వంద సినిమాల ఇమేజ్ పని చేయలేదే

Update: 2019-02-24 06:25 GMT
ఇకపై ఎవరైనా దివంగత నటీనటుల మీద బయోపిక్కులు తీయాలంటే ఒకటికి రెండుసార్లు కాదు వంద సార్లు ఆలోచించుకోమనే హెచ్చరిక ఎన్టీఆర్ రూపంలో వచ్చేసింది. రెండు భాగాలూ ఒకదాన్ని మించి ఒకటి బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్సూరుమానిపించడంతో వసూళ్లు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో మొదటి రోజు కలెక్షన్ వర్మ ఆఫీసర్ కన్నా తక్కువగా వచ్చిందన్న వార్త నిన్న ఆన్ లైన్ తో పాటు సోషల్ మీడియాని కుదిపేసింది. ఎంత బ్యాడ్ టాక్ వచ్చిన స్టార్ హీరో సినిమా అయినా మొదటి మూడు రోజులు కీలకమైన సెంటర్స్ లో మంచి ఫిగర్స్ నమోదు చేస్తుంది. ఇది సహజం.

అయితే మహానాయకుడు ఈ ట్రెండ్ కు సైతం వ్యతిరేకంగా ఎవరో మీడియం రేంజ్ హీరో సినిమాలాగా పెర్ఫార్మ్ చేయడం చిన్న విషయం కాదు. అయితే ఇక్కడ బాలయ్య టీం చేసిన స్పష్టమైన పొరపాటు తగినంత పబ్లిసిటీ చేయకపోవడం. ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల ముందు వరకు కోరుకున్న బజ్ రావడానికి ఎంత చేయాలో అంతా చేసారు. దానికి తగ్గట్టే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. టాక్ కూడా బాగానే తెచ్చుకుంది. అయితే రెండో రోజు నుంచే అది నిలవడం కష్టమైపోయింది. మహానాయకుడుకు అందులో సగం కూడా చేయలేకపోయారు.

ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినా కొంత నయంగా ఉండేది కాని ఆ ఛాన్స్ కూడా వాడుకోలేదు. తీరా చూస్తే సగటు ప్రేక్షకుడికి అసలు మహానాయకుడు విడుదల అయ్యిందా లేదా అని అనుమానం కలిగేలా చేసారు. రెండో రోజు క్రాస్ రోడ్స్ లో డబ్బింగ్ సినిమా అంజలి ఉదయం షోకి 14 వేల చిల్లర రాబడితే మహానాయకుడు ఓ వెయ్యి రూపాయలు తక్కువే రాబట్టింది అంటే నమ్మగలమా. ఏదేమైనా కథానాయకుడు రిజల్ట్ తో నీరసపడిన క్రిష్ టీం దాని సీక్వెల్ కు సరైన ప్రమోషన్ చేయకపోవడం వల్ల తగిన మూల్యం చెల్లించుకుంటోంది
Tags:    

Similar News