జగపతిబాబు జోరు తగ్గనుందా?

Update: 2021-01-30 01:30 GMT
జగపతిబాబు మంచి ఆర్టిస్ట్ అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తొలి రోజుల్లో హీరోగా ఒక గాడిలోపడటానికి ఆయన కొంత సమయం తీసుకున్నప్పటికీ, ఆ తరువాత ఫ్యామిలీ హీరోగా సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఒకానొకదశలో ఆయన శోభన్ బాబు తరహాలో ఇద్దరు హీరోయిన్ల సినిమాలు చేసి మహిళా ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సంపాదించుకున్నారు. 'గాయం' సినిమా ఆయనను యూత్ కి కనెక్ట్ చేస్తే, 'అంతఃపురం' సినిమాలోని పాత్ర మాస్ ఆడియన్స్ కి చేరువ చేసింది. నాగార్జున .. వెంకటేశ్ జోరును తట్టుకుని నిలబడుతూ, ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు.

జగపతిబాబులో ప్రత్యేకమైన ఆకర్షణ ఆయన కళ్లు. యాక్షన్ .. ఎమోషన్ పండించడానికి అవసరమైన కళ్లు ఆయనవి. అందువలన జగపతిబాబు విలన్ గా కూడా రాణిస్తారని అప్పట్లోనే చాలామంది చెప్పుకున్నారు. అనుకున్నట్టుగానే ఆయన ఆ తరువాత కాలంలో విలన్ గా టర్న్ తీసుకున్నారు. 'లెజెండ్' సినిమా నుంచి విలన్ గా ఆయన ప్రయాణం మొదలైంది. మన మధ్యలోనే ఇంతటి పవర్ఫుల్ విలన్ ఉన్నాడా? అని ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయేలా జగపతిబాబు నటించారు. అప్పటి నుంచి ఆయన ప్రతినాయకుడిగా చెలరేగిపోయారు. విరుగుడు లేని విలనిజానికి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయారు.

అలాంటి జగపతిబాబు చేతిలో ప్రస్తుతం మంచి సినిమాలే ఉన్నాయి. కానీ ఆ తరువాత ఆయన జోరు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. తెలుగు సినిమా ఇప్పుడు భారీతనాన్ని సంతరించుకుని, పాన్ ఇండియా పేరుతో పరుగులు తీస్తోంది. హీరోలంతా కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడానికే ఆసక్తిని చూపుతున్నారు. వివిధ భాషల్లో ఒక సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేసుకోవడానికి ఇప్పుడు అవకాశాలు పుష్కలంగా ఉండటంతో పెద్ద నిర్మాతలు ఆ వైపే దృష్టి పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ విలన్లను తీసుకోవడానికే ఇక్కడి దర్శక నిర్మాతలు మొగ్గుచూపుతున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్టులకు సంబంధించి విలన్ పాత్రలకి గాను, జగపతిబాబు పేరు కాకుండా బాలీవుడ్ సీనియర్ స్టార్ల పేర్లే వినిపిస్తుండటం విచారకరం. జగపతిబాబు ఇటు ఫ్యాక్షన్ విలనిజాన్నీ .. అటు కార్పొరేట్ స్థాయి విలనిజాన్ని అద్భుతంగా పండించగలరనే విషయాన్ని ఆల్రెడీ 'నాన్నకు ప్రేమతో' .. 'అరవింద సమేత' సినిమాలు నిరూపించాయి. అందువలన జగపతిబాబు పాన్ ఇండియా స్థాయికి తగిన నటుడు అనే అభిప్రాయాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయి సినిమాల్లోను ఆయనకి పవర్ఫుల్ రోల్స్ దక్కాలని కోరుకుంటున్నారు.
Tags:    

Similar News