బెల్లంకొండ మీద ఈసారి డబ్బులు పోసేదెవరు?

Update: 2020-11-27 11:30 GMT
బెల్లంకొండ శ్రీనివాస్ తొలి చిత్రం ‘అల్లుడు శీను’ను మినహాయిస్తే మిగతావన్నీ బయటి బేనర్లలోనే చేశాడు. ఐతే అతనే పెద్ద స్టార్ హీరో వారసుడు కాదు. హిట్ల మీద హిట్లూ కొట్టేయలేదు. కానీ ప్రతి సినిమాకూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సెట్ అవుతారు. భారీ బడ్జెట్లు రెడీ అవుతాయి. అతడి మార్కెట్ స్థాయికి కొన్ని రెట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంటారు. సినిమాకు మంచి టాక్ వచ్చినా కూడా అవి బ్రేక్ ఈవెన్ కాలేనంతగా ఖర్చయిపోతుంటుంది. చాలా వరకు అతడి కెరీర్లో కాస్ట్ ఫెయిల్యూర్లే. అయినా బిందాస్ అన్నట్లుగా ఉంటారు నిర్మాతలు. దీనికి కారణం ఏంటన్నది బహిరంగ రహస్యమే. పేరుకు వేరే నిర్మాతలు ముందుంటారు కానీ.. అతడి సినిమాలకు చాలా వరకు ఫైనాన్స్ చేసేది తండ్రి బెల్లంకొండ సురేషే అన్నది ఇండస్ట్రీ వర్గాలకు బాగా తెలుసు. సినిమా విడుదల, బిజినెస్, నష్టాలొస్తే డిస్ట్రిబ్యూటర్లకు సెటిల్మెంట్.. ఇవన్నీ కూడా సురేషే చూసుకుంటాడు.

ఈ తరహాలోనే చాలా వరకు శ్రీనివాస్ బండి నడుస్తోంది. తెలుగులో ‘రాక్షసుడు’ మినహాయిస్తే శ్రీనివాస్‌కు ఇప్పటిదాకా నిఖార్సయిన హిట్టే లేదసలు. అలాంటి హీరో ఇప్పుడు బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్నాడు. ఇది చూసి ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికెగిరందట అనే సామెత గుర్తుకొస్తోంది జనాలకు. ఇంతకీ శ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూ మూవీకి ధైర్యం చేసి డబ్బులు పెడుతున్నది ఎవరు అని ఆరా తీస్తున్నారు జనాలు. ఆ నిర్మాత పేరు జయంతి లాల్ గద. పెన్ మూవీస్ అనే బేనర్ మీద హిందీలో కొన్ని చిన్న సినిమాలే నిర్మించాడు. ఆయన కొన్ని తెలుగు చిత్రాలను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశాడు. అందులో శ్రీనివాస్ సినిమా ‘జయజానకి నాయక’ కూడా ఉండటం విశేషం. డబ్బింగ్ సినిమాలతో ఉత్తరాదిన ఫేమ్ తెచ్చుకున్న తెలుగు హీరోల్లో శ్రీనివాస్ కూడా ఒకడు. అతడి ఊర మాస్ సినిమాలు అక్కడి మాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ ఫేమ్ చూసే శ్రీనివాస్‌ను బాలీవుడ్లో అరంగేట్రం చేయించడానికి ఆ నిర్మాత రెడీ అయినట్లున్నాడు. ఐతే దీనికి కూడా వెనుక నుంచి సురేష్ బ్యాకప్ లేకుండా ఉండదన్నది ఇండస్ట్రీ జనాల అభిప్రాయం.




Tags:    

Similar News