ఏడాదికొక్క సినిమా.. తృప్తి లేదేమీ..

Update: 2019-02-06 05:03 GMT
అప్పట్లో నటశేఖర కృష్ణ ఏడాదికి ఎనిమిదికి పైగా సినిమాలు రిలీజ్ చేసేవాడట.. రోజులో 18 గంటలు మూడు షిఫ్టులు షూటింగ్ చేసేవాడట.. ఇక మన ఎన్టీవోడో ఏడాదికి ఆరు సినిమాలకు పైగా రిలీజ్ చేసిన సందర్భాలున్నాయి. ఇక శోభన్ బాబు, చిరంజీవి, కృష్ణం రాజు తదితర హీరోలంతా ఏడాదికి కనీసం మూడు సినిమాలతోనైనా అభిమానులను పలకరించేవారు. కానీ ఇప్పుడు మన స్టార్ హీరోల సినిమాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.ప్రస్తుత సినిమాలు నత్తకు నడక నేర్పే రీతీలో నెమ్మదిగా సాగుతున్నాయి.

అప్పటితో పోల్చితే ఆధునిక సౌకర్యాలు పెరిగాయి. దానికి అనుగుణంగా బడ్జెట్ కోట్లు దాటుతోంది.  కానీ సినిమాల ఆలస్యానికి కథల కొరత ప్రధాన కారణంగా కనిపిస్తోంది.. ఆ కథల వల్లే సినిమాలు ఆలస్యమవుతున్నాయి. స్టార్ హీరోలు సినిమాలు తీయడానికే వెనుకాడుతున్నారు. హరి బరీగా తీసిన సినిమాలు ఫ్లాప్ అయ్యి కోట్లు లాస్ అవడంతోపాటు హీరో ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతోంది. అందుకే మన హీరోలు ఇప్పుడు ఏడాదికి ఎన్ని సినిమాలు తీశామన్న లెక్క కన్నా.. బ్లాక్ బస్టర్ కోసం ఎన్ని ఏళ్లు అయినా ఎదురుచూస్తున్నారు. అంతేతప్ప ఏదో ఒక సినిమా ఒప్పుకొని తీయడం లేదు.  

టాలీవుడ్ ప్రయాణం మొదలై 75 ఏళ్లు దాటింది. ఎన్నో సినిమాలు.. ఎన్నెన్నో కథలు.. అన్నీ ప్రేక్షకులు చూసేశారు. ఏదైనా ఇప్పుడు చేయాలంటే కొత్తదనం కావాలి. కొత్త ఐడియాలు చేయాలి.. కొత్త కథలు రాయడం.. తీయడం అంత ఈజీ కాదు.. సీనియర్ డైరెక్టర్లు అయిన రాఘవేంద్రరావు, బీ. గోపాల్, కే. విశ్వనాథ్ లాంటి సీనియర్లే ఈ కాలం సినిమా ప్రపంచంలో ఇమడలేక రిటైర్ మెంట్ తీసుకున్నారు. ఇక సీనియర్ దర్శకులు కూడా ఓ మూసలో సినిమాలు తీస్తూ ఫ్లాపులు కొనితెచ్చుకుంటున్నారు. ఇప్పుడు సినిమాల ట్రెండ్ ఎవరిదయ్యా అంటే సృజనశీలురదే.. కొత్త దర్శకుల కాలం ఇప్పుడు నడుస్తోంది. రాజమౌళి, కొరటాల శివ లాంటి క్రియేటివ్ పర్సన్ లాంటి వాళ్లతో పాటు కొత్త కథలు, కొత్త ప్రయోగాలు చేసే వారికి ఇండస్ట్రీ దన్నుగా నిలుస్తోంది. వారి కొత్త ప్రయోగాలు కూడా హిట్ బాట పడుతున్నాయి.

హీరోలు కూడా ఆచితూచి సినిమాలు ఒప్పుకుంటున్నారు. ఓటమి ఎరుగకుండా దూసుకొచ్చిన అల్లు అర్జున్ కూడా ‘నా పేరు సూర్య’ తర్వాత డైలామాలో పడ్డారు. కొత్త హిట్ కొట్టే కథ కోసం ఆయన సినిమాలేవీ ఒప్పుకోకుండా వేచిచూస్తున్నారు. ఇక  చిరు సైరాలాంటి చారిత్రక కథను ఎంచుకొని వచ్చే ఆగస్టుకు మూహూర్తం పెట్టారు. మహేష్ ‘మహర్షి’తో ఈ సమ్మర్ లో పలకరిస్తున్నారు. నాగార్జున, వెంకటేశ్ కొత్త సినిమాలేవీ డేట్స్ ప్రకటించలేదు. బాలయ్య ఎన్టీఆర్ రెండోపార్ట్ కు రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్, రాంచరణ్-రాజమౌళి కాంబో ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. పవన్ సినిమాలు తీసే చాన్స్ లేదు. దేవరకొండ ఆరునెలలకో సినిమా తీస్తూ స్పీడుమీదున్నాడు. ఇక కొత్త హీరోల ప్రభావం స్వల్పమే.  దీంతో అప్పట్లో ఒక్కో హీరో ఆరు సినిమాలకు పైగా తీసి రిలీజ్ చేస్తే ఇప్పుడు స్టార్ హీరో ఏడాదికి ఒక్క సినిమా కోసమే కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కథలు, కొత్త దనం, బడ్జెట్ సహా అన్ని కలిసిపోయి తెలుగు ప్రేక్షకులు ఎంటర్ టైన్ మెంట్ కోసం వేచి చూసేలా చేస్తున్నాయి.
Tags:    

Similar News