చే మార్చి వ‌ర‌కూ వెయిట్ చేస్తారా?  లేక హుటా హుటిన నిర్వ‌హిస్తారా? అన్న‌ది క‌మిటి నిర్ణ‌యం తీసుకోనుంది. ఒక‌వేళ వ‌చ్చే మార్చిలో ఎన్నిక‌లు అనుకుంటే అప్ప‌టివ‌ర‌కూ తాత్క‌లికంగా ఓ క‌మిటీ నియ‌మించి దాని ఆధ్వ‌ర్యంలో మా కార్య‌క‌లాపాలు జ‌రిగేలా చూడాల‌ని ఆలోచ‌న చేస్తున్న‌ట్లు తెలిసింది. అంతేకాదు తాత్కాలిక క‌మిటీ అధ్య‌క్షురాలిగా ఓ సీనియ‌ర్ న‌టికి ఆఫ‌ర్ ఇచ్చినా అంత‌గా ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ లేద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

సెప్టెంబ‌ర్ అన్నారు కానీ....!

నిజానికి మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు సెప్టెంబ‌ర్ లో జ‌రుగుతాయ‌ని ఇప్ప‌టికే ప్ర‌చారం సాగిపోయినా దానిపై సినీపెద్ద‌లు అధికారికంగా ధృవీక‌రించ‌లేదు ఇంకా. ప్ర‌కాష్ రాజ్ మాత్రం సెప్టెంబ‌ర్ ఎన్నిక‌లు అంటూ ఇప్ప‌టికే త‌న వ్యూహాల్ని తాను సిద్ధం చేసుకుని ఎన్నిక‌ల‌కు ప్రిప‌రేష‌న్ లో ఉన్నారు. అత‌డికి మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు నుంచి సంపూర్ణ మ‌ద్ధ‌తు ల‌భించ‌డంతో జోష్ మీదున్నారు. మ‌రోవైపు మంచు విష్ణు న్యూట్ర‌ల్ గా ఉన్నారు. మా భ‌వంతిని తానే నిర్మిస్తాన‌ని ప్ర‌క‌టించి పెద్ద బాంబ్ పేల్చారు. అయితే ప్ర‌కాష్ రాజ్ సైతం మా భ‌వంతి కి అవ‌స‌ర‌మ‌య్యే స్థ‌ల సేక‌ర‌ణ కోసం తెలంగాణ ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించార‌ని గుస‌గుస‌లు వేడెక్కిస్తున్నాయి. ఇక ప్ర‌కాష్ రాజ్ కి వ్య‌తిరేకంగా వీకే న‌రేష్ వ‌ర్గం త‌మ‌వంతు రాజ‌కీయాల్ని వేడెక్కించ‌డం తెలిసిన‌దే. ఈసారి ఎన్నిక‌ల్లో తెలంగాణ -మా అసోసియేన్.. తెలంగాణ క‌ళాకారులు అన్న‌ నినాదంతో న్యాయ‌వాది కం న‌టుడు సీవీఎల్ ర‌చ్చ చేస్తుండ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది.

జ‌య‌సుధ‌కు ఛాన్స్ ఉందా?

ఓవైపు మా ఎన్నిక‌ల్లో ఎవ‌రికి వారు రాజ‌కీయాలు చేస్తున్నా ఏక‌గ్రీవం చేయాల్సి వ‌స్తే అది కూడా ఒక మ‌హిళ‌ను ఎన్నుకోవాల్సి వస్తే స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ‌కు అవ‌కాశం ఉంటుంద‌న్న గుస‌గుస‌లు వినిపించాయి. ఎన్నిక‌ల బ‌రిలో జీవిత రాజ‌శేఖ‌ర్ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డుతున్నా కానీ త‌న‌కు ఆ ఛాన్స్ ఉందా లేదా అన్న‌ది పెద్ద స‌స్పెన్స్ గా మారింది.
Tags:    

Similar News