నిర్మాత‌లంతా ఇక సారీల‌తో స‌రిపెడ‌తారేమో?

Update: 2021-07-20 08:45 GMT
అక్టోబ‌ర్ వ‌ర‌కూ ఓటీటీల్లో రిలీజ్ ల‌కు వెళ్ల‌కుండా వేచి చూడాల‌ని తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ నిర్మాత‌ల‌ను కోరింది. ఎగ్జిబిష‌న్ రంగాన్ని కాపాడేందుకు నిర్మాత‌లు విధిగా వేచి ఉండాల‌ని ఒక ర‌కంగా హెచ్చ‌రిక జారీ చేసింది. కానీ `నార‌ప్ప‌` చిత్రాన్ని నిర్మాత క‌ళైపులి ఎస్.థాను ఒత్తిడి మేర‌కు రిలీజ్ చేయాల్సి వ‌చ్చింద‌ని అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు వెల్ల‌డించారు. ఈ సినిమాని థియేట‌ర్ల‌లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నందుకు వెంక‌టేష్ ఎంతో బాధ‌ప‌డ్డార‌ని నిరాశ చెందార‌ని కూడా సురేష్ బాబు అన్నారు. కానీ సెకండ్ వేవ్ త‌ర్వాత థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉండ‌డంతో క‌ళైపులి ఎస్.థాను త‌న‌పై ఒత్తిడి తెచ్చార‌ని కూడా అన్నారు. అలాగే త‌న సినిమాని తాను ఏ వేదిక‌పై అయినా రిలీజ్ చేసుకునే హ‌క్కు నిర్మాత‌ల‌కు ఉంటుంద‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు.

తాము చెప్పిందే చేశారు. ఓటీటీ ల్లో నార‌ప్ప స్ట్రీమింగ్ అవుతోంది. త‌దుప‌రి ద‌గ్గుబాటి కాంపౌండ్ సినిమాలు క‌చ్ఛితంగా ఓటీటీల్లోనే రిలీజ‌య్యేందుకు ఆస్కారం క‌నిపిస్తోంది. థియేట‌ర్లు తెరిచినా జ‌నాల్ని కుటుంబ స‌మేతంగా రావాల‌ని పిలిచే హ‌క్కు మ‌న‌కు లేద‌ని కూడా డి.సురేష్ బాబు ఆవేద‌న చెందారు.

ఓవ‌రాల్ గా ఓటీటీలో త‌మ సినిమా రిలీజైనందుకు చాలా క‌ల‌తకు గుర‌య్యామ‌ని స‌ర్ది చెప్పారు. ఇక ఓటీటీలో మంచి డీల్ కుద‌ర‌డం వ‌ల్ల‌నే క‌ళైపులి ఎస్.థాను ఆఫ‌ర్ ని వ‌దులుకోలేద‌ని గ‌తంలో మ‌హ‌మ్మారీ వ‌ల్ల‌ క‌ర్ణ‌న్ విష‌యంలో 10కోట్లు న‌ష్టం ఎదురైంద‌ని కూడా తెలిపారు. ఆ భ‌యంతోనే నార‌ప్ప‌ను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నార‌ని త‌మ‌వైపు వెర్ష‌న్ వినిపించారు.

విక్ట‌రీ వెంక‌టేష్ సైతం నార‌ప్ప‌ను ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వ‌చ్చినందుకు నిరాశ చెందాన‌ని అభిమానుల‌ను నిరాశ‌కు గురి చేసినందుకు సారీ అని కూడా చెప్పారు. ఇప్పుడు నార‌ప్ప అస‌లు నిర్మాత క‌ళైపులి ఎస్.థాను కూడా మీడియాకి ట‌చ్ లోకి వచ్చారు. వెంక‌టేష్ అభిమానులను క్ష‌మించ‌మ‌ని కోరారు. ఏ ప‌రిస్థితిలో నార‌ప్ప‌ను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామో వివ‌రించి చెప్పారు.

``17 సంవత్సరాల తరువాత విక్ట‌రీ వెంకటేష్ తమిళ రీమేక్ లో నటించారు. నార‌ప్ప కోసం ఆయ‌న‌ అసాధారణమైన హార్డ్ వ‌ర్క్ చేశారు.  OTT విడుదలతో అందరూ కలత చెందుతున్నారని నేను అంగీకరిస్తున్నాను. ఇదంతా నా ఒత్తిడి వ‌ల్ల‌నే అని స్పష్టం చేయాలనుకుంటున్నాను. సురేష్ బాబు గారికి డిజిటల్ విడుదల ఇష్టం లేదు. OTT విడుదలకు సిద్ధంగా లేరు.. కానీ మే 14 న నారప్ప విడుదలను ప్రకటించినందున నేను అతనిపై ఒత్తిడి తెచ్చాను. రెండవ వేవ్ కారణంగా అనుకున్న‌ది జరగలేదు. మూడవ వేవ్ భయం ఉంది. పైగా  అనేక OTT ఆఫర్లు మా ముందుకు వస్తున్నాయి. దాంతో నేను సురేష్ బాబు గారి వద్దకు వచ్చి అతనిని ఒప్పించాను. అభిమానులందరికీ క్షమాపణ చెబుతున్నాను`` అని అన్నారు.

``నేను పంపిణీదారుడిని.. థియేటర్లలో సినిమాలు చూడటం నాకు చాలా ఇష్టం. కానీ ఈ నిర్ణయం అనివార్యం. నిర్మాతలు సురక్షితంగా ఉండ‌డం అవ‌స‌రం. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఓటీటీలో చూస్తారని ..ఇండ్ల‌లోనే సురక్షితంగా ఆనందిస్తారని ఆశిస్తున్నాం..`` అని థాను ముగించారు. నార‌ప్ప హీరో స‌హా నిర్మాత‌లంతా అభిమానుల‌కు సారీ చెప్పిన‌ట్టే.

ద‌గ్గుబాటి కాంపౌండ్ నుంచి మ‌రిన్ని ఓటీటీలోనే..

ద‌గ్గుబాటి సురేష్ బాబు కాంపౌండ్ నుంచి మ‌రిన్ని సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ కానున్నాయ‌ని స‌మాచారం. విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన దృశ్యం 2 ని ఓటీటీలోనే రిలీజ్ చేస్తార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అలాగే ద‌గ్గుబాటి రానా న‌టించిన విరాఠ‌ప‌ర్వం చిత్రాన్ని ఓటీటీకే విక్ర‌యించే యోచ‌న చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే దీనిని నిర్మాత‌లు అధికారికంగా వెల్ల‌డించాల్సి ఉంటుంది.
Tags:    

Similar News